ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటన్నది అందరికీ తెలిసిందే. కానీ.. ఉన్నట్టుండి అంతలా దిగజారిపోవడానికి మాత్రం విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రెండేళ్ల ముందు వరకు అధికారంలో ఉన్న పార్టీ.. ఇప్పుడు మనుగడ కోసం ఇబ్బందులు పడే పార్టీగా తయారైంది. ఇక, వచ్చే 2024 ఎన్నికల్లో గనక ఓటమిపాలైతే పరిస్థితులు ఇంకెంత దిగజారిపోతాయో ఊహించలేకుండా ఉంది. అందుకే.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఇందుకోసం.. ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు.
లాభనష్టాను బేరీజు వేసుకుంటూ సైకిల్ రిపేర్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా.. ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా బాబు చర్యలను చూస్తే అర్థమవుతోంది. పార్టీలో పేరు గొప్ప ఊరు దిబ్బలా ఉన్న సీనియర్ నాయకత్వాన్ని పక్కన పెట్టాలనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్టు స్పష్టమవుతోంది. అదే సమయంలో ఆర్థికంగా బలవంతులను సైతం ఏరికోరి సెలక్ట్ చేసుకుంటున్నారని వినికిడి. ప్రస్తుతం వైసీపీతో కంపేర్ చేసుకున్నప్పుడు దూకుడైన నేతలతోపాటు ఆర్థికంగానూ టీడీపీ సమఉజ్జీగా లేదు. వచ్చే ఎన్నికల నాటికి ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేసి.. సైకిల్ ను రేసులో నిలపాలని భావిస్తున్నారు.
ఇక, ఇతర సామాజిక వర్గాలను సైతం తన వైపు మళ్లించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో వైసీపీ స్పష్టమైన ఆధిక్యాన్ని చూపిస్తుండడం గమనర్హం. 2014 ఎన్నికల్లోనూ, 2019 ఎన్నికల్లోనూ మెజారిటీ ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలను జగన్ సొంతం చేసుకున్నారు. దీంతో.. ఈ నియోజకవర్గాలను కూడా పరిగణనలోకి తీసుకొని, వాటిని కూడా యువకుల చేతుల్లో పెట్టాలని చూస్తున్నారట. సీనియర్ నాయకులు పేరుకు కనిపిస్తున్నారే తప్ప.. వారు పెద్దగా యాక్టివ్ అయ్యే పరిస్థితి లేదని, వైసీపీ నేతలతో ఢీకొనలేకపోతున్నారని భావిస్తున్నారట బాబు.
అందుకే.. యువ నేతలను తెరపైకి తెస్తున్నారు. యర్రగొండపాలెం ఇన్ ఛార్జ్ గా ఎరిక్సన్ బాబును నియమించడమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. నిజానికి ఆయనది కనిగిరి నియోజకవర్గం. యర్రగొండపాలెంలో ఉన్న సీనియర్లను, ఆశావహులను కాదని ఎరిక్సన్ కు బాధ్యతలు అప్పగించారు. ఇదేవిధంగా తిరువూరులోనూ ఎన్నారై దేవదత్ ను నియమించారు. సీనియర్ నేత స్వామిదాస్ ను కాదని మరీ.. దేవదత్ కు స్టీరింగ్ ఇచ్చారు. మిగిలిన ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లోనూ యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని, వారైతేనే వైసీపీని సమర్థంగా ఎదుర్కోగలరని భావిస్తున్నారట. మరి, చంద్రబాబు వేస్తున్న ఈ కొత్త మంత్రం ఏ మేరకు సక్సెస్ అవుతుందన్నది చూడాలి.