పార్లమెంట్ లో బిల్లులపై చర్చలు జరగకపోవడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో పార్లమెంట్ లో బిల్లులు చట్టాలుగా మారాలంటే నిర్మాణాత్మక చర్చలు జరిగేవని చెప్పారు. ప్రస్తుతం ఆ సంప్రదాయానికి పాతరేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చట్టాల రూపకల్పనలో గందరగోళం నెలకొంటుందని పేర్కొన్నారు. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బార్ అండ్ బెంచ్ నిర్వహించిన జెండావిష్కరణ కార్యక్రమలో ఆయన పాల్గొని ఈ మేరకు మాట్లాడారు.
ప్రస్తుతం పార్లమెంట్ లో పరిస్థితులు దారుణంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. చర్చలు జరగకుండానే చట్టాలు ఆమోదం పొందడంతో వాటితో సమస్యలు వస్తున్నాయన్నారు. దీనిపై మేధావులు, న్యాయవాదులు విచారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. బిల్లుల ఆమోదం విషయంలో మాత్రం ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయన్నారు.
పార్లమెంట్ సజావుగా సాగే పరిస్థితులు లేవన్నారు. సుమారు 22 బిల్లులు ఆమోదం పొందడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు వీటిలో కీలకమైన ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు కూడా ఉందన్నారు. పన్ను చట్టాల సవరణ, సాధారణ బీమా విధాన సవరణ, జాతీయ ఆహార సాంకేతికత సంస్థ వ్యవస్థాపన నిర్వహణ బాలల న్యాయ సంరక్షణ సవరణ బిల్లులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జస్టిస్ రమణ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో పార్లమెంట్ నిర్వహణపై ఇప్పటికే పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో చట్టసభల్లో నిజాయితీ పరులకు బదులు అవినీతిపరులే అందలమెక్కుతున్నారు. ఈ క్రమంలో బిల్లుల రూపకల్పన సజావుగా సాగకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పార్లమెంట్ లో బిల్లులు చట్టాలుగా మారే సమయంలో కూలంకషంగా చర్చలు జరపాల్సిన విషయం గుర్తుంచుకోవాల్సిందే.