Chandrababu : చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో మరో కీలక పరిణామం. చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని ఏపీ సిఐడి దాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు 52 రోజులు పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనారోగ్య కారణాలతో ఆయనకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే బెయిల్ ఇచ్చే క్రమంలో నిబంధనలు పాటించలేదని.. చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈరోజు కోర్టులో ఈ పిటిషన్ పై విచారణ జరిగింది. ఏపీ సిఐడి తరపు న్యాయవాది కీలక అంశాలను కోర్టు ముందు ఉంచారు.
సిఐడి తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ కీలక అంశాలను కోర్టు ముందు ఉంచారు. చంద్రబాబుకు బెయిల్ మంజూరు తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. చంద్రబాబు కుటుంబం ఒక డైరీలో అధికారుల పేర్లు నమోదు చేస్తోందని.. వారు అధికారంలోకి వస్తే అందరిపై చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారని ప్రత్యేక ప్రస్తావని తీసుకొచ్చారు. ఇలా బెయిల్ రద్దుకు అనేక కారణాలు ఉన్నాయని.. న్యాయస్థానం పరిశీలించాలని ఆయన కోరారు. బెయిల్ రద్దు అనేది ఈ పిటిషన్ ప్రధాన ఉద్దేశం అని చెప్పుకొచ్చారు.
అయితే దీనిపై చంద్రబాబు తరుపు న్యాయవాది హరీష్ సాల్వే కొన్ని అంశాలను కోర్టు ముందు ఉంచారు. సిఐడి న్యాయవాది లేవనెత్తిన ప్రతి అంశానికి తాము సమాధానం ఇస్తామని చెప్పుకొచ్చారు. దీనిపై స్పందించిన ధర్మాసనం రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. మూడు వారాల తర్వాత తదుపరి విచారణ చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది. కాగా జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ తో కూడిన ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. కాగా చంద్రబాబు బెయిల్ రద్దు పై ఏపీ సిఐడి ఆశలు నీరుగారినట్లు అయ్యింది.