Chandrababu: అవినీతి కేసులో చంద్రబాబు అరెస్టు అయిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో దాదాపు 52 రోజులు పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు ఉండిపోయారు. సుదీర్ఘ విరామం తర్వాత బెయిల్ లభించడంతో బయటకు వచ్చారు. అయితే అవినీతి నిరోధక చట్టంలోని 17a కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే అరెస్టు చేశారని.. అందువల్లే కేసు కొట్టివేయాలని చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఏసీబీ కోర్టు నుంచి హైకోర్టు వరకు చంద్రబాబుకు ఎక్కడా ఉపశమనం దక్కలేదు. చివరికి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. నిన్న సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పులు వెల్లడించింది.
సెక్షన్ 17 ఏ అనేది అవినీతి అరికట్టడానికి తప్ప.. కాపాడడానికి కాదంటూ ఏపీ సీఐడీ తరపు న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించారు. దీంతో హైకోర్టు 17a చంద్రబాబుకు వర్తించదని తీర్పు చెప్పింది. దీనిని సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు పిటిషన్ పై జడ్జిలు జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. కోర్టులో సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. దేశంలో పేరు మోసిన న్యాయవాదులు ఇరువైపులా వాదించారు. గత ఏడాది అక్టోబర్ 20న వాదనలు పూర్తయ్యాయి. కానీ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో ఈ పిటిషన్ పై తీర్పు ఎలా వస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
అయితే ఈ కేసులో న్యాయమూర్తులు భిన్న తీర్పులు వెల్లడించడం విశేషం. సెక్షన్ 17 ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధ బోస్ తీర్పు ఇచ్చారు. వర్తించదని జస్టిస్ బేలా త్రివేది తీర్పు ఇచ్చారు. దీంతో ఎటు తేలక పోవడంతో త్రిసభ్య ధర్మాసనానికి ఇవ్వాలని ద్విసభ్య ధర్మాసనం నిర్ణయించింది. ఈ పిటిషన్ పై చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది. సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నమైన తీర్పు ఇవ్వడంతో టిడిపి ఆశలు అడుగంటాయి. అటు వైసిపి సైతం దీనిపై స్పందించడానికి వీలు లేకపోయింది. ఒక తీర్పు చంద్రబాబుకు అనుకూలంగా ఉండగా.. మరో తీర్పు సిఐడికి ఫేవర్ చేస్తోంది. త్రిసభ్య ధర్మాసనానికి వెళుతుండడంతో ఇప్పట్లో కేసు తేలే అవకాశం లేనట్లు తెలుస్తోంది.