Chennai Paper Tata: పాతిక సంవత్సరాలకే పొట్ట.. 30 సంవత్సరాలకే బట్ట.. 35 సంవత్సరాలకే మధుమేహం.. 40 ఏళ్లకే దాడి చేస్తున్న రోగాల సమూహం.. అడుగు తీసి అడుగు వేయాలంటే కష్టం. తీపి తింటే మధుమేహం. కారం తింటే అల్సర్.. ఉప్పు తింటే రక్తపోటు. కడుపునిండా అన్నం తినడం కూడా కష్టమే.. అలా మారిపోయింది జీవితం. శారీరక శ్రమ లేకపోవడం. ఆర్థిక స్థిరత్వం భారీగా పెరగడం వల్ల జీవన శైలి వ్యాధులు సోకుతున్నాయి. ఫలితంగా సగటు ఆయుర్దాయం పడిపోతోంది. అంతేకాదు వ్యాధుల వల్ల యువత తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం మందులకే సరిపోతుంది. అయితే ఇలాంటి రోజులు ఉన్న ఈ కాలంలో 94 సంవత్సరాల వయసు ఉన్న ఓ వృద్ధుడు చలాకీగా తిరుగుతున్నాడు. ఉదయం 3 గంటల 30 నిమిషాలకే తను దినచర్యను మొదలు పెడుతున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? అతడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఇంత వయసు వచ్చిన సరే అతనికి ఎటువంటి అనారోగ్యం సోకలేదా? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.
అతని పేరు షణ్ముఖ సుందరం. ఉండేది చెన్నై నగరంలో. ఇతడికి భార్య.. ఆరుగురు పిల్లలు ఉన్నారు. వారికి వివాహాలు జరిగాయి. వారి పిల్లలకు కూడా పెళ్లిళ్లు జరిగాయి. ఒకరకంగా షణ్ముఖ సుందరానిది చాలా పెద్ద కుటుంబం. షణ్ముఖ సుందరం గడిచిన 25 సంవత్సరాలుగా చెన్నై నగరంలో పేపర్ వేస్తున్నాడు. ఇతడిని పేపరుతాత అని పిలుస్తుంటారు. ఉదయాన్నే మూడు గంటలకు 30 నిమిషాలకు ఇతడి దినచర్య మొదలవుతుంది. ఆ తర్వాత వచ్చిన పేపర్లను మొత్తం సర్దుకుంటాడు. సైకిల్ మీద చెన్నైలో తనకు కేటాయించిన ప్రాంతాలలో పేపర్ వేస్తుంటాడు. పేపర్ తో పాటు పాల ప్యాకెట్లు కూడా వేస్తుంటాడు.. వాస్తవానికి కుటుంబ బాధ్యతలు తీరిపోయిన తర్వాత ఇతడు 2000 సంవత్సరంలో పేపర్ వేయడానికి మొదలుపెట్టాడు. అప్పటికి అతని వయసు 69. ఆ వయసులో కూడా అతడు సైకిల్ తొక్కాడు. పేపర్ వేయడం మొదలుపెట్టాడు..
Also Read: కాశ్మీర్‌లో రికార్డు స్థాయిలో వేడి? ఇంతకీ ఏమైంది?
ఎంత జ్వరం వచ్చినా సరే.. ఎంతటి అనారోగ్యం ఉన్నా సరే పేపర్ తాత తన దినచర్యను వదిలిపెట్టడు. భారీగా వర్షం వచ్చినా సరే.. గడ్డకట్టే చలిలో అయినా సరే పేపర్ వేస్తూనే ఉంటాడు. అంతేతప్ప తనకు అనారోగ్యంగా ఉందని.. వాతావరణం సహకరించడం లేదని కారణాలు చెప్పడు. నేటి కాలంలో యువత చిన్న చిన్న పనులకే బైకులు కార్ల మీద వెళ్తున్నారు. కానీ పేపర్ తాత మాత్రం సైకిల్ మాత్రమే ఉపయోగిస్తాడు. సైకిల్ ద్వారా మాత్రమే వెళ్తాడు. ఇప్పటికీ అతని కుటుంబం ఆర్థికంగా స్థిరపడింది. అయినప్పటికీ తన కష్టించి పనిచేసే విధానాన్ని మాత్రం పేపర్ తాత మర్చిపోలేదు..”నాకు 94 సంవత్సరాల వయసు. ఇప్పటికీ ఆ శరీరం సహకరిస్తుంది. నేను పని చేస్తూనే ఉంటాను. పేపర్ వేస్తూనే ఉంటాను. పేపర్ వేసే పని లేకపోతే నాకు ఏమీ తోచదు. ఏదో కోల్పోయినట్టు ఉంటుంది. అందువల్లే పేపర్ వేయడాన్ని నేను ఇష్టంగా భావిస్తుంటానని” షణ్ముగం చెబుతున్నాడు. పేపర్ వేయడం ద్వారా, పాల ప్యాకెట్లు వేయడం ద్వారా నెలకు షణ్ముగం 10,000 వరకు సంపాదిస్తున్నాడు. చెన్నై నగరంలో సొంత ఇల్లు ఉండడంతో ఆ డబ్బులు పేపర్ తాత, అతడి భార్యకు సరిపోతున్నాయి. అన్నట్టు ఇంతటి వయసులో కూడా పేపర్ తాత దంపతులకు ఎటువంటి రోగాలు లేవు.