Chandrababu: పొత్తుల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ దాదాపు 30 నుంచి 40 అసెంబ్లీ స్థానాలను కోల్పోవాల్సి ఉంటుంది. మరో 10 పార్లమెంటు స్థానాలను త్యాగం చేయాల్సి ఉంటుంది. అందుకే చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఏయే నియోజకవర్గాలు పొత్తులో భాగంగా కోల్పోతారో.. ఆ నియోజకవర్గ టిడిపి నేతలను వ్యక్తిగతంగా సంప్రదిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇస్తున్నారు. మరోవైపు సీనియర్లకు సైతం కోత విధిస్తున్నారు. కుటుంబానికి ఒకటే టికెట్ అని తేల్చి చెబుతున్నారు. ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ ఒక్క చోటే బరిలో దిగాలని సీనియర్లకు సూచిస్తున్నారు.
విజయనగరంలో సీనియర్ నాయకుడు అశోక్ గజపతిరాజు ఎంపీగా, తన కుమార్తె అదితి గజపతి రాజుకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. చంద్రబాబు మాత్రంఅశోక్ గజపతిరాజుకు ఒక్కరికే విజయనగరం అసెంబ్లీ స్థానం కేటాయించేందుకు మొగ్గు చూపుతున్నారు. చింతకాయల అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం అసెంబ్లీ స్థానం, ఆయన కుమారుడు విజయ్ అనకాపల్లి పార్లమెంట్ స్థానాన్ని ఆశించారు. కానీ చంద్రబాబు ఒక్కరికే టికెట్ అని తేల్చి చెప్పారు. అనంతపురం నుంచి గత ఎన్నికల్లో జెసి కుటుంబంలో ఇద్దరికీ టిక్కెట్లు ఇచ్చారు. ఈసారి మాత్రం ఒక్కరికే టిక్కెట్ అని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. పరిటాల సునీత రాప్తాడు అసెంబ్లీ స్థానానికి, ధర్మవరం నుంచి ఆమె కుమారుడు శ్రీరామ్ బరిలో దిగాలని చూశారు. చంద్రబాబు మాత్రం ఒక్క రాప్తాడు కి పరిమితం కావాలని సూచించారు. కేఈ కుటుంబానికి కూడా అదే షరతు విధించారు. ఈ కృష్ణమూర్తి తో పాటు ఆయన సోదరుడు ప్రభాకర్ సైతం పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇద్దరిలో ఒకరికి టికెట్ ఇవ్వగలమని చంద్రబాబు సూత్రప్రాయంగా చెప్పుకొచ్చారు. కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి పార్లమెంట్ స్థానం, సుజాతమ్మ అసెంబ్లీ స్థానం ఆశిస్తున్నారు. కానీ వారికి ఒక్క పార్లమెంట్ స్థానానికి పరిమితం కావాలని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది.
ఈ కుటుంబాలది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం. గత నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. అటువంటి వారికి టిక్కెట్లు విషయంలో చంద్రబాబు తేల్చి చెబుతుండడంతో వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే చంద్రబాబు కుటుంబంలో ముగ్గురికి టికెట్లు కేటాయించడాన్ని కూడా కొందరు తప్పు పడుతున్నారు.చంద్రబాబు కుప్పం నుంచి,లోకేష్ మంగళగిరి నుంచి,బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.ఒకే కుటుంబంలో మూడు టికెట్లు ఇచ్చినట్లు అవుతుంది. మీకు ఒక న్యాయమా? మాకు ఒక న్యాయమా? అంటూ సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. ఇదేనా మా సుదీర్ఘకాల సేవలకు గుర్తింపు అంటూ నిలదీసినంత పని చేస్తున్నారు.