https://oktelugu.com/

Chandrababu : చేతులెత్తేసిన చంద్రబాబు

చంద్రబాబు నిర్ణయం పైనే పవన్ కళ్యాణ్ గంపెడు ఆశలు పెట్టుకున్నారని.. ఒక నిమిషంలో ఏం చేస్తారో అనేది ఆందోళనగా ఉందని జనసేన నాయకులు అంటున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : February 5, 2024 / 03:11 PM IST
    Follow us on

    Chandrababu : రోజురోజుకు ఏపీ ఎన్నికల ముఖచిత్రం ఆసక్తికరంగా మారుతున్నది. ఓవైపు జగన్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సిద్ధమా అంటూ ఏపీ ప్రజలను తట్టి లేపుతున్నారు. అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఎలాగూ గెలవరు అనే అభ్యర్థులను నిర్మోహమాటంగా బయటికి పంపేస్తున్నారు. అలా బయటికి వచ్చిన వారేమో టిడిపి లేదా జనసేనలో చేరుతున్నారు. వచ్చిన వారిని చూసుకొని టిడిపి నాయకులు, దాని అనుకూల మీడియా డప్పాలు కొడుతోంది. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానిని ఎవరూ పసిగట్ట లేకపోతున్నారు. దీనికి తోడు జనసేన, టిడిపి కూటమికి సంబంధించి సీట్ల పంపకం, ఇతర విషయాలు ఒక కొలిక్కి రావడం లేదు. సాధారణంగానే చంద్రబాబు నాయుడు ఏ విషయాన్నీ కూడా తొందరగా తేల్చరు అనే అపవాదు ఉంది. సీట్ల విషయంలో ఇంతవరకు ఒక స్పష్టమైన ప్రకటన రెండు పార్టీలు చేయలేదు. దీనికి తోడు లోకేష్ కనిపించడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లాడో ఎవరూ చెప్పడం లేదు. ఈ నేపథ్యంలో అటు టిడిపి నాయకులు, ఇటు జనసేన నాయకులు మదనంలో పడ్డారు. అసలు సీట్ల పంపకం జరుగుతుందా? జరిగితే జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు? మరి సీట్లు రాని వారికి ఎలాంటి ప్రాధాన్యమిస్తారు? అనే ప్రశ్నలకు జవాబులు చెప్పే వారే లేరు.

    ఇప్పటికే వైసిపి పలుమార్లు సర్వేలు నిర్వహించింది. ఏఏ నియోజకవర్గాల్లో అభ్యర్థులు గెలుస్తారో వారికి మాత్రమే టికెట్ ఇస్తామని ప్రకటించింది. మిగతా వారి విషయంలో పొమ్మన లేక పొగ పెట్టింది. దీంతో వారు అనివార్యంగా పార్టీని ఖాళీ చేయవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు వైసిపి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోగలుగుతుంది. సీట్లు ఇచ్చే దక్కే వారికి మాత్రమే జగన్ అపాయింట్మెంట్ దొరుకుతోంది. మిగతా వారిని తాడేపల్లి ప్యాలెస్ లోపలికి అనుమతించడం లేదు. సాధారణంగా ఈ పరిణామాలను టిడిపి అనుకూల మీడియా భూతద్దంలో పెట్టి చూపిస్తోంది. కానీ ఎన్నికల్లో ఇలా నిక్కచ్చిగా ఉంటేనే గెలుస్తామనే విషయాన్ని టిడిపి మీడియా దాచిపెడుతోంది. పొరుగున ఉన్న తెలంగాణలో కెసిఆర్ ఆత్మవిశ్వాసంతో సిట్టింగ్ లకి టికెట్లు ఇవ్వడంతో ఏం జరిగిందో జగన్ చూశాడు కాబట్టి అలాంటి ప్రయోగాల జోలికి పోదలుచుకోలేదు.. అందువల్లే నియోజకవర్గాలకు అభ్యర్థులను చాలావరకు మార్చేశాడు. పార్లమెంటు స్థానాలు విషయంలోనూ ఇదే ధోరణి ఉంటుందని జగన్ చెప్పకనే చెప్పాడు. ఇక జన్ మత్ అనే సర్వే సంస్థ ఏపీలో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పింది.. మరి ఈ నేపథ్యంలో పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో చంద్రబాబు విఫలం అవుతున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ అభ్యర్థుల కూర్పు ఒక కొలిక్కి రాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. భేటీల మీద భేటీలు జరుగుతున్నప్పటికీ ఏ విషయం మీదా ఒక స్పష్టత రాలేదని తెలుస్తోంది. చివరికి పచ్చ మీడియా సైతం దీన్ని కవర్ చేయలేక నానా తంటాలు పడుతున్నది. ఈ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్న ఏపీలోని వైసిపి నాయకులు జనసేన, టిడిపి కూటమిపై విమర్శలను పెంచారు.

    చంద్రబాబు కోసం పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు త్యాగం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. 2014లో త్యాగం చేస్తే టిడిపి నాయకులు పవన్ కళ్యాణ్ కు ఎలాంటి సన్మానం చేశారో అందరికీ తెలుసన్నారు. ఇప్పటి ఎన్నికల్లో కేవలం 25 సీట్లు మాత్రమే ఇస్తారని వార్తలు వస్తున్నాయని.. ఇదే జరిగితే చంద్రబాబు మరోసారి పవన్ కళ్యాణ్ మోసం చేసినట్టేనని వారు గుర్తు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన రాజకీయ భవిష్యత్తు కోసం జనసేన పార్టీ కార్యకర్తల మనోభావాలను చంద్రబాబు వద్ద తాకట్టు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఎన్నికల నాటికి కూడా చంద్రబాబు సీట్ల విషయాన్ని తేల్చరని.. అప్పుడు జనసేన పార్టీ మోసపోతుందని వారు జోస్యం చెబుతున్నారు. చంద్రబాబు ఇప్పుడు కాడి ఎత్తివేసారని.. ఆ విషయమే పవన్ కళ్యాణ్ కు అర్థం కావడం లేదని వైసీపీ నాయకులు అంటున్నారు. బాలశౌరి లాంటి అవినీతిపరుడిని వైసీపీ వదిలించుకుందని.. కానీ అలాంటి వారిని జనసేన పార్టీలో చేర్చుకోవడమే పెద్ద తప్పు అని వారు గుర్తు చేస్తున్నారు. ఈ విమర్శలు ప్రతి విమర్శలతో ఏపీ రాజకీయాలు వేడెక్కగా.. సీట్ల విషయంలో మాత్రం చంద్రబాబు ఒక నిర్ణయానికి రాలేదు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు చంద్రబాబు నిర్ణయం పైనే పవన్ కళ్యాణ్ గంపెడు ఆశలు పెట్టుకున్నారని.. ఒక నిమిషంలో ఏం చేస్తారో అనేది ఆందోళనగా ఉందని జనసేన నాయకులు అంటున్నారు.