Chandrababu Naidu: చంద్రబాబు ఈసారి రొటీన్ కు భిన్నంగా వెళ్తున్నారు. ఎటువంటి మొహమాటలకు పోదలుచుకోలేదు. కేవలం గెలుపు గుర్రాలు అని తేలితేనే టికెట్లు కట్టబెడుతున్నారు. ఎంత పెద్ద సీనియర్లు అయినా పక్కకు తప్పిస్తున్నారు. సర్వేల్లో అనుకూలమని తేలితే మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు. అభ్యర్థులుగా ప్రకటిస్తున్నారు. ఇప్పటివరకు మూడు జాబితాలను ప్రకటించారు. 139 అసెంబ్లీ సీట్లను ప్రకటించారు. 13 మంది పార్లమెంట్ స్థానాల అభ్యర్థులను సైతం ఖరారు చేశారు. కానీ ఈ జాబితాలో చాలామంది సీనియర్లకు చోటు దక్కకపోవడం విశేషం.
వాస్తవానికి పెనమలూరు టికెట్ ను కొలుసు పార్థసారధి కి కేటాయించాలి. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే. వైసిపి హై కమాండ్ ఆయనకు టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. అందరూ ఆయనకు పెనమలూరు టికెట్ ఖరారు చేస్తారని భావించారు. కానీ చంద్రబాబు మాత్రం అవకాశం ఇవ్వలేదు. పార్థసారధికి వేరే నియోజకవర్గాన్ని కేటాయించారు. అదే సమయంలో మైలవరం నియోజకవర్గాన్ని వసంత కృష్ణ ప్రసాద్ కు ఖరారు చేశారు. దీంతో అక్కడ టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమాను పెనమలూరు పంపిస్తారని ప్రచారం జరిగింది. దీంతో బోడె ప్రసాద్ ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో సర్వేలో బోడె ప్రసాద్ కు అనుకూలంగా రావడంతో ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ మూడో జాబితాలో పేరును ప్రకటించారు.
వైసీపీ నుంచి వచ్చిన ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థానం ఇచ్చారు. అటు పెనమలూరు టికెట్ ఆశిస్తున్న బోడె ప్రసాద్ కు న్యాయం చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో మాజీ మంత్రి దేవినేని ఉమా అన్యాయానికి గురయ్యారు. అయితే ఆయనను ఒప్పించి ఈ మార్పులు చేశారా? లేకుంటే ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారా? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. చంద్రబాబుకు దేవినేని ఉమా సొంత మనిషి. అటు ఉమా సైతం చంద్రబాబుతో పాటు లోకేష్ పట్ల వీర విధేయత చూపుతారు. అందుకే ఈసారి పార్టీకి దేవినేని సేవలను వినియోగించుకోవాలని చూస్తున్నారా? లేకుంటే ఇంకా పెండింగ్ నియోజకవర్గాల్లో ఎక్కడైనా పోటీలో పెడతారా అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఈసారి మాత్రం ఎటువంటి మొహమాటలకు పోకుండా చంద్రబాబు అభ్యర్థుల ప్రకటన విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం.