Chandrababu- Ashok Gajapathi Raju: టిడిపిలో అశోక్ గజపతిరాజు పరపతి తగ్గిందా? చంద్రబాబు ఆయన్ని సైడ్ చేస్తున్నారా? దీంతో రాజుగారు అసహనానికి గురవుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తనకు ఎంపీ, కుమార్తెకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని అశోక్ విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే దీనిపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఒక్కరికే టిక్కెట్ అని కరాకండి గా తేల్చి చెప్పినట్లు సమాచారం.
2019 ఎన్నికల్లో విజయనగరం పార్లమెంటు స్థానానికి అశోక్ గజపతిరాజు, అసెంబ్లీ స్థానానికి కుమార్తె అతిథి గజపతిరాజు పోటీ చేశారు. ఇద్దరూ ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో అదే మాదిరిగా పోటీ చేయాలని అశోక్ భావిస్తున్నారు. కుమార్తె అతిథిని ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని బలంగా భావిస్తున్నారు. అయితే అందుకు చంద్రబాబు ఒప్పుకోవడం లేదు. విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి అశోక్ ను బరిలో దించాలని చూస్తున్నారు. పార్లమెంట్ స్థానాన్ని తూర్పు కాపు సామాజిక వర్గానికి కేటాయించాలన్నదే బాబు భావన. వాస్తవానికి గత ఎన్నికల్లో విజయనగరం పార్లమెంటు స్థానాన్ని తూర్పు కాపులకు కేటాయించి ఉంటే విజయం సునాయాసంగా దక్కి ఉండేది అన్నది చంద్రబాబు భావన. ఇప్పుడు మరోసారి ఆ తప్పు చేయనని చంద్రబాబు భావిస్తున్నారు.
విజయనగరం శాసనసభ స్థానం నుంచి కోలగట్ల వీరభద్ర స్వామి బలమైన అభ్యర్థిగా ఉన్నారు. ఆయన ఢీకొట్టాలంటే అశోక్ కరెక్ట్ అభ్యర్థని చంద్రబాబు భావిస్తున్నారు. విజయనగరం పార్లమెంట్ స్థానం నుంచి అవసరమైతే మాజీ మంత్రి కళా వెంకట్రావు కానీ.. అర్థ బలం అంగ బలం ఉన్న తూర్పు కాపు సామాజిక వర్గ నేతను పోటీలో పెట్టాలని బాబు చూస్తున్నారు. కానీ అశోక్ గజపతిరాజు మాత్రం తనకు ఎంపీ పదవి పైన ఆశ ఉందని అనుచరుల వద్ద చెబుతున్నారు. కనీసం అధినేత తన గోడును పరిగణలోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయోనని టిడిపి శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.