Chandrababu: చంద్రబాబు చతురత గురించి ఎంత చెప్పినా తక్కువే. చివరి వరకు పోరాటం చేయగల నైజం ఆయన సొంతం. ఎదురుగా ప్రతికూల ఫలితాలు వస్తున్నా.. ఎక్కడా వెనక్కి తగ్గరు. విజయం దక్కే వరకు అదే పోరాట పంధాను కొనసాగిస్తారు.అయితే ఆయన ప్రయత్నాలు కొన్నిసార్లు ఫలించాయి.. మరి కొన్నిసార్లు వికటించాయి. కానీ వ్యూహం అమలు చేయడం మాత్రం చంద్రబాబుకు మించిన వారు ఉండరు. గత ఎన్నికల్లో ఓటమి ఎదురైన తర్వాత.. అసలు తెలుగుదేశం పార్టీ ఉంటుందా? లేదా? అన్న ప్రశ్న ఎదురయ్యింది. కానీ మళ్లీ బలం కూడా తీసుకుని.. పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకువచ్చిన ఘనత మాత్రం చంద్రబాబుదే.
బిజెపిని దారిలో తెచ్చుకునేందుకు ఏకంగా నలుగురు రాజ్యసభ సభ్యులను ఆ పార్టీలోకి పంపించారు. మీడియాను తన చెప్పు చేతల్లో పెట్టుకున్నారు. జనసేనతో పొత్తును ముందే ప్రకటించారు. గత నాలుగు సంవత్సరాలుగా బిజెపికి స్నేహ హస్తం అందిస్తూనే ఉన్నారు. బిజెపి తన రూట్లోకి వచ్చేందుకు అస్మదీయులతో చేయని ప్రయత్నం అంటూ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ చిన్న అవకాశాన్ని కూడా ఆయన జారవిడుచుకునే స్టేజ్ లో లేరు. అవసరమైతే కాంగ్రెస్ కు స్నేహ హస్తం అందించగలరు. వామపక్షాలను సైతం కలుపుకొని వెళ్లగలరు. ఇలా అన్ని ఆప్షన్లను తన వద్ద ఉంచుకొని రాజకీయం చేయడం ఒక్క చంద్రబాబుకే సొంతం.
జనసేనతో తెలుగుదేశం పొత్తు విచ్చిన్నానికి జరగని ప్రయత్నం అంటూ లేదు. దానిని పవన్ ద్వారా చెక్ చెప్పగలిగారు. జనసైనికులను నియంత్రణలోకి తేగలిగారు. పవన్ మేనియా పెరగకుండా లోకేష్ ద్వారా కొన్ని విషయాలను చెప్పించగలిగారు. బిజెపి సైతం ఈ పొత్తు లోకి వచ్చేందుకు తన అస్మదీయులను కీలక బాధ్యతలు అప్పగించారు. అటు కాంగ్రెస్ పార్టీని తన చెప్పు చేతల్లోకి తెచ్చుకోగలిగారు. షర్మిలకు నాయకత్వ బాధ్యతలు అప్పగించి.. జగన్ కు చికాకు పెట్టే స్కెచ్ వేశారు. అటు వామపక్షాలు సైతం తన రూట్లో ఉండేలా చేసుకున్నారు. ఏకకాలంలో అటు బిజెపి, ఇటు కాంగ్రెస్, ఇంకోవైపు వామపక్షాలతో స్నేహం కొనసాగించగల నేర్పరి చంద్రబాబు. జనసేనతో శాశ్వత బంధం ఏర్పరచుకొని.. అవసరాలకు తగ్గట్టు ఇతర పార్టీలను వాడుకొని.. మీడియా సపోర్ట్ దక్కించుకొని.. చంద్రబాబు వేసిన స్కెచ్ మామూలుగా లేదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అయితే ఎన్నికల్లో విజయం దక్కితేనే ఈ స్కెచ్ కు సార్ధకత వస్తుంది. లేకుంటే మాత్రం విఫల ప్రయత్నంగా మిగల నుంది.