Chandrababu Naidu: తెలుగుదేశంలో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అధికారం కోసం నేతలు వ్యూహాలు మార్చుకుంటున్నారు. అధికారమే ఎజెండాగా ముందుకు సాగుతున్నారు. అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తన రాజకీయ వారసుడు లోకేష్ (Lokesh) కోసం త్యాగం చేయడం కోసం వెనకాడడం లేదు. రాబోయే ఎన్నికల్లో పోటీకి దూరముంటానని సంకేతాలు ఇస్తున్నారు. దీంతో పార్టీ కేడర్ సైతం ఆలోచనలో పడిపోతోంది. అసలు బాస్ పోటీలో లేకుంటే పార్టీ మనుగడ సాధ్యమేనా అనే సందేహంలో పడిపోతున్నారు. అయినా వారసుడి పదవి కోసం తాను ఏ త్యాగానికైనా రెడీ అని బాబు నిశ్చయించుకుంటున్నారని తెలుస్తోంది.
టీడీపీకి అచ్చొచ్చిన నియోజకవర్గం కుప్పం. ఇక్కడి నుంచి చంద్రబాబు ఆరుసార్లు విజయం సాధించి టీడీపీ కంచుకోటగా మార్చారు. దీంతో వారికి కలిసొచ్చే కుప్పం నుంచి ఇక లోకేష్ ను పోటీలో దింపాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే పార్టీ నేతల్లో భయం పుట్టుకొస్తుందని మరొక వర్గం అంచనా. ఈ నేపథ్యంలో బాబు నిర్ణయం ఏ మేరకు ఫలితం చూపిస్తుందో అని అందరిలో సంశయం నెలకొంది. నారా కుటుంబానికి కుప్పం కలిసొచ్చే అంశంగా ఉంటుందని చెబుతున్నారు.
తనకు ఇక వయసైపోయిందని పోటీలో ఉంటే కష్టమని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా తాను పోటీకి దూరంగా ఉండడమే మేలని చెబుతున్నారు. అందుకే లోకేష్ ను తన వారసుడిగా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో సానుభూతి పవనాలు పొందేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది. కొడుక్కి ఓ దారి చూపించే వరకు ఇక విశ్రమించేది లేదని చూస్తున్నారు. కుమారుడిని అసెంబ్లీకి పంపడమే తన ధ్యేయమని చెబుతున్నారు.
అయితే లోకేష్ కోసం తాను పోటీ నుంచి తప్పుకుని కొడుక్కి స్థానం కల్పించాలని బాబు లోపాయకారిగా ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ బాబు తప్పుకుంటే పార్టీ పుట్టి మునగడం ఖాయమని కొందరు హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కొడుకు నిరాశ చెందకూడదని భావిస్తున్నారు. లోకేష్ ను ఎమ్మెల్యే గా గెలిపించుకుని తాను ఎమ్మెల్సీ గా అయినా స్థానం కల్పించుకుని సీఎం అవ్వాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.