
Chandrababu- Jagan: నాయకుడు వస్తున్నాడంటే జనం తండోపతండాలుగా వచ్చేవారు. నాయకుడి ప్రసంగం వినేందుకు ఎగబడేవారు. నాయకుడి కరచాలనం కోసం పరితపించేవారు. కానీ ఇప్పుడు నాయకుడొస్తున్నాడంటే జనం మొఖం చాటేస్తున్నారు. నాయకుడి కోసం జనాన్ని తరలించాలి. పదో.. పాతికో ఇచ్చి పురమాయించాలి. జేజేలు కొట్టేందుకు.. పూలుజల్లేందుకు పైసలు ఖర్చుపెట్టాలి. లేదంటే జనం రారు. సభ సక్సెస్ అవ్వదు. జనంలో క్రేజ్ అసలే రాదు. ఇదీ నేటి పరిస్థితి. దీనికి కారణమేంటో విశ్లేషిద్దాం.
Also Read: Rasamayi Balakishan : ట్రోల్ ఆఫ్ ది డే : ఓ రబ్బయో.. ఒరి నాయనో.. అసెంబ్లీలో ‘రసమయి’ రచ్చ చూడాల్సిందే
ఒకప్పుడు రాజకీయ నాయకులు సంవత్సరానికి..ఆర్నెల్లకు ఒక జిల్లాకు వెళ్లేవారు. అప్పట్లో ప్రచార, ప్రసార సాధనాలు కూడా తక్కువే. దీంతో నాయకుడిని ప్రత్యక్షంగా చూడాల్సిందే తప్ప అంతకు మించి మరో మార్గం ఉండేది కాదు. అప్పుడప్పుడు నాయకులు ప్రజల్లోకి రావడం కారణంగా.. ఆ నాయకుల్ని చూడాలనే ఆతృత కూడా జనంలో ఉండేది. జనం కూడా నాయకులు వస్తున్నారంటే విరివిగా తరలివచ్చేవారు. నాయకుడితో మాట్లాడాలని, కరచాలనం చేయాలని ఎంతో ఉత్సాహం అప్పట్లో ప్రజలకు ఉండేది. అదే స్థాయిని నాయకులు కొనసాగించారు. తమ స్థాయిని తగ్గించకుండా ప్రజల్లో తమ క్రేజ్ తగ్గకుండా చూసుకున్నారు. ఎన్ని పథకాలు అమలు చేసినా.. ఎంత అభివృద్ధి చేసినా జనంలో అప్పుడప్పుడు మాత్రమే కనిపించేవారు. దీంతో అప్పటి నాయకులంటే గౌరవం, అభిమానం అలాగే కొనసాగింది.
కాలక్రమేణా పరిస్థితుల్లో మార్పు వచ్చింది. సాంకేతిక విప్లవంతో సోషల్ మీడియా విరివిగా వినియోగంలోకి వచ్చింది. రాజకీయ నాయకులు రోజూ ఒక జిల్లాకు తిరిగే పరిస్థితి ఏర్పడింది. ప్రజల్లో నిత్యం ఉండే పరిస్థితి వచ్చింది. సోషల్ మీడియాలో నాయకుల కోసం పేజీలు, యూట్యూబ్ చానెళ్లు, ట్విట్టర్ అకౌంట్లు, ఫేస్ బుక్ అకౌంట్లు ఇలా జనానికి దగ్గర కావడానికి ఉన్న అన్ని అవకాశాలను నాయకులు వినియోగించుకుంటున్నారు. నిత్యం నాయకులు మీడియాలో ఉంటున్నారు. దీంతో రాజకీయ నాయకులు తమకు చాలా దూరంగా ఉన్నారు అనే భావన జనంలో తగ్గిపోయింది. అదే సమయంలో చిన్న కొళాయి ప్రారంభించాలన్నా రిబ్బన్ కట్ చేస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. చిన్న షాప్ ఓపెన్ చేయాలన్నా మంత్రి వస్తున్నాడు. చిన్న కొట్టు మొదలుపెట్టాలన్నా కేబినెట్ ర్యాంక్ ఉన్న నాయకుడొస్తున్నాడు. దీంతో జనంలో అప్పటి క్రేజ్ తగ్గిపోయింది. వారిని చూడాలనే ఉత్సాహం కూడా సన్నగిల్లింది. నేరుగా వెళ్లి నాయకులతో సామాన్యుడు వెళ్లి మాట్లాడే పరిస్థితి ఇప్పుడు నెలకొంది.

సీఎం మీటింగ్ జరుగుతున్నా సరే.. సభకు రావడానికి జనం నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ ఉండే సభలు, సమావేశాలే కదా అంటూ నిట్టూర్చుతున్నారు. సీఎం సభలకు, ప్రతిపక్ష నాయకుడి సభలకు జనాన్ని తీసుకురావాలంటే భారీగా ఖర్చు అవుతోంది. జనం తరలించడం మొదలుకొని సభ నిర్వహణ వరకు డబ్బులేనిదే పని జరగడం లేదు. డాక్రా మహిళలను, అంగన్వాడీ కార్యకర్తల్ని, పార్టీ కార్యకర్తల్ని, వాలంటీర్లను, పొదుపు సంఘాలను ఇలా.. ఎవరు అందుబాటులో ఉంటే వారిని బలవంతంగా కార్యక్రమాలకు తరలిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు సభలంటే వీరందరూ విసిగి వేసారిపోయారు. సభలకు వెళ్లడం ద్వార తమకు ఒరిగే ప్రయోజనం ఏం లేదని పెదవి విరుస్తున్నారు. సభకు వచ్చినా అవే పథకాలు.. రాకపోయినా అవే పథకాలు అంటూ నిట్టూరుస్తున్నారు.
సీఎం సభలకు కూడా జనం రాకపోవడానికి కారణం ఒక విధంగా చంద్రబాబే అని చెప్పొచ్చు. చంద్రబాబు అధికారంలో ఉంటే కాలికి చక్రాలు కట్టుకుని రాష్ట్రమంతా తిరుగుతారు. అధికారుల్ని పరుగులు పెట్టిస్తారు. గతంలో చంద్రబాబు సభలంటే నాయకులు, అధికారులు బెంబెలెత్తిపోయేవారంటే ఆశ్చర్యం కలుగక మానదు. అంతలా చంద్రబాబు జిల్లాల్లో పర్యటించేవారు. జనం కూడ చంద్రబాబు సభలంటే రానురాను విసుగు చెందారు. నెలకోసారి డ్వాక్రా మహిళల్ని, అంగన్వాడీ కార్యకర్తల్ని, ఆరోగ్య కార్యకర్తల్ని, టీచర్లను, అధికారులను సభల పేరుతో చంద్రబాబు అటూ ఇటు తిప్పుతుండేవారు.
దీంతో వారికి చంద్రబాబు అంటేనే విరక్తి వచ్చినంత పని అయింది. 2019 ఎన్నికల్లో వారిలో చాలా మంది ఓటే వేయలేదంటే నమ్మశక్యం కాదు. అంతలా చంద్రబాబు పై విరక్తి వచ్చిందని చెప్పవచ్చు. చంద్రబాబు చేసిన తప్పును జగన్ గమనించాడు. అందుకే అనవసరంగా సభలు , సమావేశాలు నిర్వహించడంలేదు. తద్వార జనాల్ని పోగుచేసే అవసరమూ లేదు. దీంతో అటు అధికారులకు ఇటు నాయకులకు పెద్ద తలనొప్పి తప్పింది. అనవసర ఖర్చులు తగ్గాయని చెప్పవచ్చు.
Also Read:Ravindra jadeja : జడేజా ట్యాంపరింగ్ చేశాడా? అసలు నిజం ఇదీ