
Chandrababu Visited Tidco Houses: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంపై విభిన్న మార్గాల్లో పోరాటం సాగిస్తున్న తెలుగుదేశం పార్టీ మరో సరికొత్త పోరు పిలుపునిచ్చింది. తెలుగుదేశం పార్టీ హయాంలో భారీగా రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నిర్మించిన టిడ్కో ఇళ్లను ప్రభుత్వం లబ్ధిదారులకు ఇవ్వలేదని టిడిపి పేర్కొంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న టిడ్కో ఇళ్ల వద్ద సెల్ఫీలు తీసుకుని ఛాలెంజ్ చేయాలని చంద్రబాబు నాయుడు తాజాగా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ వ్యవహారం మరోసారి రాష్ట్రంలో రాజకీయ రచ్చకు కేంద్ర బిందువుగా మారుతోంది. దీనికి వైసీపీ కూడా గట్టిగానే స్పందిస్తోంది.
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అసమర్ధతను, అడ్డగోలు వ్యవహారాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది తెలుగుదేశం పార్టీ. అనేక ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్న చంద్రబాబు నాయుడు ఆయా ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను ప్రజలకు తెలియజేస్తున్నారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో భాగంగా అనేక సమస్యలను ప్రజలకు వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే లోకేష్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. టిడిపి హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సెల్ఫీ ఛాలెంజ్ రూపంలో రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నారు. తాను పాదయాత్ర చేస్తున్న ప్రాంతాల్లో తన తండ్రి సీఎం గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, వచ్చిన ప్రాజెక్టులు, కట్టిన పరిశ్రమలను సెల్ఫీల రూపంలో బయట ప్రపంచానికి తెలియజేస్తున్నారు.
సెల్ఫీ ఛాలెంజ్ కు పిలుపునిచ్చిన చంద్రబాబు..
లోకేష్ చేపట్టిన సెల్ఫీ చాలెంజ్ పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళుతుండడంతో చంద్రబాబు ఇదే తరహా ప్రయోగానికి సిద్ధమయ్యారు. తెలుగుదేశం పార్టీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా నిర్మించిన టిడ్కో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు అనేక చోట్ల లబ్ధిదారులకు కేటాయించలేదు. దీనిపై వినూత్న రీతిలో పోరాటాన్ని చేయాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఆయా డిట్కో ఇళ్ల వద్దకు వెళ్లి టిడిపి నాయకులు సెల్ఫీలు తీసుకుని లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వలేదు, ఎంతమందికి లబ్ధించే కోరుకున్న వంటి వివరాలుతో వీడియో తీసుకుని ఛాలెంజ్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటించిన సందర్భంగా అక్కడ డిడ్కో ఇళ్ల వద్ద సెల్ఫీ తీసుకొని ఈ ఛాలెంజ్ ను ప్రారంభించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నడుస్తున్నట్లు ఐటీడీపీ, టిడిపి నాయకులు చెబుతున్నారు.
ప్రతిగా వైసీపీ సోషల్ మీడియా విమర్శలు..
టిడిపి చేస్తున్న విమర్శలకు వైసీపీ నాయకులు, సోషల్ మీడియా వింగ్ ధీటుగానే బదులిస్తోంది. నారా చంద్రబాబు నాయుడు అప్పట్లో ఇల్లు పూర్తి చేసి ఉంటే ఎందుకు లబ్ధిదారులకు ఇవ్వలేదు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అరకొరగా ఇళ్ల నిర్మాణం చేపట్టి.. ఏదో బ్రహ్మాండం చేసినట్లు గొప్పలు చెప్పుకోవడం చంద్రబాబుకు అలవాటేనని పలువురు వైసిపి నాయకులు విమర్శిస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టడం లేదని.. ఊళ్లను నిర్మిస్తున్నారని చెప్పడమే కాకుండా అందుకు సంబంధించిన ఊర్ల నిర్మాణ వీడియోలను కూడా వైసిపి విడుదల చేసింది. ఇప్పుడు టిడిపి, వైసిపి మధ్య సెల్ఫీ చాలెంజ్ రూపంలో వార్ నడుస్తోంది.

సెల్ఫీలు అక్కడ తీసుకోవాలి..
ఇక ఈ సెల్ఫీ చాలెంజ్ వ్యవహారం పై వైసీపీ మంత్రులు గట్టిగానే స్పందిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో పర్యటించి సెల్ఫీ తీసుకున్న చంద్రబాబు నాయుడు వ్యవహారంపై స్పందించిన ఆ జిల్లాకు చెందిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కట్టిన బ్యారేజీలు, చాలా గ్రామాల్లో చేపట్టిన నిర్మాణాలు వద్ద వెళ్లి చంద్రబాబు సెల్ఫీ తీసుకొని ఛాలెంజ్ చేయాలని సవాల్ చేశారు. పూర్తిస్థాయిలో ఇల్లు కట్టు ఉంటే ఆ రోజు ఎందుకు లబ్ధిదారులకు ఇవ్వలేదన్న విషయాన్ని చంద్రబాబునాయుడు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక వైసిపి సోషల్ మీడియా కూడా ఈ మేరకు వీడియోలు రూపొందించి పెద్ద ఎత్తున సర్కులేట్ చేస్తోంది. ఇది సోషల్ మీడియాలో టిడిపి – వైసిపి మధ్య పెద్ద వార్ కు కారణం అవుతోంది.