
సీఎం జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఫార్ములానే అనుసరిస్తున్నారు. ఆయన బాటలోనే పయనిస్తున్నారు. శాసన మండలి చైర్మన్,డిప్యూటీ చైర్మన్ పదవుల భర్తీలో బాబు నడిచిన మార్గంలోనే వెళుతున్నారు. ఇప్పటి వరకు చైర్మన్ గా ఉన్న మహ్మద్ షరీఫ్ ఇటీవల మండలి నుంచి రిటైర్ అయ్యారు. డిప్యూటీ చైర్మన్ గా ఉన్న రెడ్డి సుబ్రహ్మణ్యం ఈనెల 18న రిటైర్ అవుతున్నారు.
దీంతో ఈరెండు పదవులు భర్తీ చేయాల్సిన అవసరం ఏర్పడింది. గతంలో చంద్రబాబు ఈ రెండు పదవుల విషయంలో ఒక పద్ధతి పాటించారు. చైర్మన్ పదవి మైనార్టీలకు, డిప్యూటీ చైర్మన్ పదవి బీసీ లేదా ఓసీకి కేటాయించాలని నిర్ణయించారు. దీంతో బాబు చూపిన మార్గంలోనే జగన్ సైతం నడిచేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం.
టీడీపీకి విధేయుడిగా ఉన్న షరీఫ్ ను మండలి చైర్మన్ గా రెడ్డి సుబ్రహ్మణ్యంను డిప్యూటీ చైర్మన్ గా నియమించారు. మైనార్టీలకు ప్రాధాన్యం ఇవ్వడంతో చంద్రబాబుకు మంచి పేరు వచ్చింది. దీంతో వారి ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకున్నారు. ప్రస్తుతం జగన్ కూడా అదే బాటలో నడవనున్నారు. మైనార్టీలకే చైర్మన్ పదవి ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించారు.
గతంలో హిందూపురం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ఇక్బాల్ ను చైర్మన్ చేసేందుకు రెడీ అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. డిప్యూటీ చైర్మన్ గా గుంటూరు జిల్లాకు చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత,మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న జంగ కృష్ణమూర్తి పేరు వినిపిస్తోంది. నిజానికి వీరిద్దరికి పార్టీలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకపోవడం గమనార్హం. మొత్తానికి అధికారిక ప్రకటన రాకపోయినా జగన్ నిర్ణయం మాత్రం దాదాపు ఖరారు అంటున్నారు నేతలు.