40 ఇయర్స్ ఇండస్ట్రీగా ఉన్న చంద్రబాబు చాలా కాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రజలు, ఆరోగ్యంపై ఆయనకు ఎంతో అనుభవం ఉంటుంది. దేశాన్ని పక్కన పెడితే.. ఏపీలోనే నిత్యం 20 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో.. తాము చేయబోతున్న సహాయ కార్యక్రమాలను వివరించారు చంద్రబాబు.
‘కరోనా సవాళ్లు – నివారణ చర్యలు’ అంటూ ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో వైద్య నిపుణులతో నిర్వహించిన వెబినార్ లో బాబు మాట్లాడారు. టీడీపీ, ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10 వేల మంది కొవిడ్ రోగులకు సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. దీంతోపాటు ఇప్పటికే పలుసేవలు అందిస్తున్నట్టు చెప్పారు.
హోం ఐసోలేషన్లో ఉన్నవారికి వైద్య సలహాలు, మందులు అందిస్తున్నట్టు చెప్పారు. క్వారంటైన్లో ఉన్న పేదలకు రోజుకు మూడు పూటలా ఆహారం పంపిస్తున్నామని చెప్పారు. కొందరికి ఆక్సీజన్ సిలిండర్లు కూడా అందించినట్టు చెప్పారు. అయితే.. ఇందుకోసం ‘మిలాన్’ యాప్ ద్వారా నిధులు సేకరిస్తున్నట్టు చెప్పారు చంద్రబాబు. దీంతో.. నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
ప్రతి రోజూ 20 వేల మందికి పైగా కొవిడ్ బారిన పడుతుంటే.. పార్టీ తరపున 10 వేల మందికి సహాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పడమే కాకుండా.. అది కూడా విరాళాలు ఖర్చు చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా.. జేబులోంచి డబ్బులు తీయరా? ఇదేనా మీరు చేసే సేవ అని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ, చంద్రబాబు దగ్గర డబ్బుల్లేవా? మనసు లేదా? అని ప్రశ్నిస్తున్నారు.