Chandrababu Manifesto: క్లాస్ వార్.. ఏపీ సీఎం జగన్ సరికొత్త నినాదం ఇది. బహుశా ఎన్నికల వరకూ ఈ స్లోగన్ తీసుకెళ్లే అవకాశం ఉంది. అందుకే కాబోలు చంద్రబాబు పునరాలోచనలో పడ్డారు. జగన్ కు ధీటుగా తన అమ్ముల పొది నుంచి మినీ మేనిఫెస్టో ఒకటి బయటకు తీశారు. ఓట్లు రాబెట్టే తారకమంత్రంగా చంద్రబాబు భావిస్తున్నారు. అయితే ఓట్లు రావడం మాట దేవుడెరుగు.. టీడీపీ వైపు ఉన్న స్ట్రాంగ్ ఓటరు చేజారే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. జగన్ ట్రాపులో చంద్రబాబు పడ్డారని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేనిఫెస్టో టీడీపీకి గుదిబండగా మారుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
సంక్షేమానికి ఆధ్యుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ప్రజోపయోగ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఆయనదే. దానిని కొనసాగిస్తున్నట్టు జగన్ చెబుతున్నారు. కానీ తండ్రిలా కాకుండా ఉచితాలు ప్రకటించి అభివృద్ధిని నిర్వీర్యం చేశారన్న అపవాదు జగన్ పై ఉంది. అటు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి సైతం ఏమంత ఆశాజనకంగా లేదు. ఈ తరుణంలో చంద్రబాబు అధికారంలోకి వస్తే కొంత ఉపశమనం వుంటుందని కొన్ని వర్గాలు భావిస్తూ వచ్చాయి. వీళ్లంతా జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వ్యతిరేకిస్తున్నారు. అయితే టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోతో జగన్‌ను వ్యతిరేకిస్తున్న, అలాగే చంద్రబాబు వస్తే అద్భుతం ఏదో చేస్తారని ఆశించిన వాళ్లందరూ తీవ్ర నిరాశకు గురయ్యారు. జగన్ ఒక్క చేత్తో బటన్ నొక్కి సంక్షేమ లబ్ధిదారులకు సొమ్ము జమ చేస్తున్నారని, ఇక చంద్రబాబును అధికారంలోకి తీసుకొస్తే రెండు చేతులూ సరిపోవనే విమర్శ మొదలైంది.
సీఎం జగన్ చెబుతున్నట్టు క్లాస్ వార్ కు వేరే అర్ధం ఉంది. సంక్షేమ పథకాలు పొందుతున్నపేదవర్గం ఒక వైపు ఉంటే.. అదే సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారన్న మధ్య తరగతి, తటస్థులు, విద్యావంతులు, ఆలోచనాపరులు, ఉద్యోగులు, మేధావులు మరోవర్గమన్నమాట. ఈ రెండో వర్గమే చంద్రబాబు ఓటు బ్యాంకు. తాజా మేనిఫెస్టో తో ఓటు బ్యాంకుకు భారీగా గండి కొడుతుందనే అనుమానం, భయం టీడీపీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పైగా నాలుగేళ్లు చేసిన విమర్శల మాటేమిటి? అని ప్రశ్నిస్తున్నారు. గత నాలుగేళ్లుగా జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఏపీలో మరే అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదని, కూచొని ఊరికే తినవాళ్లకు అప్పనంగా ప్రభుత్వ సొమ్మును కట్టబెడుతున్నారని, అలాగే రాష్ట్రం శ్రీలంక, వెనుజలా, పాకిస్తాన్ అవుతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయడాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇప్పుడు తాము అధికారంలోకి వస్తే జగన్ కంటే రెండింతలు సంక్షేమ పథకాల్ని అమలు చేస్తామంటూ, మొదటి విడత మేనిఫెస్టోను విడుదల చేయడంపై చంద్రబాబును నమ్ముకున్న వర్గాలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాయి.చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోను చూసిన తర్వాత చాలా మంది పెదవివిరిచారు. రెండుకు రెండూ ఒకటేనని వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రాన్ని నాశనం చేయడానికి జగన్, చంద్రబాబు పోటీ పడుతున్నారంటూ మండిపడుతున్నారు. ఇది చాలదన్నట్టు దసరాకు మరింతగా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పథకాలు తీసుకొస్తామని ప్రకటించడంపై ఆగ్రహిస్తున్నారు. దీంతో తాజాగా విడుదల చేసిన మేనిఫెస్టోతో టీడీపీకి లాభం కంటే నష్టమే అధికం.