మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్ పై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన వీడియో కాన్ఫెరెన్స్ మాట్లాడుతూ ప్రభుత్వం అచ్చెన్నాయుడుని అరెస్టు చేయడం కాదని కిడ్నాప్ చేసిందన్నారు. ఆయనకి ఏం జరిగినా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. శాసనసభ పక్ష ఉపనేతగా ఉన్న వ్యక్తిని అరెస్టు చేసే సమయంలో చట్టంలో పేర్కొన్న అంశాలను పాటించలేదన్నారు. ఇటువంటి చర్యలకు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకొక తప్పదన్నారు.
జగన్ ప్రభుత్వం తప్పుడు విధానాలను ఎత్తిచూపడం, బడుగు, బలహీనవర్గాలకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై ప్రశ్నిస్తున్నందుకు సీఎం జగన్ అచ్చెన్నాయుడిపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ప్రజల్లో జగన్ మోసాలకు, అవినీతికి వ్యతిరేకంగా వస్తున్న అసంతృప్తి పెరిగి ఫ్రస్ట్రేషన్‌గా మారడంతో ఇటువంటి ఉన్మాద చర్యలకు పాల్పడు తున్నారని అన్నారు.
ఈ వ్యవహారంపై సీయం జగన్, హోం మంత్రి, డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించడం, బీసీ సబ్‌ప్లాన్ నిధులు మళ్లీంపు, నామినేషన్ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వంటి అంశాలు ఈ నెల 16 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అచ్చెన్నాయుడు సిద్ధమవడతో ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడిందన్నారు.
ఈ అంశంపై కుటుంబ సభ్యులు ఫోన్‌లో కాంటాక్ట్ చేసినా ఫోన్ అందుబాటులో లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఫోన్ చేసినా అచ్చెన్నాయుడు ఫోన్ అందుబాటులో లేదన్నారు. కనీసం మందులు కూడా వేసుకొనివ్వలేదన్నారు. ఇది జగన్ అరాచకం, ఉన్మాదం తప్ప మరేమీ కాదన్నారు.