
ఎల్జీ పాలిమర్స్‌కు వైకాపా ప్రభుత్వం ఒక్క అనుమతి కూడా ఇవ్వలేదనడం అవాస్తవమని చంద్రబాబు ఆరోపించారు. తప్పుడు ప్రచారంతో రాజకీయ లాభం పొందాలని చూడటం హేయంగా అభివర్ణించారు. జగన్ చేసిన ఆరోపణలను ఖండిస్తూ వాస్తవాలను ప్రజల ముందుంచుతున్నామని తెలిపారు. తెదేపా హయాంలో ఎకరం భూమి కూడా ఎల్‌జీ పాలిమర్స్‌కు కేటాయించలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. మేం సమర్పించిన వివరాలపై చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. 1961 నుంచి 2020 వరకు ఈ కంపెనీ పూర్వాపరాలను ప్రజల దృష్టికి తెస్తున్నామని వివరాలను చంద్రబాబు వెల్లడించారు.
ఎల్జీ పాలిమర్స్ కంపెనీ వినియోగిస్తున్న 219ఎకరాల భూమిని 1964 నవంబర్ 23వ తేదీన అప్పటి ప్రభుత్వం ఎకరం రూ. 2,500 చొప్పున కేటాయించిందని తెలిపారు. ( జివో నెం 217). ఆ తర్వాత అర్బన్ ల్యాండ్ సీలింగ్ మినహాయింపులను 1992 అక్టోబర్ 1వ తేదీన అప్పటి ప్రభుత్వం (జీవో నెం 1033)ఇచ్చిందన్నారు. టిడిపి హయాంలో ఒక్క ఎకరం భూమి కూడా ఎల్జీ పాలిమర్స్ కు కేటాయించలేదని చెప్పారు. భూముల కేటాయింపుపై వైసిపి చేస్తున్న దుష్ప్రచారం దీనిని బట్టే తెలుస్తోందన్నారు.
అదేవిధంగా 2007 మే 8వ తేదీన వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పొల్యూషన్ కంట్రోల్ క్లియరెన్స్ ఇచ్చిందని, 2009 సెప్టెంబర్ 1వ తేదీన మరోసారి రాజశేఖర రెడ్డి ప్రభుత్వమే పొల్యూషన్ కంట్రోల్ క్లియరెన్స్ ఇచ్చిందన్నారు. ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం 2012 ఏప్రిల్ 13వ తేదీన, అదేవిధంగా 2012 మే 6వ తేదీన క్లియరెన్స్ ఇచ్చిందన్నారు. అంటే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రెండు సార్లు, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం రెండు సార్లు పొల్యూషన్ కంట్రోల్ క్లియరెన్స్ లు ఇచ్చాయని చెప్పారు. టిడిపి ప్రభుత్వం గత ప్రభుత్వాల పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికెట్లను రెన్యువల్ చేసిందే తప్ప కొత్తగా అనుమతి ఇవ్వలేదు. పైగా పాలిస్టైరీన్ ఉత్పత్తులకు, ఎక్స్ పాండబుల్ పాలిస్టైరీన్ ఉత్పత్తుల విస్తరణకు అనుమతి నిరాకరించిందని, కంపెనీకి ఎప్పుడెప్పుడు ఏయే ప్రభుత్వాలు ఎలాంటి అనుమతులు ఇచ్చాయో మావద్ద ఉన్నాయని చెప్పారు. వీటిపై చర్చకు సిద్దమా అని ఛాలెంజ్ చేస్తున్నామని తెలిపారు.
టీడీపీ హయాంలో పరిశ్రమ విస్తరణకు అనుమతి నిరాకరించిందన్నారు. 2018 జూన్ 20వ తేదీన, డిసెంబర్ 27వ తేదీన టిడిపి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు వైసిపి నాయకులు, దొంగ సాక్షి చేస్తున్న ప్రచారం వాస్తవాలు వక్రీకరించడమేనని అన్నారు. ఎల్జీ పాలిమర్స్ కేటగిరి మార్పు వెనుక హస్తం వైసిపి ది కాదా అని ప్రశ్నించారు. ఈ కంపెనీ స్టైరీన్ ఉత్పత్తుల విస్తరణకు అనుమతి ఇచ్చింది, 2019 జులై 9న కేంద్రానికి సిఫారసు చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. (ఏపి స్టేట్ లెవెల్ ఎన్విరాన్ మెంట్ ఇంపాక్ట్ అసెస్ మెంట్ అథారిటి పంపిన సిఫారసు ఇదిగో) విశాఖలో జరిగిన దుర్ఘటనపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హుటాహుటిన స్పందించి రూ.50కోట్ల డిపాజిట్ చేయాలని కంపెనీని ఆదేశించిందని, దీనిపై స్టే కోసం ఎల్జీ పాలిమర్స్ సుప్రీంకోర్టుకు వెళ్లడం వెనుక హస్తం వైసిపిదేనన్నారు.