Chandra Babu Naidu: ప్రధాని మోదీ… అజేయమైన రాజకీయ శక్తిగా మారిపోయారు. కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ సమ్మోహన శక్తిగా మారిపోయారు. ప్రపంచంలోనే దిగ్గజ నాయకుల్లో ఒకరిగా ఎదిగారు. ఇదంతా స్వల్పకాలంలోనే. భారత రాజకీయాల్లో అడుగుపెట్టిన కొద్దిరోజులకే ప్రధాని పీఠం అందుకున్న అదికొద్దిమంది నాయకుల్లో ఆయనా ఒకరు. అయితే ప్రపంచానికి పరిచయం చేసింది.. భారత ప్రజలకు మరింత సుపరిచితం చేసింది మాత్రం ప్రశాంత్ కిశోర్ అనడం ఎటువంటి అతిశయోక్తి కాదు. 2014 ఎన్నికల్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బీజేపీకి పనిచేశారు. అప్పుడే గుజరాత్ రాష్ట్రాన్ని దాటి ఢిల్లీ రాజకీయల వైపు అడుగుపెట్టిన మోదీ నాయకత్వాన్ని దేశ వ్యాప్తం చేయడానికి పీకే అనేక పన్నాగాలు పన్నారు. అప్పుడే పురుడుబోసుకున్న సోషల్ మీడియాను వేదికగా మలుచుకున్నారు. ఛాయ్ పే చర్చ, ఆప్ కా సాత్..ఆప్ కా లీడర్ వంటి స్లోగన్స్ తో మోదీని జనాలకు దగ్గరగా చేయగలిగారు. ముఖ్యంగా యువతను మోదీ ఆకర్షించడం వెనుక పీకే స్లోగన్స్ విపరీతంగా వర్కవుట్ అయ్యాయి. దాని ఫలితమే 2014 ఎన్నికల్లో ఎన్టీఏ కూటమి విజయం.. ఒక విధంగా చెప్పాలంటే అటు ఎన్నికల వ్యూహకర్తల పీరియడ్ కూడా అప్పుడే స్టార్ట్ అయ్యింది. అటు తరువాతే పీకేకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. పీకేకు వ్యూహకర్తగా ఫెయిల్యూర్స్ ఉన్నా సక్సెస్ లు వాటిని తెరమరుగు చేశాయి. అయితే నాడు పీకే అనుసరించిన వ్యూహాలను మొన్న జగన్ చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు కూడా దానినే అనుసరిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.

బాహుశా 2014తో ప్రధాని మోదీ విజయాన్ని దృష్టిలో పెట్టుకొని పీకే సేవలను వినియోగించుకున్నారు జగన్. 2014 ఎన్నికల్లో తనకు తృటిలో తప్పిన విజయం దక్కాలంటే పీకే తనతో ఉండాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చిన జగన్ ఎలక్షన్ స్ట్రాటజీస్ట్ గా పీకేకు భారీ ఆఫరిచ్చి మరీ తెచ్చుకున్నారు. తాను పాదయాత్ర చేస్తానని పార్టీ శ్రేణులకు చెప్పిన రోజే పీకేను కూడా పార్టీకి పరిచయం చేశారు. అప్పటి నుంచి పీకే చేయని ప్లాన్ లు లేవు. రకరకాలుగా వైసీపీని ఫోకస్ చేసే పనిలో పడ్డారు. అప్పటి ప్రభుత్వంపై వ్యతిరేకత, జగన్ పట్ల సానుకూలత వచ్చేలా సోషల్ మీడియాలో పోస్టింగుల నుంచి సామాజికవర్గాలతో సమావేశాల వరకూ ఒక పద్ధతి ప్రకారం చేశారు. జగన్ తో వ్యూహాత్మక ప్రకటనలు చేయించారు. బైబై బాబు, జాబ్ రావాలంటే జగన్ రావాలి, బాదుడే…బాదుడు వంటి స్లోగన్స్ తో జగన్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేశారు. 2014 ఎన్నికల్లో చిరస్మరణీయ విజయాన్ని అందించారు.

2019 ఎన్నికల్లో జగన్ అనుసరించి వ్యూహాలనే చంద్రబాబు ఫాలో అవుతున్నారు. వినూత్నంగా ప్రజల మధ్యలో నిలుస్తున్నారు. 100 శాతం టీడీపీదే గెలుపు అని పార్టీ శ్రేణుల్లో ధైర్యం నూరిపోస్తున్నారు. గతంలో ఎప్పుడూ టీడీపీ ఎన్నికల వ్యూహకర్తల సేవలను వినియోగించలేదు. కానీ మారిన స్ట్రాటజీతో పీకే టీమ్ లో పనిచేసిన రాబిన్ శర్మను వ్యూహకర్తగా పెట్టుకున్నారు. ఆయన మదిలో నుంచి పురుడుబోసుకున్న బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి బాగానే వర్కవుట్ అయ్యాయి. అటు సోషల్ మీడియా వింగ్ లో సైతం ప్రభుత్వ వ్యతిరేక, చంద్రబాబు అనుకూల పోస్టులు, కామెంట్ల వంటి వాటిని పెట్టిస్తున్నారు. అదే సమయంలో లోకల్ బేస్ ప్రాబ్లమ్స్ ను చంద్రబాబు తో చెప్పిస్తున్నారు. చంద్రబాబు జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడే రాబిన్ శర్మ టీమ్ ఆ ప్రాంతంలో పర్యటిస్తుంది. అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. అందుకు అనుగుణంగానే చంద్రబాబు స్పీచ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రభుత్వంపై పెద్దఎత్తున ప్రజా వ్యతిరేకత ఉందన్న మైండ్ గేమ్ స్టాట్ చేస్తోంది. ఇవన్నీ వర్కవుట్ అవుతాయని.. మరోసారి టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్న నమ్మకంతో చంద్రబాబు పనిచేస్తున్నారు.
