
Chandrababu- KCR: రాజకీయంగా చంద్రబాబు, కేసీఆర్ ల మధ్య వైరం గురించి అందరికీ తెలిసిందే. చంద్రబాబు మాట వింటేనే కేసీఆర్ అంతెత్తున ఎగసిపడతారు. కేసీఆర్ చర్యలను చంద్రబాబు తప్పుపడతారు. మధ్యలో ఒకసారి మహా కూటమి రూపంలో ఇద్దరూ కలిసినా.. వారి మధ్య వైరం మాత్రం తగ్గలేదు. రాష్ట్ర విభజనతో తెలంగాణలో కేసీఆర్, ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రాగలిగారు. కానీ ఒకరినొకరు దెబ్బతీసుకోవాలని ప్రయత్నించారు. అయితే దానికి చంద్రబాబు మూల్యం సాధించుకున్నారు. కేసీఆర్ రెండోసారి పవర్ లోకి వచ్చి పైచేయి సాధించారు. దీంతో చంద్రబాబుకు తత్వం బోధపడింది. అందుకే కేసీఆర్ విషయంలో పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు. చివరకు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చినా ఆహ్వానించలేదు.. అలాగని వ్యతిరేకించలేదు. అటువంటిది తాజాగా కేసీఆర్ ప్రస్తావనను తీసుకొస్తూ చంద్రబాబు అభినందించడం హాట్ టాపిక్ గా మారింది.
చంద్రబాబు ‘కీ’లక ప్రసంగం..
హైదరాబాద్ లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. పార్టీ శ్రేణులకు కీలక సందేశం ఇచ్చారు. మరోసారి టీడీపీ అధికారంలోకి రావాలని.. ఇది చారిత్రక అవసరమని, కచ్చితంగా వస్తామని ధీమా వ్యక్తం చేసారు. రాష్ట్ర విభజన కంటే సీఎం జగన్ వల్లే ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని గుర్తుచేశారు. ఇది మామూలు నష్టం కాదని.. అభివృద్ధి 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పారు. పార్టీకి తెలంగాణలోనూ పూర్వవైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. పీవీ నరసింహరావు స్పూర్తితోనే ఉమ్మడి ఏపీలో సంస్కరణలను ధైర్యంగా అమలుచేయగలిగానని చెప్పారు. ఉమ్మడి ఏపీలో హైటెక్ సిటీతో అభివృద్ధిని ప్రారంభించుకున్నామని చంద్రబాబు గుర్తుచేశారు. సెల్‌ఫోన్, గ్రీన్‌ఫీల్డ్, ఎయిర్‌పోర్టులు, ఓపెన్ స్కై పాలసీ విధానాలతో మొదటిసారిగా విమానాలను తీసుకొచ్చామన్నారు. అభివృద్ధి కోసం విజన్-2020ను ప్రకటిస్తే.. నన్ను 420 అన్నారని..వారంతా ఇప్పుడు ఎక్కడికి పోయారో తెలుసునన్నారు. ఒక్క ఏపీ సీఎం జగన్ తప్ప.. తన తరువాత వచ్చిన సీఎంలు అభివృద్ధిని కొనసాగించారని అన్నారు.

జగన్ ను ఫెయిల్యూర్ నాయకుడిగా చూపించి..
అయితే తొలిసారిగా చంద్రబాబు కేసీఆర్ ను అభినందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలుగు ప్రజల్లో ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు ప్రయత్నిస్తానని చెప్పిన చంద్రబాబు..ఇందుకు త్వరలోనే ఒక విధానాన్ని ప్రకటిస్తానని ప్రకటించారు. హైటెక్ సిటీ, ఔటర్ రింగు రోడ్డు ప్రాజెక్టులను తన తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రద్దు చేసి ఉంటే ఈ రోజు ఇంత అభివృద్ధి జరిగేదా? అని ప్రశ్నించారు.అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించిన వైఎస్, రోశయ్యతోపాటు కేసీఆర్‌ను అభినందించారు. అయితే చంద్రబాబు వ్యూహాత్మకంగా ఈ ప్రకటనలు చేశారు. ఏపీ సీఎం జగన్ పై ప్రజల్లో నెగిటివ్ ఫీలింగ్ కలిగేలా వ్యాఖ్యలు చేశారు. జగన్ ను ఒక ఫెయిల్యూర్ నాయకుడిగా చూపించేందుకే చంద్రబాబు ప్రయారిటీ ఇచ్చారని.. అందులో భాగంగానే రాజకీయ విరోధి అయిన కేసీఆర్ ను అభినందించాల్సి వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వ్యూహాత్మక ఎత్తుగడ..
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభ హైదరాబాద్ లో ఏర్పాటుచేయడం వెనుక చంద్రబాబు వ్యూహాత్మక ఎత్తుగడ కనిపిస్తోంది. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో అక్కడి టీడీపీ శ్రేణులు యాక్టివయ్యాయి. తెలంగాణలో పార్టీ శ్రేణులను యాక్టివ్ చేసి ఎన్నికలకు సిద్ధం చేయాలని భావిస్తున్నారు. ఏపీ కంటే ముందుగా వచ్చే తెలంగాణ ఎన్నికల్లో ఉనికి చాటుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల నాటికి బీజేపీ నుంచి పిలుపు వస్తుందని.. అదే జరిగితే ఏపీలో పొత్తులకు లైన్ క్లీయర్ అవుతుందని భావిస్తున్నారు. తెలంగాణలో వరుస సమావేశాలు నిర్వహించి..,. పాత నాయకులను టీడీపీలో చేర్పించాలని భావిస్తున్నారు. మొత్తానికైతే తెలంగాణ విషయంలో చంద్రబాబు గట్టి ఆలోచనతో ఉన్నారు. రాజకీయ బద్ధ విరోధి అయిన కేసీఆర్ ను అభినందించడం ద్వారా కొత్త చర్చలకు, సమీకరణలకు చంద్రబాబు కారణమవుతున్నారు.