Chandrababu IT Notice: చంద్రబాబుకి అవినీతి మరక అంటించడానికి వైసిపి సర్కార్ చేయని ప్రయత్నం అంటూ లేదు. వందల కొద్ది సలహాదారులు, అటు అస్మదీయ మీడియా.. ఇలా అన్ని రకాలుగా భారీ యంత్రాంగం ఉన్నా చంద్రబాబు అవినీతిని నిరూపించలేకపోతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత శుల శోధన చేసి మరి చంద్రబాబు అవినీతిని వెతికారు. ఇందుకోసం భారీ అధికార గణం పనిచేసింది. కానీ ఏ చిన్న లోపం గుర్తించలేకపోయింది. అయితే చంద్రబాబు అవినీతి నిరూపణ కంటే.. దానిపై ప్రచారానికి వైసీపీ ప్రాధాన్యమిస్తోంది. ఇప్పుడు ఐటీ నోటీసులు విషయంలో కూడా అదే చేస్తోంది.
వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు అవుతోంది. తొలుత చంద్రబాబు ఆరు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని పుస్తకాలు వేశారు. కానీ నయా పైసా అవినీతిని నిరూపించలేకపోయారు. పోలవరం ప్రాజెక్టును ఏటీఎం కేంద్రంగా మార్చేశారని ఆరోపణలు చేశారు. అందులో ఎటువంటి అవినీతి లేదని స్వయంగా క్లీన్ చీట్ ఇచ్చారు. అమరావతిలో భారీ స్కాం జరిగిందని ఆరోపణలు చేశారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయినా సరే ఏ ఒక్క ఆధారాన్ని బయట పెట్టలేకపోయారు. హెరిటేజ్ మజ్జిగను సైతం వదల్లేదు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఆరోపణలు చేస్తూ వచ్చారు. కానీ ఏ ఒక్క అవినీతి ఆరోపణను నిరూపించలేదు.
తాజాగా చంద్రబాబుకు ఐటి నోటీసులు విషయంలో కూడా హడావిడి చేస్తున్నారు. నోటీసులు వచ్చిన మాట నిజమే.. దానికి చంద్రబాబు సైతం సమాధానమిచ్చారు. వాస్తవానికి కథనం రాసింది హిందుస్థాన్ టైమ్స్. మరోసారి డెక్కన్ క్రానికల్ లో, ఇంకోసారి పయనీర్ లో కథనాలు వచ్చాయి. కానీ సొంత మీడియా సాక్షి ఉన్నా.. తొలుత వార్త వచ్చింది మాత్రం నేషనల్ మీడియాలోనే. అంటే సాక్షి ఫెయిల్ అయినట్టే కదా. వాస్తవానికి ఐటీ నోటీసులు ఇచ్చింది. చంద్రబాబు సమాధానమిచ్చారు. కానీ వైసీపీ సోషల్ మీడియా మాత్రం అదే పనిగా ప్రచారం చేస్తోంది. ఆ నోటీసుల్లో పసలేని విషయం అందరికీ తెలిసిందే. చివరకు రాష్ట్ర ప్రభుత్వ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందులో విషయం లేదని చెప్పకనే చెప్పారు. సాంకేతిక అంశాలతో చంద్రబాబు తప్పించుకుంటున్నారని ఒక మాట అనగలిగారు. చంద్రబాబు సమర్ధుడని చెప్పడం ద్వారా తాము అసమర్ధులమన్న విషయాన్ని బయట పెట్టేశారు. ఆదాయ పన్ను శాఖ నోటీసు చుట్టూ ఎంత ప్రచారం చేసినా చంద్రబాబుకు పోయేదేమీ లేదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.