Chiranjeevi- YCP: వైసీపీ చీప్ ట్రిక్కులకు చిరంజీవి చెక్ చెప్పారు. ఇంతకాలం చిరంజీవి తమవాడేనన్నట్టు వైసిపి బిల్డప్ ఇచ్చింది. ఎంతలా అంటే ఆయనకు రాజ్యసభ పదవి కట్టబెడుతున్నట్లు కూడా మీడియా కు లీకులిచ్చింది. పవన్ ను కట్టడి చేసే ప్రయత్నంలో చిరంజీవి పేరును తరచూ ఉపయోగించేది. అయితే సరిగ్గా ఎన్నికలకు 10 నెలల వ్యవధి ముందు చిరంజీవి మేల్కొన్నారు. రెండు నిమిషాల పాటు ప్రసంగించి వైసిపి పై బాంబు పేల్చేశారు. దీంతో వైసిపి కిందా మీద పడుతోంది. ఇంతకాలం చిరంజీవిపై చూపిన అభిమానం నిజం కాదని.. అదంతా రాజకీయమేనని తనంతట తానుగా వైసిపి ప్రకటించుకుని.. అసలు స్వరూపాన్ని బయటపెడుతోంది.
జనసేన పై వైసీపీ చాలా ఏళ్లుగా టార్గెట్ చేస్తూ వస్తోంది. అదే సమయంలో చిరంజీవి పై అభిమానం చూపుతోంది. కాపు సామాజిక వర్గం తమ నుంచి దూరం కాకుండా చూసేందుకు చిరంజీవి పై ఎనలేని ప్రేమ కనబరుస్తూ వచ్చింది. పవన్ కు చిరంజీవి వ్యతిరేకమైనట్టు కొందరితో ప్రకటనలు కూడా ఇప్పించింది. చిరంజీవి, పవన్ ను అభిమానించే వారిలో చీలిక తేవడమే వారి లక్ష్యం. అయితే సున్నిత మనస్తత్వం కలిగిన చిరంజీవి ఇంతకాలం లైట్ తీసుకున్నారు.
పవన్ ను తిడుతూనే చిరంజీవిపై చాలామంది వైసీపీ నేతలు సానుకూలత చూపించేవారు. పవన్ కారణంగా చిరంజీవి మాట పడాల్సి వస్తుందని చెప్పుకొచ్చేవారు. చాలామందికి చిరు సారీ చెప్పాల్సి వస్తుందని పోసాని కృష్ణ మురళి లాంటివారు ప్రకటన చేశారు. చిరంజీవి వైసీపీకి మద్దతు దారు అనే అభిప్రాయాన్ని అభిమానులకు బలంగా పంపించడమే వీరి ఉద్దేశం. ఇటువంటి వారికి తాజా వ్యాఖ్యలతో చిరంజీవి చెక్ చెప్పారు. ఇది వైసీపీ నేతలకు మింగుడు పడడం లేదు. ఇన్నాళ్లు తమ వాడే అని చెప్పుకొచ్చిన చిరంజీవి పైనే వాళ్ళు విరుచుకు పడడం ప్రారంభించారు.
వాస్తవానికి చిరంజీవి మృదుస్వభావి. ఆయన ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ వ్యాఖ్యలు చేయరు అన్నది వైసీపీ నేతల నమ్మకం. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని చిరంజీవి ప్రకటించారు. దీంతో చిరంజీవిని అడ్డం పెట్టుకొని పవన్ ను నియంత్రించాలని వైసిపి నేతలు భావించారు.కానీ చిరంజీవి అకస్మాత్తుగా స్పందించడం.. నేరుగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో వారికి షాక్ తగిలింది. సైలెంట్ గా ఉంటూనే.. వైసీపీకి చిరంజీవి చావు దెబ్బ కొట్టారు.