Pawan Kalyan- Chiranjeevi: పవన్ కళ్యాణ్ కు మంచి రాజకీయ భవిష్యత్ ఉందని చెప్పే వారి సంఖ్య ఇప్పుడు క్రమేపీ పెరుగుతోంది. జాతీయ స్థాయి నాయకుల నుంచి రాష్ట్రంలో కూడా చాలామంది నేతలు, స్ట్రాటజిస్టులు ఇప్పుడు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా తన తమ్ముడు గురించి ఇటువంటి కామెంట్సే చేశారు. పవన్ కచ్చితంగా ఉన్నత స్థానంలో ఉంటారని… అ సత్తా తన తమ్ముడికి ఉందంటూ ప్రకటించారు. దీనిపై జనసేనతో పాటు మెగా పవర్ అభిమానుల్లో ఒక రకమైన జోష్ నెలకొంది. అయితే ఉన్నత స్థానం అందిపుచ్చుకోవాలన్న క్రమంలో ఎలా ముందుకెళ్లాలో తెలియక పవన్ ఒక రకమైన డిఫెన్స్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అటు బీజేపీతో కలిసి వెళ్లాలా… లేక టీడీపీతో అలయెన్స్ కావాలా? అన్నది తేల్చుకోలేకపోతున్నారు.

బీజేపీ, జనసేన కలిసి పోటీచేస్తే వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక ఓటు అటు టీడీపీకి, ఇటు బీజేపీ,జనసేన కూటమి మధ్య చీలిపోయి అంతిమంగా జగన్ కు మేలు చేస్తుంది. ఇప్పటికే వైసీపీ విముక్త ఏపీకి పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని గద్దె దించుతానని పలుమార్లు శపథం చేశారు. దానిని విస్మరిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్న ఆందోళన ఉంది. మరోవైపు బీజేపీని వీడి టీడీపతో దోస్తి కడితే ప్రధాని మోదీతో ఉన్న మంచి సంబంధాలు దెబ్బతినే అవకాశముంది. పైగా టీడీపీ అధికారంలోకి వచ్చినా.. విపక్షంలో ఉన్నా సహకరిస్తునే ఉండాలి. ఆ పార్టీకి మిత్రపక్షంగానే కొనసాగాలి. అంతకంటే పవన్ కు ఆప్షన్ లేకపోవడమే దానికి కారణం.
టీడీపీతో కలిసి నడిస్తే సీఎం అయ్యే చాన్స్ ఉంటుందా? అంటే దానికి సమాధానం లేదు. పైగా సంస్థాగతంగా బలంగా ఉన్న టీడీపీ అందుకు ఒప్పుకునే పరిస్థితులు లేవు. బీజేపీ పెద్దలు కూడా పవన్ కు అదే చెబుతున్నారు. ఒక వేళ టీడీపీతో పవన్ కలిసినా.. అది చంద్రబాబును సీఎం చేసేందుకు అక్కరకు వస్తుందని.. పవన్ సీఎం అయ్యే చాన్స్ రాదని హితబోధ చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమి కట్టి ఎన్నికలకు వెళితే వచ్చే ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషించే అవకాశముంటుందని.. 2029 ఎన్నికల్లో సొంతంగా అధికారంలోకి రావడానికి రాచమార్గంగా మారుతుందని బీజేపీ పెద్దలు పవన్ కు సూచిస్తున్నారుట. అయితే పవన్ మాత్రం ఏదీ తేల్చుకోలేకపోతున్నారు. తుది నిర్ణయానికి రాలేకపోతున్నారు. అటు పొత్తుల అంశాన్ని సజీవంగా ఉంచుతునే.పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు.

అయితే ఇప్పుడు అన్నయ్య మెగాస్టార్ నుంచి సపోర్టు లభిస్తుండడంతో పవన్ కూడా ఖుషీ అవుతున్నారు. రాజకీయాల్లో కొనసాగాలంటే గడ్స్ ఉండాలని.. దూకుడు స్వభావం అవసరమని .. పవన్ లో అవి పుష్కలమని చిరు కామెంట్స్ చేశారు. ప్రస్తుతం చిరంజీవికి ప్రధాని మోదీతో పాటు కేంద్ర పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నాయి. అటు బీజేపీలో చేరమని ఆహ్వానాలు అందినట్టు వార్తలు వచ్చాయి. భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణకు విచ్చేసిన ప్రధాని మోదీ వేదిక పంచుకున్న సీఎం జగన్ కంటే చిరంజీవికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ఇప్పుడు అదే చిరంజీవి పవన్ ఉన్నత స్థానంలో ఉంటారని చెబుతుండడం.. అటు బీజేపీ పెద్దలు కూడా అవే సంకేతాలు ఇస్తుండడంతో లోలోపల ఏదో జరుగుతుందన్న అనుమానాలను విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. కొద్దిరోజుల్లో అవి బయటపడే చాన్స్ ఉందని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు.