Chandrababu Naidu Delhi Tour: సుదీర్ఘ విరామం తరువాత చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. అజాదీ కా అమృత్ మహోత్సవానికి కేంద్ర ప్రభుత్వం చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానం పంపించింది. దీంతో గత మూడేళ్లుగా ఎదురుచూస్తున్న అవకాశం చంద్రబాబుకు దక్కింది. దీంతో చకచకా హస్తినా పయనమయ్యారు. అందుకు తగ్గట్టుగానే ప్రధాని మోదీ చంద్రబాబుతో ఐదు నిమిషాలు మాట్లాడారు. మరోసారి కలిసేందుకు కూడా అవకాశమిచ్చారు. దీంతో చంద్రబాబు, టీడీపీ శ్రేణులు సంబరపడిపోతున్నాయి. వచ్చే ఎన్నికల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ అవసరం చంద్రబాబుకు ఉంది. అందుకే ఆయన ఢిల్లీ పెద్దలతో సఖ్యత పెంచుకునేందుకు గత ఎన్నికల తరువాత చేయని ప్రయత్నమంటూ లేదు. అయితే కేంద్ర పెద్దలు మాత్రం ఆయన్ను దూరం పెడుతూ వచ్చారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ ట్రాప్ లో పడిన చంద్రబాబు ఎన్డీఏకు దూరమయ్యారు. అటు ఎన్నికల్లో కూడా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ప్రచారం చేశారు. కానీ కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మరోసారి అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు దారుణం దెబ్బతిన్నారు. బీజేపీ పరోక్ష సహకారంతో జగన్ ఏపీలో అధికారంలోకి రాగలిగారు. అటు తరువాత చంద్రబాబు రాజకీయంగా చాలా నష్టపోయారు. బీజేపీకి దూరం కావడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అంచనాకు వచ్చారు. అందుకే మరోసారి బీజేపీతో కలిసి వెళ్లేందుకు ప్రయతిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఆయన ప్రయత్నాలు సత్ఫలితాలనిచ్చినట్టు కనిపిస్తోంది.
వరుసగా ఆహ్వానాలు…
అయితే ఇటీవల కేంద్ర పెద్దల వ్యవహార శైలిలో మార్పు వచ్చింది. అటు వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా చంద్రబాబుకు ప్రాధాన్యత దక్కుతోంది. అల్లూరి విగ్రహావిష్కరణకు ఆహ్వానం, ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి చంద్రబాబును స్వయంగా కలుసుకోవడం, ఇప్పుడు ఆజాదీ కా అమృత్ మహోత్సవ వేడుకలకు ఆహ్వానం వంటివి చంద్రబాబు విషయంలో కేంద్ర పెద్దలు మెత్తబడినట్టు తెలియజేస్తున్నాయి. వాస్తవానికి మూడేళ్ల పాటు ప్రధాని మోదీ, షా ద్వయం చంద్రబాబును దూరం పెట్టినట్టు వార్తలు వచ్చాయి. అయితే మారిన పరిణామాల నేపథ్యంలో వారు మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో ఎలాగైన గెలవాలన్నది బీజేపీ లక్ష్యం. అదే సమయంలో ఏపీలో గౌరవప్రదమైన స్థానాలు దక్కించుకోవాలని భావిస్తున్నారు. అందుకే రూటుమార్చినట్టు కనిపిస్తోంది.
Also Read: KCR vs Modi: మోడీతో ఫైటింగ్: కేసీఆర్ మంచికా? చెడుకా?
మారిన రాజకీయ పరిణామాలతో..
చంద్రబాబు వల్ల కలిగే ప్రయోజనలేమిటి? ఇంతకీ ఎందుకు విభేదాలు వచ్చాయి? వాటి పరిష్కారమార్గాలు ఏమిటి? భవిష్యత్ లో చంద్రబాబు అవసరాలు వంటివి భేరీజు వేసుకొని కేంద్ర పెద్దలు స్నేహ హస్తం చాచినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. కేంద్ర పెద్దలను ఒప్పించి చంద్రబాబుతో కలిసేలా చేసినట్టు సమాచారం. వాస్తవానికి చంద్రబాబు పట్ల ఆర్ఎస్ఎస్ కు ఆది నుంచి సానుకూలత వ్యక్తం చేస్తూ వస్తోంది. వైసీపీతో పోల్చుకుంటే టీడీపీయే నమ్మదగిన మిత్రుడిగా భావిస్తూ వస్తోంది. అయితే రాజకీయ పరిణమాలు టీడీపీ, బీజేపీ మధ్య దూరం పెంచాయి. కానీ సైద్దాంతికపరంగా ఆర్ఎస్ఎస్ చంద్రబాబును నమ్మదగిన వ్యక్తిగా భావించి బీజేపీ పెద్దల దరి చేర్చినట్టు తెలుస్తోంది.
తెలంగాణలో అధికారం కోసమే…
తెలంగాణలో అధికారంలోకి రావడానికి బీజేపీ చేయని ప్రయత్నమంటూ లేదు. అటు ఆకర్ష్ మంత్రంతో పాటు పార్టీ బలోపేతం కావడానికి ఏ ఒక్క అవకాశం విడిచిపెట్టడం లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ షటిలర్స్ ఓట్లపై దృష్టిపెట్టింది. తెలంగాణలో దాదాపు 40 నియోజకవర్గాల్లో ఏపీ సెటిలర్స్ ప్రభావం ఎక్కువ. అందులో ఎక్కువ మంది చంద్రబాబును ఇష్టపడతారు. తెలంగాణలో టీడీపీలో నాయకులు లేకున్నా బలమైన క్యాడర్ ఉంది. దీంతో చంద్రబాబును దగ్గర చేర్చుకుంటే తెలంగాణలో లాభపడవచ్చన్నది బీజేపీ పెద్దల వాదన. అటు ఏపీలో కూడా లోక్ సభ స్థానాల్లో గెలుపొంది బలం పెంచుకోవచ్చని భావిస్తున్నారు. మొత్తానికి సుదీర్ఘ విరామం తరువాత చంద్రబాబుకు అన్నీ కలిసి వస్తున్నాయి.
Also Read:Chikoti Praveen case – TRS Leaders: ఆ ముగ్గురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఈడీ కన్ను