నిన్నటి తోటి నాలుగురోజుల డెమోక్రాట్ల సదస్సు ముగిసింది. వచ్చేవారం రిపబ్లికన్ల సదస్సు జరగబోతుంది. వీటితో నవంబర్ మూడువరకు అమెరికా మొత్తం ఎన్నికల కోలాహలం లో మునిగి తేలుతుంది . కరోనా మహమ్మారి నేపధ్యం లో సహజంగా వుండే డెలిగేట్ల చప్పట్లు, అభిప్రాయ ప్రకటనలు, టివీల కోలాహలం లేదు. అందరూ దృశ్య మాధ్యమం ద్వారానే మాట్లాడారు. నాయకులకు డెలిగేట్ల కేరింతలతో వచ్చే పూనకం ఈసారి ఈ నాలుగురోజుల సదస్సులో చూడలేకపోయాము. అయినా ముఖ్యమైన నాయకులందరూ దృశ్య మాధ్యమం ద్వారా వారి గొంతుకను ప్రజల దగ్గరకి తీసుకెళ్ళటానికి ప్రయత్నించారు. ఇలా నాలుగు రోజుల సదస్సును ప్రత్యక్షంగా వీక్షించటం నాకు ఇదే ప్రధమం. అంతకుముందు కేవలం ముఖ్యమైన నాయకుల ఉపన్యాసాలే వినే వాళ్ళం. అమెరికాలో ఉండటంతో నాలాంటి రాజకీయ ఆసక్తిపరులకు మంచి పండగనే చెప్పాలి.
Also Read : వామ్మో.. సింహాల మలానికి ఇంత డిమాండా?
సదస్సు ప్రధాన ఫోకస్ దేనిపైన?
ఈసారి సదస్సు లో మాట్లాడిన నాయకులందరూ వచ్చే నాలుగు సంవత్సరాల్లో అధికారం లోకి వస్తే ఏం చేయాలనుకుంటున్నారో చెప్పేదానికన్నా ట్రంప్ మీద విమర్శకే సమయం కేటాయించారు. అది చూసిన తర్వాత ఇక్కడా మనలాగే రాజకీయాలు నడుస్తున్నాయా అని ఆలోచించాను. మన దగ్గర కూడా 2014, 2019 ల్లో ఇదే జరిగింది. యుపిఏ, వామపక్షాలు వాళ్ళేమి చేయాలనుకుంటున్నారో చెప్పేబదులు మోడీ ని బూచిగా చూపించటం పైనే కేంద్రీకరించారు. అయితే ఒక తేడా వుంది. మోడీ ఎప్పుడూ పత్రికా సమావేశాలు నిర్వహించి తన అభిప్రాయాలు చెప్పేవాడుకాదు. చెప్పాలనుకున్నది ప్రత్యక్షంగా బహిరంగ సమావేశాల్లో ప్రజలకే వివరించేవాడు. కానీ ట్రంప్ అలా కాదు ప్రతిరోజూ పత్రికా సమావేశం నిర్వహిస్తుంటాడు. కాకపోతే తన నోరే తన శత్రువు . దానివలనే సభ్య సమాజం లో ఎంతోమందిని దూరం చేసుకున్నాడు. మహిళల్లో ఎక్కువమంది తనంటే కోపగించుకోవటానికి తన మాటలు , తన ప్రవర్తనే కారణం. ఈ విషయం లో మోడీ కి ట్రంప్ కి పోలికే లేదు. మోడీ కి బలం క్యారక్టర్ అయితే ట్రంప్ కి బలహీనత అదే. కాకపోతే పోలికల్లా బలమైన నాయకుడుగా వున్నప్పుడు మిగతా వాళ్ళందరూ ఒకటవుతారనే వరకే. ఇందిరా గాంధీ విషయం లోనూ ఇదే జరిగింది. ఇక అసలు విషయానికొద్దాం.
సదస్సులో ప్రధానంగా విధానాల పైన చర్చ కన్నా జో బైడెన్ వ్యక్తిత్వం పైనే ఫోకస్ పెట్టటం జరిగింది. కుటుంబం లో భార్యని, కొడుకిని పోగొట్టుకున్న జో బైడెన్ కి కరోనా మహమ్మారి లో చనిపోయిన వ్యక్తుల కుటుంబం లో మనోవేదన ఎలా వుంటుందో అందరికన్నా ఎక్కువగా అర్ధమవుతుందనే విషయం పైనే ఫోకస్ చేశారు. అధ్యక్ష పదవి కి గౌరవం తీసుకురావటానికి జో తగిన అర్హుడని చెప్పటం జరిగింది. అంటే ఇప్పుడున్న అధ్యక్షుడి వలన ఆ గౌరవం పడిపోయిందని పరోక్షంగా, ప్రత్యక్షంగా కూడా చెప్పటం జరిగింది. అధ్యక్ష పదవి లో వుండే వ్యక్తికి క్యారక్టర్ చాలా ముఖ్యమని నొక్కి వక్కాణించారు. అవి ట్రంప్ కి లేవనీ చెప్పటం జరిగింది. ద్వేష భావాల్ని రెచ్చగొట్టటం కాదు అందరినీ కలుపు కెళ్ళటం చాలా అవసరమని ఆ పని ట్రంప్ చేయలేదనీ జో అయితే ఖచ్చితంగా చేస్తాడని చెప్పటం జరిగింది. జో బైడెన్ అయితే ఈ ఎన్నికలు అమెరికా దేశపు ఆత్మ కోసం ( Soul of the Nation) జరుగుతున్నాయని ఉద్ఘాటించాడు. ఒబామా ఇంకో అడుగు ముందుకేసి ప్రజాస్వామ్యం, రాజ్యాంగ స్ఫూర్తి పరిరక్షించబడాలంటే ట్రంప్ ఓటమి అవసరమని చెప్పాడు. మొత్తం మీద ఈ సదస్సు మొత్తం ట్రంప్ కొనసాగితే సమాజానికి, అమెరికా విలువలకి ఎంత ప్రమాదమో అనే థీం మీదే నడిచినాయనే చెప్పొచ్చు. అందులో భాగంగానే జో బైడెన్ వ్యక్తిత్వం, హుందాతనం, అందర్నీ కలుపుకుపోయే తత్త్వం, క్యారక్టర్, సమాజం పై వుండే నిబద్ధత, దయాగుణం లాంటి లక్షణాల పైనే ఫోకస్ పెట్టి అవి ఏ విధంగా ట్రంప్ లో లేవో అనేది ప్రజల్లోకి చొప్పించాలనే తాపత్రయం కనబడింది. జో బైడెన్ ఉపన్యాసం విధానాల పైనకన్నా వీటిపైనే ఫోకస్ చేయటం జరిగింది. దీనిపై ప్రజల్లో సానుకూల స్పందన కనబడింది.
ఇలా జరగటానికి కారణం గత నాలుగు సంవత్సరాల్లో ట్రంప్ ప్రవర్తించిన తీరే. నోరు పారేసుకోవటం లో పిహెచ్ డి సంపాదించాడు. ముఖ్యంగా మహిళల్లో తర తమ భేదం లేకుండా అందరూ అసహ్యించుకునే స్థాయికి వచ్చారంటే తన ప్రవర్తన వలనే. అదేసమయం లో ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రభుత్వ పాలన బాగానే వుందని చెప్పొచ్చు. ఉద్యోగ కల్పన లో మంచి పురోగతి సాధించాడు. వ్యాపారం, ఆర్ధిక వృద్ధి కూడా మంచి ఫలితాలనే ఇచ్చాయి. వ్యక్తిగత పన్నులు, కార్పోరేట్ పన్నులు, సన్న, మధ్యతరగతి వ్యాపారస్తుల పన్నులు తగ్గించి పన్ను సానుకూల నిర్ణయాలు తీసుకున్నాడు. ఇదంతా కరోనా మహమ్మారి రాకముందు. కరోనా మహమ్మారి తో ఒక్కసారి పరిస్థితుల్లో మార్పులొచ్చాయి. ఈ మహమ్మారి ని అరికట్టడంలో ఎన్నో వివాదాస్పద ప్రకటనలతో మరింతమందిని దూరం చేసుకున్నాడు. కరోనా మహమ్మారి రాకుండా వుండివుంటే తన ప్రవర్తన , క్యారక్టర్ లో ఎన్ని లోపాలున్నా తిరిగి ప్రజలు పట్టంకట్టే అవకాశాలు ఎక్కువగానే ఉండేవి. ఎందుకంటే ఆర్ధిక వృద్ధి, ఉద్యోగ కల్పన ప్రధాన ఎన్నిక అంశాలుగా ఉండేవి. కానీ ఇప్పుడు షుమారు ఒక లక్ష డెభై ఐదువేలమంది మరణించిన తర్వాత అదే అంశం ప్రధాన అంశంగా మారటం సహజమే. కనీసం రోజూ పత్రికా సమావేశం నిర్వహించి నోటి దూల తీర్చుకోకుండా వుండి వుంటే ఇంత ప్రతికూల వాతావరణం ఏర్పడి వుండేది కాదు. ఈ నాలుగు రోజుల డెమొక్రాట్ల సదస్సు లో ట్రంప్ ప్రవర్తన, వ్యక్తిత్వం పైనే కేంద్రీకరించటం వ్యూహాత్మక ఎత్తుగడనే. విధానాల కన్నా బరిలో వున్న ఇద్దరి వ్యక్తిత్వాలపైనే ఈ సదస్సు ఫోకస్ చేయటం దాన్ని ప్రజలు సానుకూలంగా తీసుకోవటం ఈ వ్యూహం సరయినదేనని అర్ధమవుతుంది.
Also Read : బ్రహ్మం గారు చెప్పింది మరోసారి నిజమైంది.. ఏంటంటే?
డెమోక్రాట్లు ఐక్యంగా వుంటారా?
ఇది అందరిలో తొలుస్తున్న ప్రశ్న. దీనికి కూడా ఈ సదస్సు లో సమాధానం దొరికింది. ప్రతిపాదిత ఆర్ధిక, సామాజిక, దేశ భద్రతా అంశాలు చర్చకు వచ్చివుంటే వీళ్ళ మధ్య వున్న ఆంతరంగిక విభేదాలు బయకి వచ్చి ఉండేవి. ఎందుకంటే ఇటీవలి కాలంలో వామపక్ష ఉదారవాదులు గా , అభ్యుదయ వాదులు గా పిలవబడే వాళ్ళు డెమోక్రటిక్ పార్టీలో చురుకుగా ముందుకొచ్చారు. వీరు కొన్ని చోట్ల దిగ్గజాలనుకున్న వారిని ప్రైమరీల్లో ఓడించటం పెద్ద సంచలనం సృష్టించింది. కానీ ఈ సదస్సులో వాళ్ళు ఆ విధానాలను ముందుకు తీసుకొచ్చి వివాదం సృష్టించాలని ప్రయత్నించలేదు. ఎందుకంటే అందరికీ ఎలాగైనా ట్రంప్ ఓడిపోవాలని బలంగా వుండటం తో వివాదాలను పక్కకు పెట్టి ఇక్యతను ప్రదర్శించారు. ఒకవిధంగా చెప్పాలంటే ట్రంప్ వీళ్ళ మధ్య ఐక్యతకు పరోక్షంగా దోహదం చేసాడని చెప్పొచ్చు. రెండోది, జో బైడెన్ వివాద రహితుడు కావటం. అందరినీ కలుపుకోనిపోయే గత చరిత్ర వుండటం కూడా దోహదం చేసింది. మూడోది, వామపక్ష ఉదారవాద ప్రభావం తో పార్టీ పనిచేస్తుందనే భావాన్ని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవటం కూడా వైరి పక్ష విమర్శలకు తావివ్వకుండా చేసింది. నాలుగోది అందులో భాగంగా ట్రంప్ కి వ్యతిరేకంగా వున్న రిపబ్లికన్లను సదస్సులో మాట్లాడటానికి ప్రాధాన్యత కల్పించి మధ్యస్థ వోటర్లను ఆకర్షించే ప్రయత్నం చేయటం. ఇలా మొత్తం మీద ఈసారి డెమోక్రాట్లు ఒకేమాట మీద వున్నారని దానితోపాటు రిపబ్లికన్లలో కూడా కొంతమంది ఈసారి బైడెన్ గెలవాలని కోరుకుంటున్నారనే భావన తీసుకు రావటానికి కృషి చేసారు. చాలావరకు ఈ వ్యూహంలో విజయవంతమయినట్లే కనిపిస్తుంది.
దానితోపాటు ముందుగానే వామపక్ష ఉదారవాద ఆర్ధిక విధానాల వైపు మొగ్గు చూపటం లేదనే సంకేతాలు బైడెన్ ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగానే వామపక్ష వుదార వాద అజెండా అయిన ” అందరికీ ఉచిత వైద్యం, అందరికీ ఉచిత కాలేజీ విద్య, విద్యార్ధులకు సంబంధించిన రుణాలు రద్దు, స్వేచ్చా బోర్డర్లు, కొత్త వాతావరణ ఒప్పందం, వలసవాద పర్యవేక్షణ రద్దు, పోలీసులకు నిధుల రద్దు, రక్షణ బడ్జెట్ లో కోత, షేల్ సాంకేతికతతో జరిపే ఇంధన తవ్వకాల నిషేధం, ఇజ్రాయెల్ పై ఆంక్షలు” లాంటి అంశాలను ఆమోదించలేదు. కాకపోతే సామాజిక, సాంస్కృతిక అంశాల్లో మధ్యేవాదులకు, అభ్యుదయ వాదులకు పెద్దగా అంతరం లేదు. వామపక్ష అభ్యుదయ వాదులు కూడా వ్యూహాత్మకంగానే వ్యవహరించారు. ఎన్నికల వరకూ వీటిపై మాట్లాడకూడదని ఆ తర్వాత ప్రభుత్వం పై ఒత్తిడి పెంచాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ ఐక్యత ఎన్నికల వరకేనని తర్వాత అంతరంగిక యుద్ధం కొనసాగుతుందని చెబుతున్నారు.
మొత్తం మీద చూస్తే ఈ సదస్సు వాళ్ళు అనుకున్న వ్యూహం ప్రకారం విజయవంతమయ్యిందనే భావనలో వున్నారు. కానీ రిపబ్లికన్లు మాత్రం అప్పుడే ఈ సదస్సు పై విమర్శల బాణం ఎక్కుపెట్టారు. అసలు చైనా పై విమర్శ కాదు కదా దాని ఊసు కూడా ఎత్తలేదని, అలాగే ఇటీవల జరిగిన షాపుల లూటీ , ఆస్తుల ధ్వంసం లాంటి హింసాత్మక సంఘటనల పై నోరు మెదపలేదనీ, అధిక పన్నులు వేయబోతున్నారని, వామపక్ష తీవ్రవాదులు పార్టీని , పార్టీ అజెండా ని హైజాక్ చేసారని ప్రచారం మొదలుపెట్టారు. వచ్చేవారం నాలుగురోజుల రిపబ్లికన్ల సదస్సు జరగబోతుంది. దానితో వారి వ్యూహం, ఎత్తుగడలు కూడా బయటకొస్తాయి. తర్వాత ఇద్దరి అభ్యర్ధుల మధ్య మూడు టివి డిబేట్లు జరుగుతాయి. వీటితోపాటు వలసవిధానం, భారత్ అమెరికా సంబంధాలు లాంటి అంశాలపై, ఎన్నికల్లో ఎవరికి విజయావకాశాలు లాంటి అన్ని అంశాలపై కూడా సవివరంగా రాబోయే రోజుల్లో మా అభిప్రాయాలు మీ ముందుంచుతాము, వేచి చూడండి.
Also Read : న్యాయవ్యవస్థకు శస్త్రచికిత్స జరగాలి
An Independent Editor, Trend Stetting Analyst.
Read MoreWeb Title: Chances of democrats in american elections
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com