Chandrababu- Pawan Kalyan And NTR: ఏపీలో అధికారంలోకి రావాలి..తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలి. చంద్రబాబు ముందున్న కర్తవ్యం. అయితే తెలంగాణలో బలపడితే కానీ.. ఏపీలో వర్కవుట్ కాదు. ఎందుకంటే తెలంగాణలో పాత కేడర్ కు జవసత్వాలు నింపి..దానిని బీజేపీకి కన్వెర్ట్ చేయాలి. దానికి బదులుగా ఏపీలో బీజేపీ సహకారం తీసుకోవాలి. చంద్రబాబు ముందున్న టాస్క్ ఇది. అందుకే ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేశారు. తరువాత రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్ లో వరుసగా సభలు పెట్టాలని డిసైడ్ అయ్యారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ రూపంలో చంద్రబాబుకు చికాకులు పెరుగుతున్నాయి. మొన్నటికి మొన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇష్యూలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరుతో టీడీపీ శ్రేణులు నొచ్చుకున్నాయి. దీంతో జూనియర్ సౌండ్ పార్టీలో తగ్గింది. చంద్రబాబు కూడా ఊపిరిపీల్చుకున్నాయి. అయితే నిన్నటి ఖమ్మం సభలో, అంతకంటేముందు మచిలీపట్నం, చివరకుచంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోపార్టీ శ్రేణులు జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి తెప్పించాలని నినాదాలు చేశారు. కానీ చంద్రబాబు వాటికిపెద్దగా రియాక్ట్ కాలేదు.

చంద్రబాబు ఇప్పుడు వైసీపీ సర్కారుతో గట్టిగానే పోరాడుతున్నారు. కానీ తన శక్తి ఒక్కటే చాలదని ఆయనకు తెలుసు. అందుకే అటు పవన్ ను, ఇటు బీజేపీని కలుపుకొని వెళితే సక్సెస్ కావచ్చని భావిస్తున్నారు. 2014 పొత్తులను రిపీట్ చేయాలని భావిస్తున్నారు. పవన్ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలినివ్వనని.. అందర్ని ఒకేతాటిపైకి తీసుకొస్తానని చెబుతున్నారు. సో ఆయన చంద్రబాబుతో కలిసేందుకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ నుంచి స్పష్టత రావడం లేదు. అందుకే చంద్రబాబు తెలంగాణ పాలిటిక్స్ లోకి ఎంటరయ్యారు. ఇప్పుడున్న మూడు నాలుగు ఓటు షేర్ ను పది, పన్నెండు శాతానికి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.ప్రస్తుతం తెలంగాణలో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ మధ్య భీకర పోరు నడుస్తోంది. అందులో తన సాయం బీజేపీకి అనివార్యంగా మారే పరిస్థితులు కల్పించాలన్నది చంద్రబాబు వ్యూహం. అయితే తాను ఇలా రెండు రాష్ట్రాల్లో కష్టపడుతున్న సమయంలో పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ ను తెప్పించాలన్న డిమాండ్ మళ్లీ ఊపందుకుంది. దీంతో చంద్రబాబు పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది.
2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి మద్దతుగా ప్రచారం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రథయాత్ర చేశారు. ఖమ్మం జిల్లాలో ప్రమాదానికి గురయ్యారు. యాత్రను అర్ధాంతరంగా ముగించారు. ఇప్పుడదే ఖమ్మం జిల్లా నుంచి జూనియర్ కు మద్దతుగా గట్టి వాయిసే వినిపించింది. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచి చంద్రబాబు ప్రమాణస్వీకారం కార్యక్రమానికి తారక్ హాజరయ్యారు. అటు తరువాత క్రమేపీ జూనియర్ కు పార్టీతో గ్యాప్ పెరిగింది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తరువాత అది మరింత ఎక్కువైంది. అటు వైసీపీలో ఉన్న జూనియర్ సహచరులు కొడాలి నాని, వల్లభనేని వంశీలు దూకుడుగా ఉన్నారు. ఇటువంటి సమయంలో పార్టీ శ్రేణుల విన్నపాన్ని మన్నించి చంద్రబాబు పిలుస్తారా? పిలిచినా జూనియర్ వస్తారా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

ప్రస్తుతం నందమూరి కుటుంబమంతా చంద్రబాబు వెంట ఉంది. చివరకు హరికృష్ణ కుమార్తె సుహాసిని సైతం పార్టీలో యాక్టివ్ గానే పనిచేస్తున్నారు. దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబం సైతం చంద్రబాబుతో ఉన్న పాత వైరాన్ని మరిచి మంచి సంబంధాలే కొనసాగిస్తోంది. వారు టీడీపీ గూటికి చేరుతారని ప్రచారం సాగుతోంది. ఈ సారి నందమూరి కుటుంబసభ్యుల సేవలను ఎన్నికల్లో వినియోగించుకోవాలని చంద్రబాబు డిసైడ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూనియర్ పాత్ర ఏంటన్నదానిపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో జూనియర్ బిజీగా ఉన్నారు. కుటుంబమంతా పిలిస్తే ప్రచారానికి వస్తారా? లేదా ? అన్నది తెలియాల్సి ఉంది. అయితే గట్టి ప్రత్యర్థి కావడంతో చంద్రబాబుతో పిలిపించడం.. జూనియర్ వచ్చేటట్టు చేయడం వంటి బాధ్యతలను సామాజికవర్గంలో కీలక వ్యక్తులుతీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై చంద్రబాబు కానీ.. జూనియర్ కానీ నోరు మెదిపితే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు..