
Chandrababu Birthday: చంద్రబాబునాయుడు…దేశంలో పరిచయం అక్కర్లేని పేరు. ఏపీ అంటేనే ఇతర రాష్ట్రాల ప్రజలు చటుక్కున గుర్తుచేసేది చంద్రబాబునే. ఇతర రాష్ట్రాల్లో సైతం ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. అయితే చంద్రబాబు రాజకీయ ప్రస్థానం పూలపాన్పు కాదు. సవాళ్లు, సంక్షోభాలను అధిగమించి ఈ స్థాయికి వచ్చారు. విద్యార్థి నాయకుడిగా కెరీర్ ప్రారంభించి ఉమ్మడి ఏపీకి ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా..అవశేష ఏపీకి తొలి సీఎంగా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. తన రాజకీయ కెరీర్ లో ఎన్నో ఎత్తూ పల్లాలను చవిచూశారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. పడిలేచారు.. కలబడ్డారు..నిలబడ్డారు. ఇప్పటికీ అదే పరంపర కొనసాగిస్తున్నారు. చంద్రబాబు 74వ పడిలో అడుగుపెట్టారు. గురువారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ స్టోరీ
కాంగ్రెస్ తో ప్రస్థానం ప్రారంభం..
చంద్రబాబు రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్‌తోనే మొదలైంది. 1978లో ఆయన కాంగ్రెస్ టికెట్‌పైనే తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1980లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగానూ చేశారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా పదవి చేపట్టారు. తెలుగువారి ఆత్మగౌరవం’ నినాదంతో 1982లో ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించి కాంగ్రెస్ మీద ఘన విజయం సాధించారు. ఆ సమయంలో చంద్రబాబు కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి ఓటమిని చవిచూశారు.ఆ తరువాత టీడీపీలో చేరి క్రమంగా శక్తిమంతమైన నేతగా ఎదిగారు. అయితే ఈ క్రమంలో చంద్రబాబు ఎదుర్కొన్న సవాళ్లు, సంక్షోభాలు ఎన్నో ఉన్నాయి. జయాపజయాలు కూడా ఉన్నాయి.
పదవుల కంటే పార్టీపై ఫోకస్..
తెలుగుదేశం పార్టీలో చేరిన నాటి నుంచి చంద్రబాబు సరికొత్త స్ట్రాటజీతో ముందుకెళ్లారు. ప్రభుత్వ పదవుల కంటే పార్టీ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టారు. అసలు 1994 వరకూ ఆయన మంత్రి పదవి సైతం చేపట్టలేదు. కేవలం పార్టీ సంస్థాగత నిర్మాణంపైనే ఎక్కువ దృష్టిసారించారు. పార్టీలో కీలక నాయకుల నుంచి కింది స్థాయి కేడర్ వరకూ సత్సంబంధాలు నడిపారు. 1995లో టీడీపీ సంక్షోభంలో మెజార్టీ కేడర్ చంద్రబాబు వైపు ఉండడానికి అదే కారణం. పార్టీ అనుబంధ విభాగాలన్నీ చంద్రబాబు కనుసన్నల్లోనే ఉండేవి. అటు ఎన్టీఆర్ కుటుంబం సైతం అండగా నిలవడంతో.. నాడు ఎన్టీఆర్ ను పదవీవిచ్యుతుడ్ని చేసి అధికారాన్ని హస్తగతం చేసుకోగలిగారు. 1999 ఎన్నికల్లో సైతం ప్రజల ఆశీర్వాదం పొందగలిగారు.
దేశ రాజకీయాల్లో ముద్ర…
దేశ రాజకీయాల్లో టీడీపీ ముద్ర చాటింది కూడా చంద్రబాబే. ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ రూపకల్పన వెనుక చంద్రబాబు కృషి ఉంది. 1984లో చంద్రబాబుకు తన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం వచ్చింది. నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఆదేశానుసారం గవర్నర్ రామ్ లాల్ ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసినప్పుడు, ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు జరిగిన ఆందోళనల్లో చంద్రబాబు క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌కు నీడలా ఉన్న చంద్రబాబు, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను కూడగట్టడంలో తోడ్పాటునందించారు. ఆ ప్రయత్నమే 1989లో నేషనల్ ఫ్రంట్‌గా రూపం దాల్చింది.
ధ్యైర్యంతో ముందడుగు..
2004 ఎన్నికల్లో ఓటమి తరువాత టీడీపీ కుదేలైంది. వరుసగా రెండు ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. దీంతో టీడీపీ పని అయిపోయిందని విశ్లేషణలు వెలువడ్డాయి. కానీ మొక్కవోని ధైర్యంతో చంద్రబాబు అడుగులు వేశారు. ఒక వైపు నాయకులు చేజారిపోతున్నా.. ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తయారుచేసుకొని గట్టిగానే పోరాడారు. 2014 ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురాగలిగారు. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత కూడా టీడీపీ ఫినిష్ అన్న కామెంట్స్ వినిపించాయి. అటు తరువాత వచ్చిన అన్ని ఎన్నికల్లో టీడీపీ ఓటమి శ్రేణులను నైరాశ్యంలోకి నెట్టింది. ఇక కష్టమన్న ప్రచారం ఊపందుకుంది. కానీ ధైర్యంతో చంద్రబాబు పోరాడుతున్నారు. శ్రేణులను తట్టిలేపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం కోసం అహర్నిషలు శ్రమిస్తున్నారు.

అది మాయని మచ్చ…
అయితే చంద్రబాబు పొలిటికల్ కెరీర్ కు మాయని మచ్చగా 1995 ఎపిసోడ్ నిలిచింది. ఎన్టీఆర్‌ను దింపేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కొందరు దాన్ని ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా జరిగిన కుట్ర అంటారు. మరికొందరు పార్టీని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నంగా అభివర్ణించుకుంటారు. ఏమైనా ఎన్టీఆర్ తన చివరి రోజుల్లో చంద్రబాబును ‘జామాతా దశమ గ్రహం’ అని విమర్శించారు. ఆయన్ను చేరదీసి తప్పుచేశానని వాపోయారు. అయితే దీనిపై చంద్రబాబు ఎన్నిరకాలుగా వివరణ ఇచ్చుకున్నా ఫలితం లేకపోతోంది. ఆ అపవాదు కొనసాగుతోంది.