
Chandrababu Naidu: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఒకరిని తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో దించనున్నట్లు తెలుస్తోంది. టిడిపి అధినేత చంద్రబాబు ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక ఎమ్మెల్సీ స్థానం గెలిచేందుకు అవసరమైన ఎమ్మెల్యే స్థానాలు తెలుగుదేశం పార్టీకి అసెంబ్లీలో ఉన్నాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 23 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలంటే సంఖ్యాపరంగా ఈ ఎమ్మెల్యేలు సరిపోతారు. అయితే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోవడంతో పలువురు టిడిపి ఎమ్మెల్యేలు వైసీపీ గూటిలో చేరారు. వారిని లక్ష్యంగా చేసుకొని చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని ఖరారు చేశారు. ఒక సీటుకు పోటీ చేయాలని నిర్ణయించడంతోపాటు విప్ జారీ చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం వెనుక రెబల్స్ ను ఇరుకునపెట్టే ఆలోచన ఉందని చెబుతున్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థిగా పంచుమర్తి అనురాధ..
ఎమ్మెల్సీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 23న 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అసెంబ్లీలో ఉన్న సంఖ్యాపరంగా చూస్తే ఒక్కో ఎమ్మెల్సీ అభ్యర్థికి 23 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేయాల్సి ఉంటుంది. వైసీపీకి ఉన్న బలంతో ఏడుగురు అభ్యర్థులను ఖరారు చేశారు. అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో తమకు ఉన్న సంఖ్యా బలాన్ని ఆధారంగా చేసుకుని ఒక అభ్యర్థిని బరిలోకి దించాలని నిర్ణయించింది. ఇందుకోసం గతంలో విజయవాడ మేయర్ గా పని చేసిన పంచుమర్తి అనురాధ పేరును టిడిపి అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. వైసీపీ అభ్యర్థుల విజయం ఏకగ్రీవం అని భావిస్తున్న తరుణంలో
చంద్రబాబు తాజా నిర్ణయంతో ఎన్నికలు అనివార్యం అవుతోంది. దీంతో రెండు పార్టీల్లోని రెబల్స్ నిర్ణయం కీలకంగా మారనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యత ఓట్లు గెలుపు, ఓటముల నిర్ణయంలో కీలకము కానున్నాయి.
రెబల్స్ కు తప్పని ఇబ్బందులు..
గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాల గిరి, వాసుపల్లి గణేష్ అధికార వైసీపీకి దగ్గరయ్యారు. ఇప్పుడు వారిని లక్ష్యంగా చేసుకొని చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించినట్లు కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో టిడిపి విప్ జారీ చేయనుంది. దీని ద్వారా పార్టీ అభ్యర్థికి ఈ నలుగురు ఓటు వేయాల్సి ఉంటుంది. అదే సమయంలో వైసీపీతో విభేదించిన ఎమ్మెల్యేల పైన టిడిపి ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. తొలి ప్రాధాన్యత ఓటుతోపాటుగా రెండో ప్రాధాన్యతను ఓటు ద్వారా తెలియజేసే అవకాశం సభ్యులకు ఉంటుంది. తొలిప్రేరాధాన్యతలో మెజారిటీ చేరుకోకుంటే రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకం కానున్నాయి. వైసీపీ నుంచి టీడీపీతో టచ్ లో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతున్న వారిని అస్త్రంగా చంద్రబాబు ఈ ఎన్నికల్లో వైసిపి పై ప్రయోగించే అవకాశం కనిపిస్తోంది.
టార్గెట్ రెబల్స్..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలవాలన్న చంద్రబాబు నిర్ణయం వెనక బలమైన కారణం ఉంది. టిడిపి నుంచి దూరమైన ఎమ్మెల్యేలను విప్ ద్వారా ఫిక్స్ చేయడంతో పాటు వైసీపీలో తమకు మద్దతుగా ఉన్న వారితో రెండో ప్రాధాన్యత ఓట్లు వేయించాలనేది వ్యూహంగా కనిపిస్తోంది. విప్పు దిక్కరిస్తే వారిపైనా చర్యలకు పార్టీ పట్టుబట్టే అవకాశం దక్కుతుంది. చర్యలు ఉన్నా లేకున్నా చర్చకు ఆస్కారం ఏర్పడుతుంది. అదే సమయంలో వైసీపీ నుంచి టీడీపీకి మద్దతుగా ఎవరైనా నిలిస్తే వారిపైన చర్యలు తీసుకోవాలంటే టిడిపి రెబల్స్ పైన ముందుగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా అధికార పార్టీని ఎరకాటంలోకి నెట్టాలన్నది చంద్రబాబు వ్యూహం. ఈ నెల 13వ తేదీ వరకు నామినేషన్లకు సమయం ఉంది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగాలన్న చంద్రబాబు తాజా నిర్ణయం సరికొత్త రాజకీయాల కు కారణం అవుతోంది.
అసమ్మతికి అసమ్మతితో చెక్..
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గుర్తుపై గెలిచి కొద్ది నెలల్లోనే వైసీపీ పంచన చేరిన నలుగురు ఎమ్మెల్యేలను ఈ ఎన్నికల ద్వారా టిడిపికి ఓటు వేయించేలా చంద్రబాబు ప్లాన్ చేశారు. ఒకవేళ విప్ దిక్కరించి వైసీపీకి ఓటు వేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని టిడిపి డిమాండ్ చేయనుంది. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వం పై అసమ్మతితో ఉన్న ఎమ్మెల్యేలను తమకు దగ్గర చేసుకునేందుకు ఎన్నికలను చంద్రబాబు వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బహిరంగంగానే తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నారు. ఇదే జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అధిష్టానం పై గురువుగా ఉన్నారు. ఇదే జిల్లాలోని మరో ఎమ్మెల్యే అసమ్మతి బాటలో పయనించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నట్టుగా 50 మందికి పైగా ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని అంటున్నారు. అటువంటి వారిని ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసేలా గానీ, రెండో ప్రాధాన్యత ఓటు వేసేలా గానీ వేయించుకోవాలని టిడిపి భావిస్తుంది. అయితే, ఈ ప్రణాళికలు ఎంత వరకు సఫలమవుతాయన్నది వేచి చూడాల్సి ఉన్నది.