Jagan- Chandrababu: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్షంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. తన వయసు లెక్క చేయకుండా పర్యటనలతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. మరోవైపు కుమారుడు లోకేష్ పాదయాత్రను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. దీంతో రాజకీయంగా లోకేష్ సేఫ్ జోన్ కు చేరుతారని భావిస్తున్నారు. మరోవైపు పొత్తులు, పార్టీ బలోపేతం పై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో శనివారం జరగనున్న టీడీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటివరకూ తన వ్యూహాలతోనే పార్టీకి అనూహ్య విజయాలు కట్టబెట్టిన చంద్రబాబు.. ఈసారి తన ఒక్కడి బలమే చాలదన్నట్టు ఓ మేధావి సాయాన్ని తీసుకోవడానికి డిసైడ్ అయ్యారు. ఇప్పటికే ఆయన పార్టీకి సేవలందిస్తుండగా..నేరుగా ఆయన్ను పార్టీ శ్రేణులకు పరిచయం చేయడానికి చంద్రబాబు సిద్ధపడుతున్నారు.

గత ఎన్నికలకు ముందు.. విపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్లీనరీలో అనూహ్య నిర్ణయం ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నట్టు వెల్లడించారు. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ సేవలను వినియోగించుకోనున్నట్టు ప్రకటిస్తూనే.. నేరుగా ఆయన్ను పార్టీ శ్రేణులకు పరిచయం చేశారు. అటు తరువాత పీకే సలహాలు వర్కవుట్ కావడం, వైసీపీ అధికారంలోకి రావడం, జగన్ సీఎం కావడం జరిగిపోయింది. ఇప్పుడు అదే సీన్ ను చంద్రబాబు కూడా ఆవిష్కరించనున్నారు. శనివారం జరిగే టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి స్ట్రాటజిస్ట్ రాబిన్ శర్మను ముఖ్య అతిథిగా పిలిచారు. టీడీపీ శ్రేణులకు ఆయన్ను పరిచయం చేయనున్నారు. ఇదే వేదికపై లోకేష్ పాదయాత్ర విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.
రాబిన్ శర్మ పూర్వాశ్రమంలో ప్రశాంత్ కిశోర్ కు సహచరుడే. పీకే ఐ ప్యాక్ టీమ్ లో పనిచేశాడు. గత ఎన్నికల్లో పీకేతో కలిసి వైసీపీ విజయానికి శ్రమించాడు. అయితే పీకే పొలిటికల్ స్ట్రాటజిస్టు వృత్తి నుంచి రాజకీయ అడుగులు వేయడంతో రాబిన్ శర్మ సొంతంగా ఎదగాలని ప్రయత్నించే క్రమంలో టీడీపీకి పనిచేయాలని డిసైడ్ అయ్యాడు. ప్రస్తుతం వైసీపీకి పనిచేస్తున్న రుషిరాజ్ సింగ్ తో కూడా కలిసి పనిచేసిన సందర్భాలున్నాయి. కొద్దిరోజుల నుంచే టీడీపీకి పనిచేస్తున్నరుషిరాజ్ సింగ్ అంతగా కనిపించిన దాఖలాలు లేవు. ఫస్ట్ టైమ్ చంద్రబాబు ఆయన్ను పార్టీ కార్యక్రమానికి ఆహ్వానించడంతో విలువైన సమాచారంతో ఆయన హాజరుకానున్నట్టు తెలుస్తోంది.

అయితే పేరుకే రాబిన్ శర్మ పరిచయమని.. కీలక నేతలకు ఎప్పుడో విషయం తెలుసన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే సమావేశంలో రాబిన్ శర్మ కీలక సూచనలు చేసే అవకాశముంది. ఇప్పటికే విపక్షంలో ఉన్నప్పుడు జగన్ నుంచి వచ్చిన బాదుడే బాదుడు కామెంట్ తో టీడీపీ చేపట్టిన నిరసన కార్యక్రమం సక్సెస్ అయ్యింది. ఇప్పుడు అటువంటి పేర్లతో పార్టీ నిరసన కార్యక్రమాలను రాబిన్ శర్మ వెల్లడించే అవకాశముంది. ఇదేం ఖర్మ, ఇదెక్కడి పాలన తదితర టైటిళ్లతో ప్రభుత్వ ప్రజావ్యతిరేక వైఖరిని బయటపెట్టే కార్యక్రమాలు రాబిన్ శర్మ ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మహిళలు, యువత, విద్యార్థులను ఎలా టార్గెట్ చేసుకోవాలి? లోకేష్ పాదయాత్రలో చేపట్టాల్సిన అంశాలు వంటి వాటిపై రాబిన్ శర్మ స్పష్టత ఇచ్చే అవకాశాలున్నాయి. మొత్తానికైతే చంద్రబాబు అనుభవానికి రాబిన్ శర్మ స్ట్రాటజీ తోడైతే మంచి ఫలితాలు రావడం ఖాయమని తెలుగు తమ్ముళ్లు నమ్మకంతో ఉన్నారు.