Chandrababu IT Notice: చంద్రబాబుకు ఐటి నోటీసులు జారీ చేయడం రాజకీయ దుమారం రేపుతోంది. టిడిపి ప్రభుత్వ హయాంలో అస్మదీయ కంపెనీల నుంచి రూ. 118 కోట్ల ముడుపులు అందుకున్నారని.. దీనిపై సంజాయిషీ ఇవ్వాలంటూ చంద్రబాబుకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిని వైసిపి ఒక అస్త్రంగా చేసుకుంది. చంద్రబాబుపై ముప్పేట దాడి చేస్తోంది. అదే సమయంలో జనసేన అధినేత పవన్ ఎందుకు స్పందించరని ప్రశ్నిస్తోంది.
వాస్తవానికి చంద్రబాబుకు నోటీసు అందించినట్లు ఆదాయ పన్ను శాఖ అధికారికంగా వెల్లడించలేదు. దీనిపై నేషనల్ మీడియా సంస్థ హిందుస్థాన్ టైమ్స్ ప్రత్యేక కథనం ప్రచురించింది. అప్పటి నుంచి జగన్ మీడియాకు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు మాదిరిగా.. అదే కథనాలను వండి వార్చుతోంది. ఇక వైసిపి సోషల్ మీడియా గురించి చెప్పనవసరం లేదు. చంద్రబాబును తెగ ట్రోల్ చేస్తోంది. అంతటితో ఆగకుండా పవన్ సంగతి ఏంటి అని ప్రశ్నిస్తోంది. దత్త తండ్రి అవినీతిని ప్రశ్నించలేని స్థితిలో పవన్ ఉన్నారా అని ఎద్దేవా చేస్తోంది. పవన్ మౌనాన్ని మరోలా ప్రచారం చేస్తోంది. చంద్రబాబు అవినీతి లో పవన్ కు వాటా ఉందని కొత్త ప్రచారానికి తెర తీస్తోంది. ఇదే జగన్కు ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసి ఉంటే పవన్ వీర విహారం చేసి ఉండే వారిని గుర్తు చేస్తోంది.
వాస్తవానికి చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇవ్వడంపై..ఒక్క సాక్షి మీడియాలో మాత్రమే కథనాలు వస్తున్నాయి. ఎల్లో మీడియా కానీ, తటస్థ మీడియా కానీ, పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అటు విపక్షాలు సైతం స్పందించడం లేదు. ఒక్క అధికార వైసీపీ మాత్రమే హడావిడి చేస్తోంది. మంత్రుల నుంచి దిగివస్తాయి నేతల వరకు చంద్రబాబుపై ముప్పేట దాడి చేస్తున్నారు. జగనే కాదు చంద్రబాబు కూడా అవినీతిపరుడే నని ప్రజలు భావించేలా ఊరువాడా ప్రచారం చేస్తున్నారు. పనిలో పనిగా పవన్ కు ఈ మకిలి అంటించేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబుతో సన్నిహితంగా మెలుగుతుండటంతో.. పవన్ ను వైసీపీ టార్గెట్ చేయడానికి గమనించొచ్చు. కానీ నోటీస్ అందించడం పై కూడా స్పందించాలని వైసీపీ కోరుతుండడం విమర్శలకు తావిస్తోంది.