Chandrababu: తన కేసుల విషయంలో చంద్రబాబు పక్కా ప్లాన్ తో వ్యవహరిస్తున్నారా? జగన్ సర్కార్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇవ్వాలని భావిస్తున్నారా? తనపై అవినీతి మరక అంటకుండా చేసుకుంటున్నారా? అందుకే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును ఏసీబీ కోర్టు రెండు వారాల రిమాండ్కు పంపింది. ఇలా రిమాండ్ కు పంపే క్రమంలో బెయిల్ కోసం మరో పిటిషన్ వేసుకునే అవకాశం ఉన్నప్పటికీ చంద్రబాబు మౌనంగా ఉండి పోయారు. ఇతరత్రా కేసులు విషయంలో మాత్రం ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. దీని వెనుక ఏదో ఒకటి ఉందన్న అనుమానాలు చంద్రబాబు ప్రత్యర్థి వర్గాలను వెంటాడుతున్నాయి.
వాస్తవానికి ఈ కేసులో చంద్రబాబును రిమాండ్కు పంపాలంటూ సిఐడి దాఖలు చేసిన పిటిషన్ తో కోర్టు ఏకీభవించింది. చంద్రబాబుకు 14 రోజులు పాటు రిమాండ్ విధించింది. అయితే వెంటనే బెయిల్ పిటిషన్ దాఖలు చేసి బయటపడే అవకాశం ఉన్నప్పటికీ.. చంద్రబాబు అలా చేయలేదు. అటు సిఐడి సైతం తాము స్టేషన్ బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. కోర్టులోనే బెయిల్ తెచ్చుకోవాలని సూచించింది. అయినా సరే చంద్రబాబు బెయి ల్ కు మొగ్గు చూపలేదు. ఏసీబీ కోర్టులో, హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారని భావించినా.. అలా జరగలేదు.
చంద్రబాబును వీలైనంత ఎక్కువ రోజులు రిమాండ్ లో ఉంచాలన్న ఉద్దేశంతో ఏపీ సర్కార్ పాత కేసులను సైతం తిరగదోడింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసుతో పాటు పుంగనూరు, అంగళ్ళు హింసాత్మక కేసును తెరపైకి తెచ్చారు. చంద్రబాబును కస్టడీకి కోరారు. గమ్మత్తు ఏంటంటే.. అసలు కేసు విషయంలో చంద్రబాబు బెయిల్ కోరలేదు. కానీ ఈ రెండు పిటిషన్లపై మాత్రం ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు. వాటిపై సైతం కోర్టు సానుకూలంగా స్పందించింది. అమరావతి ఇన్నర్ రోడ్ కేసుకు సంబంధించివిచారణను ఈ నెల 19 కి, అంగళ్లు కేసుకు సంబంధించి విచారణను ఈ నెల 20 కి వాయిదా వేసింది.
అసలైన స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ కోరకుండా.. మిగతా కేసుల్లో మాత్రమే ముందస్తు బెయిల్ కోరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. స్కిల్ కేసులో ఎఫ్ ఐ ఆర్ తో పాటు రిమాండ్ ను కొట్టివేయాలని చంద్రబాబు పిటిషన్ వేయడం గమనార్హం. ఈ కేసులో తాను నిర్దోషిగా భావిస్తున్న చంద్రబాబు.. బెయిల్ తీసుకుంటే రాజకీయంగా విమర్శల పాలు కాక తప్పదు. అందుకే కొద్ది రోజులు పాటు రిమాండ్ లో ఉన్నా… ఏకంగా కేసు కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చే ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ లోపు మిగతా కేసుల్లో సిఐడి కస్టడీకి ఇవ్వకుండా ముందస్తు బెయిల్ కు వ్యూహాత్మకంగానే పిటీషన్లు వేశారు. ఈనెల 19 తరువాత చంద్రబాబు విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని పలువురు న్యాయకోవిదులు, నిపుణులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.