Chandrababu: సంక్షోభాలను సవాళ్లను అధిగమించగల నాయకుడు చంద్రబాబు. ఇది చాలా సందర్భాల్లో నిరూపితమైంది. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రతికూలతలు కాస్తా.. అనుకూలంగా మారుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కాలం కలిసి వస్తోంది. దూరమైన వర్గాలన్నీ దరిచేరుతున్నాయి. శత్రువులు, ప్రత్యర్ధులు సన్నిహితులుగా మారుతున్నారు. కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు.
గత ఎన్నికల్లో టిడిపి ఘోర వైఫల్యం చెందింది. దారుణ ఓటమిని మూటగట్టుకుంది. పని గట్టుకొని చంద్రబాబును ఓడించిన పరిస్థితి ఎదురైంది. అన్ని వర్గాలు జగన్కు ఏకపక్ష విజయాన్ని కట్టబెట్టాయి. ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. ఒక్కొక్కరూ జగన్కు దూరమవుతున్నారు. చంద్రబాబుకు దగ్గరవుతున్నారు. పరిస్థితులు మొత్తం అనుకూలంగా మారిపోతున్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, చివరకు సినిమా రంగం సైతం బాహాటంగానే మద్దతు తెలుపుతోంది.
గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రత్యర్థికి మించి శత్రువుగా మిగిలింది. చంద్రబాబుపై కోపంతో జగన్ కు అంతులేని సహకారాన్ని అందించింది. అటు జనసేన సైతం ఒంటరిగా పోటీ చేసింది. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. కలిసి నడిచేందుకు జనసేన సిద్ధంగా ఉంది. గతం మాదిరిగా బిజెపి వ్యతిరేకంగా లేదు. అవసరమైతే ఒకటి రెండు సీట్లతో సర్దుబాటు చేసుకునేందుకు కూడా సిద్ధపడుతోంది.కూటమి కట్టి.. చంద్రబాబుని ఎన్డీఏలో చేర్చుకోవాలని బిజెపి భావిస్తోంది.
అటు సినిమా రంగం సైతం సంపూర్ణ మద్దతును ప్రకటిస్తోంది. గత ఎన్నికల ముందు చాలామంది సినీ ప్రముఖులు పరోక్షంగా వైసీపీకి మద్దతు తెలిపారు. ఎన్నికల ముందు కొందరు ఆ పార్టీలో చేరారు. కీలక నియోజకవర్గాల్లో ప్రచారం కూడా చేశారు. ఒక్క నందమూరి వంశమే టిడిపికి పరిమితమైంది. ఇప్పుడు దశాబ్దాల వైరాన్ని మరిచి మెగా కుటుంబం సైతం సపోర్ట్ చేసే అవకాశం ఉంది. సినిమాల జోలికి రావడంతో ఆ రంగం మొత్తం వైసీపీకి వ్యతిరేకంగా మారింది. మరోసారి కానీ వైసీపీ అధికారంలోకి వస్తే సినిమా రంగంపై పెను ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన చెందుతోంది. అందుకే సినిమా రంగం మొత్తం చంద్రబాబుకు మద్దతు పలుకుతోంది.
వివిధ దేశాల్లో స్థిరపడిన ప్రవాస ఆంధ్రులు సైతం ఈసారి టిడిపికి మద్దతు తెలిపే అవకాశం ఉంది. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు బాహటంగానే పనిచేసే ఛాన్స్ కనిపిస్తోంది. జగన్ సర్కార్ తమ ఆర్థిక మూలాలను దెబ్బతీయడంతో ఆ వర్గాల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అవసరమైతే పెట్టుబడి పెట్టడం ద్వారా ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులను గెలిపించుకోవాలని వారు భావిస్తున్నారు. ఇప్పటికే చాలామంది ఎన్నారైలు ఎన్నికలకు ఫండింగ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. ఇలా ఎటువైపు చూసినా చంద్రబాబుకు అనుకూలమైన వాతావరణమే నడుస్తోంది. ఈ తరుణంలో టిడిపి గెలుపొందకపోతే అంతకంటే దురదృష్టం మరొకటి ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు.