Vundavalli Sridevi: టిడిపిలోకి ఫిరాయించిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కలేదు. దీంతో వారు చంద్రబాబుపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. టికెట్ హామీ తోనే తాము టిడిపికి మద్దతు తెలిపామని.. తీరా పార్టీలో చేరాక తమకు టిక్కెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలలో ఒకరైన ఉండవెల్లి శ్రీదేవి చేసిన ట్విట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనం గా మారింది. గత ఏడాది మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేశారన్న కారణంతో వైసిపి నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసింది. దీంతో వారు టిడిపిలోకి ఫిరాయించారు. ఇలా చేరిన నలుగురిలో కేవలం ఇద్దరికీ మాత్రమే టిడిపి టికెట్లు ఇచ్చింది. మిగతా ఇద్దరికి టిక్కెట్లు ఇవ్వమని తేల్చేసింది. దీంతో టిక్కెట్ దక్కని వారు అసంతృప్తితో ఉన్నారు.
వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారిలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు. వారందరికీ ఎన్నికల్లో టికెట్లు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి, ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డికి మాత్రమే చంద్రబాబు అవకాశం ఇచ్చారు. తాడికొండ టికెట్ ఆశించిన ఉండవెల్లి శ్రీదేవికి, ఉదయగిరి టిక్కెట్ ఆశించిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఈసారి టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆ ఇద్దరి నేతల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది.ఈ నేపథ్యంలో ఉండవల్లి శ్రీదేవి చేసిన ట్విట్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చేసుకున్నోళ్లకు చేసుకున్నంత మహదేవ అని నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.
టిడిపిలో చేరిన తరువాత ఉండవల్లి శ్రీదేవి అతిగా వ్యవహరించారు.వైసిపి పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. చంద్రబాబుతో పాటు లోకేష్ లను పొగడ్తలతో ముంచెత్తారు. ఆమె టిడిపిలో చేరినప్పుడే చంద్రబాబుకు మూడు ఆప్షన్స్ కూడా ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ముందుగా తనకు తాడికొండ టికెట్ ఇవ్వాలని.. లేకుంటే తిరువూరు అసెంబ్లీ స్థానం ఇవ్వాలని.. అక్కడికి కుదరకపోతే బాపట్ల పార్లమెంట్ స్థానాన్ని కేటాయించాలని ఆమె కోరినట్లు ప్రచారం జరిగింది.ఆ మూడింటిలో ఒకటి కూడా చంద్రబాబు తీర్చలేదు. దీంతో ఆమెకు తత్వం బోధపడింది. ఏకంగా ఆమె చేసిన ట్విట్ వైరల్ గా మారింది.’ రాజకీయాలు ఎలా ఉంటాయో.. ఎవరు ఎలాంటి వారో ఈ రోజు అర్థం అయ్యింది’అంటూ చేసిన ఆమె ట్విట్ చంద్రబాబును ఉద్దేశించిందే అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికైతే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఇద్దరికి మాత్రమే చంద్రబాబు ఛాన్స్ ఇచ్చారు.