రాజకీయాల్లో ఎవరి చెరిష్మా వారిది. ఎవరి ఎత్తులు వారివి. ఎన్ని దశాబ్దాల లీడర్ అయినా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో ఒక్కోసారి బోల్తా పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఏపీలో ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నాడు. సీఎం జగన్ అంత అనుభవం లేకున్నా.. తనకంటూ ప్రత్యేక స్టైల్ ఉంది. ఇప్పటికే ఎంతగానో ప్రజాదరణ సీఎంగా పేరొందారు కూడా. అయితే.. జగన్ చంద్రబాబు విషయంలో అతిగా ఆలోచనలు చేస్తున్నట్లు అనుమానాలు వస్తున్నాయి.
Also Read: నేనింతే.. నా నిర్ణయమే ఫైనలంటున్న బాబు
దశాబ్దాల లీడర్ కాబట్టి చంద్రబాబు వ్యూహాలు రూపొందించడంతో దిట్ట కావచ్చు కానీ.. ఆయన ఎత్తులు అన్నిసార్లు సక్సెస్ కాలేదు. చాలా సార్లు బోల్తా పడ్డాడు కూడా. 2019 ఎన్నికల ముందు కూడా ఎన్నో రకాల మాస్టర్ ప్లాన్స్ వేశారు. చివరికి బొక్క బోర్లాపడ్డారు. ఇక చంద్రబాబుకు వ్యవస్థలను మేనేజ్ చేస్తారనే పేరు కూడా ఆయనకు ఉంది. కానీ.. ఇప్పుడు అధికారంలో లేని చంద్రబాబును ఇప్పుడు నమ్మే పరిస్థితిలో ఉన్నారా..? ఎందుకు ఏరికోరి బురద జల్లించుకుంటారనేది ప్రశ్న.
ఎన్నో కష్టాలు పడి చివరికి అధికారంలోకి వచ్చిన జగన్ ఎవరినీ నమ్మరు. అది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. అక్కడే ఆయనకూ తండ్రి వైఎస్సార్‌కు తేడా ఉందని కూడా అంటుంటారు. జగన్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయనకు ఎదురైన నమ్మకద్రోహాలు కూడా అలాంటివే మరి. అందువల్ల ఆయన వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకుని చివరికి ఇలా మారిపోయారని అంటుంటారు. కానీ జగన్ మాత్రం బాబు ఫోబియాలో పడి కొన్ని అనవసరంగా నెత్తికెక్కించుకుంటున్నారా అన్న చర్చ పార్టీలో మొదలైంది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో బాబు ఆయనను మొదట సిఫార్స్ చేయలేదు. తరువాత తెచ్చి పదవిలో కూర్చోబెట్టినా ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు పెట్టి రాజకీయ లాభాలను పొందలేదు అన్నది ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. కానీ జగన్ ఆ విషయంలో ఎక్కువ ఆలోచిస్తున్నారని అనిపిస్తోంది. ఇప్పుడు ఒక న్యాయమూర్తి విషయంలో కూడా జగన్ అతిగా స్పందించి బాబు మీద ద్వేషంతో తనకే చేటు తెచ్చుకుంటున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది.
Also Read: మోడితో కయ్యమే ‘కాళేశ్వరం’కు బ్రేకులా..!
ఏపీ హైకోర్టులో తీర్పులు ఇబ్బందిగా ఉంటే వాటి మీద నమ్మకం లేకపోతే పొరుగు రాష్ట్రానికి ఆయా కేసులను బదిలీ చేయమని సీఎం హోదాలో అడిగితే జగన్‌కు మర్యాదగా ఉండేదని టాక్. అలా కాకుండా రాజ్యాంగంలో అత్యున్నతమైన వ్యవస్థగా ఉన్న న్యాయ వ్యవస్థ మీద అపనమ్మకం కలిగేలా ఆరోపణలు చేయడం యువ ముఖ్యమంత్రి స్థాయికి తగదన్న విశ్లేషణలు ఉన్నాయి. మొత్తానికి సీఎం వైఎస్ చంద్రబాబు ఫోబియా నుంచి బయటపడి.. తనదైన శైలిలో ఆలోచిస్తేనే ఈ చిక్కుల నుంచి బయటపడొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.