Chandrababu Delhi Tour: చంద్రబాబు హస్తినా బాట పట్టనున్నారా? ఎన్డీఏకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయనున్నారా? బిహార్ సీఎం నితీష్ కుమార్ బయటకు వెళ్లడంతో ఆయన స్థానం భర్తీ చేయనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ మధ్యన బొత్తిగా ఢిల్లీకి రావడం తగ్గించేశారు. అప్పుడప్పుడు వస్తున్నండి అంటూ ఆ మధ్యన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబునుద్దేశించి ప్రధాని మోదీ అన్నట్టు టీడీపీ అనుకూల మీడియా తెగ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.దానికి బలం చేకూర్చేలా చంద్రబాబు హస్తినా టూర్లకు ప్లాన్ చేస్తున్నట్టు టీడీపీలో ప్రచారం జోరుగా సాగుతోంది. త్వరలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలను చంద్రబాబు కలుస్తారని టాక్ నడుస్తోంది. అందుకు సంబంధించి అపాయింట్మెంట్ల కోసం టీడీపీ నేతలు జోరుగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రయత్నాలు సఫలమైతే మాత్రం చంద్రబాబు ఢిల్లీ అగ్రనేతలను కలవడం ఖాయమంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ప్రధాని మోదీ కలుద్దామన్నారు కనుక తప్పకుండా అపాయింట్మెంట్ లభిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఇటు టీడీపీ నాయకులతో పాటు బీజేపీలో ఉన్న పాత టీడీపీ నాయకులు ఇదే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెగ ప్రచారం సాగుతోంది.
నితీష్ స్థానం భర్తీ..
బిహార్ సీఎం నితీష్ కుమార్ ఎన్డీఏకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల కూటమి వైపు ఆయన వెళ్లిపోయారు. దీంతో ఎన్డీఏకు బలం తగ్గింది. అలాగని ఎన్డీఏలోకి కొత్తగా వచ్చే మిత్రులెవరూ కనిపించడం లేదు. ఇది చంద్రబాబుకు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. పైగా ఎన్డీఏ పూర్వ మిత్రుడు. చాలా ఏళ్లు కీలక భాగస్వామిగా ఉన్నారు. అందుకే చంద్రబాబు లాంటి సీనియర్ అవసరం భవిష్యత్ లో ఎదురయ్యే అవకాశముందని బీజేపీ అగ్ర నేతలు భావిస్తున్నారు. పైగా నితీష్ నిష్క్రమణతో ఎన్డీఏ బలం తగ్గినట్టు ప్రచారం సాగుతోంది. విపక్ష కూటమి బలపడుతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో చంద్రబాబును దగ్గర చేసుకోవడమే మేలని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా భావిస్తున్నట్టు ప్రచారమైతే సాగుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు శర వేగంగా పావులు కదుపుతున్నారు. వీలైనంత త్వరగా ఎన్డీఏకు దగ్గర కావాలని ఉవ్విళ్లూరుతున్నారు.
Also Read: Pawan Kalyan Mala: పవన్ కళ్యాణ్ మాల ఏంటి? ఎలా చేస్తారు? దాని వల్ల ఏంటి ఉపయోగం అంటే?
పొత్తుల కసరత్తు..
ఇప్పటికే రాష్ట్రంలో టీడీపీ, జనసేనల మధ్య పొత్తు వాతావరణం ఉంది. బీజేపీ విషయమే ఎటూ తేలడం లేదు. అయితే టీడీపీతో పొత్తుకు రాష్ట్ర బీజేపీ నాయకులు ససెమిరా అన్నట్టు వార్తలు వచ్చాయి. అందుకు అనుగుణంగా నేతల ప్రకటనలు కూడా అదే విధంగా ఉండేవి. అయితే ఇటీవల వారి స్వరంలో కూడా మార్పు వచ్చింది. టీడీపీతో పాటు చంద్రబాబుపై విమర్శలు గుప్పించే బీజేపీ నాయకులు సైలెంట్ అయ్యారు. ఈ నేపథ్యంలో కానీ చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిస్తే.. పనిలో పనిగా పొత్తు అంశం కూడా ప్రస్తావించనున్నట్టు ప్రచారం సాగుతోంది. వీలైనంత త్వరగా పొత్తుల అంశాన్నితెరదించి ఎన్నికల వ్యూహానికి సిద్ధం కావాలని చంద్రబాబు ఆరాటపడుతున్నట్టు తెలుస్తోంది.
జగన్ ను దూరం చేసేందుకు..
ఇదే సమయంలో జగన్ ను బీజేపీ దూరం పెట్టేలా చంద్రబాబు పావులు కదపనున్నట్టు తెలుస్తోంది. మూడేళ్ల వైసీపీ పాలనలో తప్పిదాలను కేంద్ర పెద్దల ముందు ఉంచనున్నారు. టీడీపీ చేసిన ఫిర్యాదులపై విచారణకు కోరనున్నట్టు తెలుస్తోంది. గత మూడేళ్లుగా టీడీపీ నాయకులు, కార్యకర్తలపై జరిగిన దాడులు, అక్రమ కేసులపై ఫిర్యాదు చేయడం ద్వారా జగన్ ను ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నారు.మొత్తానికైతే వైసీపీ మైండ్ బ్లాక్ అయ్యే విధంగా చంద్రబాబు భారీ స్కెచ్ రూపొందిస్తున్నారు. అయితే ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ దొరుకుతుందో? లేదో? చూడాలి మరీ.
Also Read:BJP New Parliamentary Board: ప్రశ్నించేవారంతా ఔట్.. బీజేపీకి హోల్ అండ్ సోల్ చక్రవర్తి ఇక మోడీనే..