Chandrababu Pawan : 2024 ఎన్నిక టీడీపీ, జనసేనకు కీలకం కానుంది. గత తప్పిదాలను దిద్దుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది. సీట్ల పంపకం నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు పెద్ద సవాల్ కాబోతోంది. మరి సమస్యలను ఏ మేరకు అధిగమిస్తారనే అంశం పై ఫలితం ఆధారపడి ఉండబోతోంది. కేవలం పొత్తులు పెట్టుకోవడమే కాదు.. వాటిని ఫలప్రదం చేసుకోవాల్సిన ఆవశ్యకత కూడ ప్రతిపక్షాల మీద ఉంది.

2009 ఎన్నికల విషయం ఇప్పుడు చర్చకు వస్తోంది. ఉమ్మడి ఏపీలో ఈ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో టీడీపీ, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం కలిసి మహాకూటమిగా ఎన్నికలకు వెళ్లాయి. టీఆర్ఎస్ కు గణనీయమైన సీట్లు కేటాయించారు. కానీ నియోజకవర్గాల్లో బలమైన అభర్థులు లేకపోవడం వల్ల రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా గెలిచింది. టీఆర్ఎస్ కు ఉన్న బలహీనతను కాంగ్రెస్ బలంగా మార్చుకుంది. అదే సమయంలో టీఆర్ఎస్ శక్తికి మించి సీట్లు కేటాయించడం గెలుపు అవకాశాన్ని దెబ్బతీసిందని అప్పట్లో టీడీపీ అంచనా వేసింది.
2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేనలు ఒంటరిగా పోటీచేశాయి. టీడీపీ 23 సీట్లలో గెలవగా, జనసేన ఒక స్థానంలో గెలిచింది. వైసీపీకి 151 స్థానాలు వచ్చాయి. 151 స్థానాల్లో 60 నుంచి 70 స్థానాలు ప్రతిపక్షాల ఓట్ల చీలక వల్ల గెలిచాయని విశ్లేషకులు అంచనా వేశారు. జనసేన ఒంటరిగా పోటీ చేయడం వల్ల చాలా నియోజకవర్గాల్లో ఓట్లు చీలాయి. ఆ ప్రాంతాల్లో టీడీపీ ఓడిపోయి వైసీపీకి లబ్ధి చేకూరింది. ఇప్పుడు కూడా ఇదే విధంగా గట్టెక్కాలని వైసీపీ భావిస్తోంది.
2009, 2019, 2024 ఎన్నికల మధ్య సారూపత్య ఉంది. ఆ ఎన్నికల ఫలితాల అనుభవంతో గతంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకుండా చూసుకోవాలని టీడీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. జనసేన, టీడీపీ పొత్తు ఖరారైతే సాధ్యమైనంత వరకు గెలిచే స్థానాలే జనసేనకు ఇవ్వాలని టీడీపీ భావిస్తోంది. ఎక్కువ సీట్లు ఇచ్చామని కేవలం చెప్పుకోవడానికి ఇస్తే 2009లా దెబ్బతినాల్సి వస్తుందనేది టీడీపీ అభిప్రాయం. కానీ జనసేన మాత్రం గౌరవప్రదమైన సీట్లు కోరుతోంది. అదే సమయంలో జనసేన కు ఇచ్చే సీట్లలో బలమైన అభ్యర్థుల్ని దింపేలా వ్యూహం ఉండాలని టీడీపీ భావిస్తోంది. బలమైన అభ్యర్థుల్ని బరిలోకి దింపడం వల్ల వైసీపీ అభ్యర్థిని సులువుగా ఎదుర్కొనగలరని టీడీపీ అభిప్రాయపడుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా కసరత్తు జరుగుతోందని తెలుస్తోంది.
ఒంటరిగా పోటీ చేస్తే ప్రతిపక్షాల ఓటు చీలుతుందని… తద్వార వైసీపీ లాభపడుతుందని టీడీపీ, జనసేనలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒంటరిగా ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేయకూడదని అభిప్రాయపడుతున్నాయి. 2019లో ఒంటరిగా వెళ్లడం వల్లే వైసీపీ అధికారంలోకి వచ్చిందని నమ్ముతున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ 2019 ఎన్నికల పరిస్థితి పునరావృతం కాకూడదని భావిస్తున్నాయి. పొత్తుల విషయంలో క్లారిటీ ఉన్నా సీట్ల పంపకంలో ఇంకా క్లారిటీ లేదు. బీజేపీతో పొత్తు కోసం ఇరు పార్టీలు వేచి చూస్తున్నాయి. అదే సమయంలో గౌరవప్రదమైన స్థానాలు కావాలని జనసేన కోరుతోంది. బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి స్పష్టత రాగానే పొత్తు ప్రకటన, సీట్ల పంపకం పై ఒక అంచనా రానుంది.