Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ పదవి ఇవ్వనున్నారా? యూపీ నుంచి ఆయనకు బెర్త్ ఖాయమైందా? నేరుగా కేంద్రమంత్రి పదవి ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో బలమైన చర్చ నడుస్తోంది. గత కొంతకాలంగా చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. రాజకీయాల వైపు ఇక వెళ్ళనని కూడా చిరంజీవి తేల్చేశారు. అయితే చిరంజీవి కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలు కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.
ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి ఉమ్మడి ఏపీలో 18 ఎమ్మెల్యే సీట్లను సాధించారు. తర్వాత తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. కేంద్రమంత్రి పదవి చేపట్టారు. రాష్ట్ర విభజన తరువాత సైలెంట్ అయ్యారు. రాజ్యసభ పదవీకాలం పూర్తి కావడంతో రాజకీయాలకు దూరమయ్యారు. సినిమాలను వదిలి రాజకీయాల్లోకి వెళ్లి తప్పు చేశానని బాధపడ్డారు. వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇకనుంచి సినిమా రంగంలో మాత్రమే కొనసాగుతానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కానీ చిరంజీవి కోసం బిజెపి ప్రయత్నాలు చేస్తూనే ఉందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల అటువంటి ప్రయత్నాలు పెరిగినట్లు తెలుస్తోంది.
మొన్నటికి మొన్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలకు చిరంజీవికి ప్రత్యేకంగా ఆహ్వానం అందింది. కుటుంబ సమేతంగా ఆయన అయోధ్యకు వెళ్లారు. అటు తరువాత దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారంగా భావించే పద్మ విభూషణ్ కు చిరంజీవిని ఎంపిక చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఐదుగురు ప్రముఖులను ఎంపిక చేయగా అందులో చిరంజీవి ఒకరు కావడం విశేషం. మరోవైపు దేశవ్యాప్తంగా రాజ్యసభ స్థానాలు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. మొత్తం 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో చిరంజీవి పేరు మరోసారి బయటకు వచ్చింది. ఆయనను యూపీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేస్తారన్న ప్రచారం బలంగా జరుగుతోంది.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించాలని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ గట్టి పట్టుదలతో ఉంది. అందుకే కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగా ఏపీ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. 2029 నాటికి స్వతంత్రంగా ఎదగాలని భావిస్తోంది. అందులో భాగంగా బలమైన సామాజిక వర్గాలను తన వైపు తిప్పుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన చిరంజీవిని తిప్పుకోగలిగితే ఏపీలో బిజెపి బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ఆ దిశగా బిజెపి ప్రయత్నాలు మొదలు పెట్టింది. చిరంజీవికి రాజ్యసభ పదవితో పాటు కేంద్ర క్యాబినెట్లో సైతం చోటు కల్పించనున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే ఇప్పటికే సోదరుడు పవన్ రాజకీయాల్లో ఉన్నారు. ఒకసారి రాజకీయ అరంగేట్రం చేసి తప్పు చేశానని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఈ తరుణంలో బిజెపి ప్రయత్నాలను ఆయన ఒప్పుకుంటారా? లేదా? అన్నది చూడాలి. గతంలో చిరంజీవిపై ప్రచారం జరిగినప్పుడు ఆయనే స్వయంగా స్పందించారు. ఆ ప్రచారాన్ని ఖండించారు. ఇప్పుడు కూడా ఖండిస్తారో? లేకుంటే ఈ ప్రచారం నిజమని చెబుతారో? అన్నది చూడాలి.