Chandrababu Jail: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఏపీ ఫైబర్ నెట్ కేసులో పిటి వారెంట్ కు కోర్టు అనుమతి ఇచ్చింది. సోమవారం చంద్రబాబును హాజరు పరచాలని ఆదేశించింది. దీంతో గత నెల రోజులుగా జైలు జీవితం గడుపుతున్న చంద్రబాబు సోమవారం బయట ప్రపంచం చూడబోతున్నారు. ఆరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు చంద్రబాబును హాజరపరచాలని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది.
ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు పేరును చేర్చిన సంగతి తెలిసిందే. దీనిపై సిఐడి పిటి వారెంట్ ను ఇచ్చింది. చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లో కోర్టుకు తీసుకురావాలని సిఐడి తరపు న్యాయవాది సుదీర్ఘ వాదనలు వినిపించారు. దీంతో పిటి వారెంట్ కు అనుమతి ఇస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో రేపు సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఒక నిర్ణయానికి రావచ్చని చంద్రబాబు లాయర్లకు ఏసీబీ కోర్టు సూచించింది. ఈ కేసులో సిఐడి తరపు న్యాయవాది వివేకానంద వాదనలు వినిపించారు. మరోవైపు స్కిల్స్ కామ్ లో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 17 కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అటు అంగళ్ల అల్లర్ల కేసులో బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ పూర్తయింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. శుక్రవారం తీర్పును వెల్లడించనుంది.
మరోవైపు చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ 19 వరకు ఉన్న సంగతి తెలిసిందే. అటు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ పై రేపు విచారణ జరగనుంది. తీర్పు వెల్లడి కానుంది. ఇప్పటికే ఈ కేసులో ఇరు వర్గాల వాదనలు పూర్తయ్యాయి. సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో అందరి దృష్టి సుప్రీంకోర్టు వైపే ఉంది. ఈ క్రమంలో సోమవారం చంద్రబాబును ఏసీబీ కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు పరచాలని ఏసీబీ కోర్టు ఆదేశించడం విశేషం. దీంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడకు తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అయితే రేపు సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి పరిణామాలు మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.