TDP Formation Day: తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరపండి. తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కాపాడేందుకే టీడీపీ ఆవిర్భవించిందని చాటిచెప్పండి. నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం, గెలుపోటములు, సంక్షోభాలు గురించి వివరించండి. పార్టీ స్ఫూర్తిని యువతకు వివరించండి. ప్రతీ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేయండి. వచ్చే ఎన్నికలకు దిశ, నిర్దేశం చేసేలా కార్యక్రమాన్ని వినియోగించుకోండి. పార్టీ గెలుపునకు ఇదో దిక్సూచిలా పనిచేయాలి…ఇలా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన వారసుడు లోకేష్ తెలుగు తమ్ముళ్లకు ఇచ్చిన పిలుపులివి. కానీ వారు మాత్రం రాష్ట్రం అవతల వేడుకలు చేసుకోవడంతో సగటు తెలుగు తమ్ముళ్లు మదనపడుతున్నారు. తండ్రీ కొడుకుల తీరును తప్పు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రతీ నియోజకవర్గంలో బాధ్యులు జన సమీకరణ చేసి కార్యక్రమాలు నిర్వహించారు. బైక్ ర్యాలీలు చేపట్టారు. పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న సీనియర్ నాయకులను సన్మానించుకున్నారు. ఇందుకుగాను లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టారు. కానీ పార్టీ అధినేత చంద్రబాబు పక్క రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కే పరిమితం కావడం విమర్శలకు తావిస్తోంది. అటువంటప్పుడు తమకు ఎందుకు పిలుపునివ్వాలని నాయకులు మథనపడుతున్నారు. ఈ విషయంలో పార్టీ కీలక నాయకులు సైతం ఒకింత అసహనంతోనే ఉన్నారు. రాష్ట్రాన్ని విడిచిపెట్టి వారికి హైదరాబాద్ తో ఏం పని అని ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు. ఇలాగైతే పార్టీకి మైలేజ్ రావడం మాట దేవుడెరుగు. ఉన్న కొద్దిపాటి బలం నీరుగారిపోయే అవకాశముందని కలత చెందుతున్నారు.
ఇలానే కొనసాగితే భారీ మూల్యం
గత కొద్ది రోజులుగా తండ్రీ కుమారుల తీరు బాగాలేదని కొందరు అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నారు. ఇలాగే కొనసాగితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ ఉన్నా వారికి దిశ నిర్దేశం చేసేవారు కరువయ్యారు. ఈ పరిస్థితుల్లో నారా లోకేష్ ఒక ఆశాదిపంలా ఉండాలి. కానీ ఆయన ప్రతిబంధకంగా మారాడు. పార్టీలో అసమ్మతికి కారణమవుతున్నారు. లోకేష్ తో సన్నిహిత సంబంధాలున్న చాలా మంది నాయకులు వారి జిల్లాల్లో స్థానిక నాయకత్వాన్ని లెక్క చేయడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి వాటి విషయాలు బయటికి రావు. కానీ విపక్షంలో ఉన్నప్పుడు మాత్రం అచీతూచి అడుగులు వేయాల్సిన అవసరముంది. అందుకే తిరుపతి ఉప ఎన్నిక సమయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. లోకేష్ తీరుపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఆయనే బాగుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదంటూ.. ‘పార్టీ లేదు, బొక్కా లేదు’ అంటూ అచ్చెన్న వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయితే సాక్షాత్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే చేసిన వ్యాఖ్యలు అంతర్మథనంతో చేసినవే. లోకేష్ అనాలోచిత నిర్ణయాలతో పార్టీకి నష్టం జరుగుతుందని ఈ వ్యాఖ్యలు తేటతెల్లం చేస్తున్నాయి.
Also Read: Current Shock: కేసీఆర్ యే కాదు.. జగన్ కూడా ‘షాక్’ ఇచ్చాడు! పెరిగిన కరెంట్ ఛార్జీలివే!
నాటి రాజకీయ పరిణితి ఏదీ?
అటు చంద్రబాబు కూడా గతంలోలాగా రాజకీయ పరిణితి చూపడం లేదు. తప్పు మీద తప్పులు చేసుకుంటూ పొతున్నారు. సీనియర్ల సలహాలు, సూచనలు పాటించడం లేదు. వారి అభిప్రాయాలను తీసుకోవడం లేదు. కుమారుడు లోకేష్ ను ప్రమోట్ చేయాలనుకున్న ఆరాటంతో తనలో ఉన్న విలక్షణ నాయకత్వాన్ని దిగజార్చుకుంటున్నారన్న వ్యాఖ్యలు తెలుగు తమ్ముళ్ల నుంచే వినబడుతున్నాయి. కేవలం తన సొంత సామాజికవర్గ నేతలనే చేరదీస్తున్నారన్న అపవాదును ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే కమ్మ పార్టీగా ముద్ర వేసి, వ్యతిరేక భావనను రెచ్చగొట్టి జగన్ రాజకీయ లబ్థి పొందినా చంద్రబాబులో మార్పు రావడం లేదు. అయితే చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ చేస్తున్న తప్పులను పచ్చ మీడియా ఒప్పుగా చూపిస్తోంది. గోరంత మైలేజ్ వస్తే కొండంత వచ్చినట్టు పచ్చ మీడియా బూతద్ధంలో చూపిస్తోంది. పార్టీకి నష్టం జరిగితే మాత్రం ఆ వార్తను కవర్ చేసిన పాపాన పోలేదు. ప్రజాదరణతో పార్టీ గెలుపొందిన సమయంలో సైతం అది మావల్లే సాధ్యమైందని పచ్చ మీడియా అధినేతలు తెగ బిల్డప్ ఇస్తుంటారు. చంద్రబాబు, లోకేష్ లు సైతం వారినే చేరదీస్తుంటారు. నిన్న టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ అధినేత హైదరాబాద్ లో జరుపుకోవడంపై తెగ విమర్శలు వచ్చాయి. కానీ పచ్చ మీడియా నేతలకు మాత్రం అవేవీ కనిపంచలేదు. సరికదా కార్యక్రమంలో భవిష్యత్ టీడీపీ ప్రస్థానాన్ని కళ్లకు కట్టినట్టు చూపి విశేష వార్తలు ప్రచురించారు. సగటు తెలుగు తమ్ముడు మాత్రం ఈ రోత వ్యాఖ్యలను చూసి ఇదేనా పార్టీని బలోపేతం చేయడం అంటూ నిట్టూర్చారు.
Also Read:Uniform Secretariat Employees: జగన్ చెప్పినదేమిటి? చేస్తున్నదేమిటి? సచివాలయ ఉద్యోగులకు తీరని వ్యథ