Janasena Candidate: ఉత్తరాంధ్రలో జనసేన ప్రకటించిన అభ్యర్థులు ఇద్దరు. అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, నెల్లిమర్ల నుంచి లోకం మాధవి లు ఉన్నారు. అయితే ఇందులో కొణతాల రామకృష్ణ విషయంలో ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాకున్నా.. లోకం మాధవి(Madhavi Lokam) విషయంలో మాత్రం చాలా రకాల అభ్యంతరాలు వస్తున్నాయి. సొంత పార్టీ శ్రేణుల నుంచి ఒక రకమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ఆమె అభ్యర్థిత్వాన్ని మార్చాలన్న డిమాండ్ పవన్ కు చేరినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను వేరే నియోజకవర్గానికి పంపించే ఆలోచనలో పవన్ ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే ఇక్కడ టిడిపికి లైన్ క్లియర్ అయినట్టే.
విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీకి బలం ఉంది. పూర్వాశ్రమంలో ఈ నియోజకవర్గ సతివాడగా ఉండేది. 2009లో నెల్లిమర్ల నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. ఈ నియోజక వర్గం నుంచి మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో వృద్ధాప్యం కారణంగా చంద్రబాబు ఆయనను తప్పించారు. నియోజకవర్గ ఇన్చార్జిగా కర్రోతు బంగార్రాజును నియమించారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పార్టీ బలోపేతానికి బంగార్రాజు కృషి చేశారు. వచ్చే ఎన్నికల్లో ఈయనకే టికెట్ అని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఈ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించారు. లోకం మాధవిని ప్రకటించారు.
లోకం మాధవి విద్యా సంస్థలను నిర్వహిస్తుంటారు. ఈమె బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారు. ఆమె భర్త లోకం ప్రసాద్ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కాపు నాయకుడు. అయితే నెల్లిమర్లలో ఉండేదంతా బిసి వర్గానికి చెందిన తూర్పు కాపులు. దీంతో మాధవి అభ్యర్థిని వారు వ్యతిరేకిస్తున్నారు. తూర్పు కాపులకే సీటు కేటాయించాలని కోరుతున్నారు. లోకం మాధవి అయితే ఓటమి ఖాయమని ఎక్కువమంది పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పవన్ పునరాలోచనలో పడినట్లు సమాచారం. మాధవిని విశాఖ దక్షిణం నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ బ్రాహ్మణ సామాజిక వర్గం అధికం. గతంలో ఇదే నియోజకవర్గంలో నుంచి ద్రోణంరాజు సత్యనారాయణ, ద్రోణంరాజు శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహించారు. అందుకే ఆ సీటు అయితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందిన నేతలు టిడిపి అధినేత చంద్రబాబును కలిశారు. నెల్లిమర్ల జనసేనకు కేటాయిస్తే తప్పకుండా ఓటమి ఖాయమని తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో చంద్రబాబు సైతం సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ లోకం మాధవికి విశాఖ దక్షిణ నియోజకవర్గం కేటాయిస్తే నెల్లిమర్ల తెలుగుదేశం పార్టీకి లైన్ క్లియర్ అయినట్టే. ఇప్పటికే ఇక్కడ ఇన్చార్జిగా ఉన్న బంగారు రాజు ప్రజల్లోకి బలంగా వెళ్లారు. పార్టీ శ్రేణులతో మమేకమై పనిచేస్తూ వచ్చారు. మొన్నటికి మొన్న లోకేష్ పాదయాత్ర విజయోత్సవ సభ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. ఆర్థికంగా బలమైన నేత కూడా. అందుకే చంద్రబాబు ప్రత్యేక ఆలోచనతో.. పవన్ తో ఈ సీటు విషయమై చర్చించినట్లు సమాచారం. ఇక్కడ అభ్యర్థి మార్పు తప్పదని తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.