Chandra Babu Alliance: రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. పొత్తుల వ్యాఖ్యలు కాక పుట్టిస్తున్నాయి. అధికార పక్షానికి ఢీ కొట్టాలంటే రాజకీయ పునరేకీకరణ కావాలని.. విపక్షాలన్నీ ఒక్కటి కావాలని నేతలు పిలుపునిచ్చి పొత్తు సంకేతాలను పంపుతున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు పార్టీ కేడర్ తో సమావేశమయ్యారు. పొత్తుల పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రజా ఉద్యమం రావాలని.. అందుకు ప్రభుత్వ వ్యతిరేకులందరూ ఒకటి కావాలని పిలుపునిచ్చారు. ప్రజల కోసం తాము మిలిటెంట్లతో పోరాడుతున్నామని వైసీపీ శ్రేణులనుద్దేశించి మాట్లాడారు. అందుకే ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని.. అందుకు అన్ని పార్టీల నాయకులను ఒక వేదిక మీదకు తెస్తామని చెప్పుకొచ్చారు. దానికి టీడీపీయే నాయకత్వం వహిస్తుందని చెప్పడం ద్వారా పొత్తులు ఉంటాయని బహిరంగంగానే సంకేతాలు పంపారు. పొత్తుల్లో భాగంగా త్యాగం చేయాల్సి ఉంటుందని చెప్పడం ద్వారా పొత్తులకు రెడీగా ఉండండని టీడీపీ శ్రేణులను అన్నివిధాలా సంసిద్ధులను చేస్తున్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లో ఓటమి నాటి నుంచే చంద్రబాబు పొత్తులకు ప్రయత్నించారు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ నేత్రుత్వంలోని జనసేనతో కలిసి పోటీ చేయడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూసుకోవాలని భావిస్తున్నారు. అయితే అదే సమయంలో జనసేనాని కూడా పార్టీ ఆవిర్భావ సభలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని శపధం చేయడంతో పొత్తులకు మార్గం సుగమమైంది. తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో దీనిపై కొంత క్లారిటీ వచ్చింది.

ప్రభుత్వంపై వ్యతిరేకత
ప్రస్తుతం ఏపీలో జగన్ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్య, పీఆర్సీ , సీపీఎస్ విషయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయ వర్గాల్లో అసంత్రుప్తి నెలకొంది. ఇటువంటి పరిస్థితిలో ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ, విపక్షాలు వేరువేరుగా పోటీ చేయడం ద్వారా జగన్ కు లాభిస్తుంది. విపక్షాలు ఏకమై పోటీచేస్తే జగన్ ప్రభుత్వం గెలిచే అవకాశాలు దాదాపు శూన్యం అనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పొత్తులకు సంబంధించి చాలా రోజుల నుంచే ప్రణాళిక రూపొందించారు. విపక్షాలను ఏకతాటిపైకి తేవడానికి ఆయన వ్యూహాలు సైతం రూపొందించారు. అయితే త్యాగాలకు సిద్ధం అన్న చంద్రబాబు మాటల్లోని మర్మం మాత్రం వారు పసికట్ట లేకపోతున్నారు. పొత్తుల లో భాగంగా ఎమ్మెల్యే సీట్లు ఎక్కువభాగం ఇతర పార్టీలకు ఇవ్వడానికి సిద్ధం అన్న ఉద్దేశంతో త్యాగం గురించి మాట్లాడారా, ఒకవేళ అధికారంలోకి వస్తే మంత్రి పదవుల లో సింహభాగం ఇచ్చే విషయం గురించి ఆ విధంగా ప్రస్తావించారా, లేక సీఎం సీట్ ను సైతం ఇతర పార్టీలకు త్యాగం చేసే ఉద్దేశం నిజంగా చంద్రబాబుకు ఉందా అని వారు పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీలో నైరాశ్యం
అయితే వైసీపీ నేతల్లో మాత్రం ఒక విధమైన నైరాశ్యం కనిపిస్తోంది. చంద్రబాబు, పవన్ కలిస్తే తమ పని కష్టమని అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నారు. ఇటీవల పార్టీలో జరిగిన పరిణామాలు కూడా కలవర పెడుతున్నాయి. కొందరు మంత్రులను తీసేసి.. కొందర్ని ఉంచడం విభేదాలకు ఆజ్యం పోసింది. అటు పార్టీ పగ్గాలు అప్పగించినా చాలామంది అయిష్టతగానే ఒప్పుకున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. సచివాలయాలను సందర్శించాలని జగన్ సూచిస్తుండడంతో ప్రజలు నిలదీస్తారన్న భయం వెంటాడుతోంది. ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కలిస్తే చాలాచోట్ల తమకు ప్రతిఘటన తప్పదని.. కొన్ని జిల్లాల్లో వారు స్వీప్ చేసే అవకాశముందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. బయటకు మాత్రం తాము బలంగా ఉన్నాము కనుకే వారు పొత్తుల గురించి ఆలోచిస్తున్నారని చెప్పకొస్తున్నారు. మల్లాది విష్ణు వంటి నేతలైతే జగన్ ను ఢీకొనే సామర్థ్యం లేక చంద్రబాబు పొత్తులకు వెంపర్లాడుతున్నారని విమర్శించారు.

ఇరు పార్టీల్లో మిశ్రమ స్పందన
తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో జనసైనికుల నుండి మాత్రం ఊహించనంత సానుకూల స్పందన లేదు. 2014 ఎన్నికలలో ఎటువంటి షరతులు లేకుండా ఎటువంటి లాభాపేక్ష లేకుండా పవన్ కళ్యాణ్ టిడిపి పార్టీకి మద్దతు ఇస్తే, ఎన్నికలు అయిన తర్వాత టిడిపి ఏరు దాటాక తెప్ప తగిలేసిన విధంగా వ్యవహరించిందనే భావన వారిలో ఉంది. అప్పట్లో చింతమనేని, అశోకగజపతి రాజు టిడిపి నేతలు తన సొంత అన్నని గెలిపించుకోలేని పవన్ కళ్యాణ్ తమ పార్టీని గెలిపించాడా అంటూ వెటకారంగా మాట్లాడిన విషయాలను, అసలు పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియని తెలియదు అంటూ బాలకృష్ణ వ్యాఖ్యలు చేసిన విషయాలను గుర్తు చేస్తూ, టిడిపి తో పొత్తు ద్వారా తమ పార్టీ మరొకసారి మోసపోయే అవకాశం ఉందన్న భావనను వారు వ్యక్తం చేస్తున్నారు. టీడీపీలో అయితే ఒక విధమైన జోష్ కనిపిస్తోంది. చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలరని.. అందుకు జనసేన బాధ్యత తీసుకోవాలని కోరుతున్నారు. చంద్రబాబు, పవన్ లు సంయుక్తంగా పాలన చేయాలని సూచిస్తున్నారు. చూద్దాం పొత్తుల రాజకీయ ఎందాక తీసుకెళుతుందో