AP Kapu Leaders- Jagan: వైసీపీలో కాపు నేతలకు తమ వర్గ ప్రయోజనాలు పట్టవు. జగన్ ద్వారా పదవులు వచ్చాయి. అతడే మా కుల దైవం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. అయిన దానికి కానిదానికి పవన్ పై విమర్శలు చేస్తున్నారు. పవన్ ఒక్కడే కాదు..మేము కాపు నాయకులమేనని చెప్పుకొస్తున్నారు. కాపులకు ముంచేస్తున్న జగన్ వైఖరిని మాత్రం తప్పుపట్టారు. దాని గురించి ప్రస్తావించేందుకు సాహిసించడం లేదు. కానీ వచ్చే ఎన్నికల్లో పవన్ నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొవడానికి వ్యూహ రచన చేస్తున్నారు. దాని నుంచి జగన్ ను, వైసీపీని బయటపడేసేందుకు తెగ ఆరాట పడుతున్నారు. ప్రత్యేకంగా వైసీపీ కాపు నేతలు సమావేశమై తమలాంటి వారందరికీ పదవులు రావడానికి జగనే కారణమని చెబుతున్నారు.ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి రంగా హత్య కేసును మరోసారి రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు. రంగాను హత్యచేసింది నాటి టీడీపీ గుండాలేనన్న పాత వాదన తెరపైకి తెస్తున్నారు. పవన్ టీడీపీ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారే తప్ప.. కాపుల కోసం కాదన్నట్టు ఆరోపిస్తున్నారు. మరోసారి కాపులను డైవర్ట్ చేసే పనిలో పడ్డారు.

తెలుగుదేశం పార్టీ హయాంలో కాపులకు ఇచ్చిన ఐదు శాతం రిజర్వేషన్లు చెల్లుబాటు అవుతాయని తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది. దీంతో తమకు రిజర్వేషన్లు అమలవుతాయని కాపులు ఎంతో ఆశ పెట్టుకున్నారు. కానీ నెలలు గడుస్తున్నా జగన్ సర్కారు అమలు చేయడం లేదు. అయితే కాపులు తనకు దూరమయ్యారన్న అక్కసో.. లేకుంటే ఎలాగూ దూరమయ్యారు కదా.. వారికి రిజర్వేషన్లు అమలుచేసి.. మిగతా వర్గాలకు దూరం చేసుకోవడం ఎందుకని ఆలోచిస్తున్నారో తెలియదు కానీ.. జగన్ మాత్రం కాపుల రిజర్వేషన్ విషయంలో ఎటువంటి ప్రకటన చేయడంలేదు. గత ఎన్నికల్లో కాపుల ఓట్లు కొల్లగట్టడంలో జగన్ సక్సెస్ అయ్యారు. కానీ ఎన్నికల తరువాత కాపులకు అనుకూలించే ఏ నిర్ణయమూ తీసుకోలేదు. చంద్రబాబు కల్పించిన ఐదు శాతం రిజర్వేషన్లు రద్దుచేసి గట్టి దెబ్బ కొట్టారు. దానిని చంద్రబాబు ఫెయిల్యూర్ గా చూపించారు. రిజర్వేషన్లు సాధ్యం కాదని ..అవి చెల్లుబాటు కావని వాదించారు. కానీ ఇటీవల ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి పది శాతం ఈబీసీ రిజర్వేషన్ సాధ్యమేనని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసిన తరువాత కూడా కాపుల రిజర్వేషన్లను జగన్ సర్కారు పునరుద్ధరించలేదు.
గతంలో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ టీడీపీ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో తీర్మానం చేసింది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం తొలుత సమ్మతించలేదు. సుప్రీం కోర్టు 50 శాతం రిజర్వేషన్లు మించకూడదన్న ఆదేశాలను గుర్తుచేస్తూ అడ్డుకుంది. అటుతరువాత ఎన్డీఏ ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన ఓబీసీల కోసం పది శాతం రిజర్వేషన్లు అందుబాటులోకి తేవడంతో చంద్రబాబు చురుగ్గా పావులు కదిపారు. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు అమలుచేయడానికి నిర్ణయించారు. అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదించారు. అమలు కోసం ప్రత్యేక జీవో ఇచ్చారు. గవర్నర్ చే ఆమోదముద్ర వేయించి కాపులకు ఈబీసీ సర్టిఫికెట్లు జారీ చేశారు.

అయితే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. వైసీపీ అంతులేని విజయంతో అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు కాపులకు ఇచ్చిన రిజర్వేషన్లు చెల్లవని రద్దుచేసింది. అయితే వైసీపీ మంచి ఊపు మీద ఉండడంతో కాపు సామాజికవర్గానికి చెందిన వైసీపీ నేతలు సైలెంట్ అయ్యారు. దాని గురించి మాట్లాడేందుకు కూడా సాహసించలేదు. కానీ ఇప్పుడు కేంద్రం ఈబీసీ వర్గాల రిజర్వేషన్లు, కాపులకు చంద్రబాబు కల్పించిన రిజర్వేషన్లు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసినప్పటికీ కాపు నేతల్లో ఎటువంటి కదలికలు రాలేదు. రాజకీయంగా పవన్ ను తిట్టడానికో.. లేకంటే జగన్ దగ్గర పెద్ద పాలేర్లుగా చెప్పుకోవడానికే అన్నట్టు వారు పదవులు వెలగబెడుతున్నారు. నాలుగేళ్లుగా రిజర్వేషన్ ఫలాలు అనుభవించాల్సిన కాపులకు ఎంతలా దగా చేయాలో అంత చేశారు. ఇప్పటికైనా మాట్లాడకుంటే కాపు సమాజంలో వారు చరిత్రహీనులుగా మిగలక తప్పదని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.