టీడీపీ అధినేత చంద్రబాబును వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేటాడుతున్నారు. జగన్ సైతం బాబును పట్టించుకోకుండా వదిలేసిన వేళ.. అందరూ మరిచిపోయినా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి మాత్రం పోరాడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి తాజాగా షాకిచ్చారు.
Also Read: అమ్మవారికే శఠగోపం పెట్టారు..
2017లోనే వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి టీడీపీ అధినేత ‘ఓటుకు నోటు’ విషయంలో సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు. అయితే ఆనాడు సుప్రీం కోర్టులో ఈ కేసు లిస్టింగ్ కాకపోవడంతో మరోసారి గత సంవత్సరం నవంబర్ లో పిటీషన్ దాఖలు చేశాడు.
2014 సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు డబ్బులు ఎరచూపి అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రలోభపెట్టాడు. ఇది వీడియోలకు చిక్కింది. ఈ వ్యవహారం అంతా నడిపించింది చంద్రబాబేనన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ సమయంలోనే తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యవహారంలో కొన్ని ఫోన్ ట్యాపింగ్ సంభాషణలు విడుదల చేసింది. ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఆనాడు ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు వాయిస్ కూడా వినిపించింది. దీనిపై చంద్రబాబుకు పోలీసులు నోటీసులు కూడా పంపారు.
ఆ కేసు తర్వాత కాలంలో స్తబ్దుగా మారిపోయింది. ఈ కేసు విషయంలో దొరికిన చంద్రబాబును ఇరుకునపెట్టాలని 2017లో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటీషన్ తాజాగా ఈరోజు విచారణకు వచ్చింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరు పలుమార్లు ప్రస్తావనకు వచ్చినప్పటికీ నిందితుడిగా చేర్చలేదని.. ఆయన్ను కనీసం ప్రశ్నించలేదని ఎమ్మెల్యే ఆర్కే తరుఫున సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ఈ వాదనతో సుప్రీం ధర్మాసనం ఏకీభవించింది.
Also Read: చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు.. కాలినడకన పయనం.. ఉద్రిక్తత
ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటీషన్ పై సంచలన నిర్ణయం తీసుకుంది.. చంద్రబాబు పేరును ఓటుకు నోటు కేసులో చేర్చాలని.. ఆయన పాత్రను తేల్చేందుకు విచారణ జరిపించాలని నిర్ణయించింది. అయితే విచారణను మాత్రం వచ్చే ఏడాది జూలైకి వాయిదా వేసింది.
ఈరోజు నుంచే ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డి సన్నిహితుడు ఉదయసింహను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టులో చంద్రబాబును విచారించాలన్న పిటీషన్ విచారణకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఢిల్లీ వెళ్లిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకోవడంతో చంద్రబాబు చాప్టర్ క్లోజ్ అవ్వబోతోందని.. ఆయన ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోతున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్