ప్రజలకు మేలు చేయాలని రాజకీయం నాయకుడికి మనసు నిండా ఉండొచ్చు.. కానీ అనుకోగానే చేసేయడానికి ఇదేమీ సినిమా కాదు. పరిస్థితులు అనుకూలించాలి. వాటికి తగ్గట్టుగా స్పందించి, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నవారికే విజయాలు దక్కుతాయి. ఏపీలో వైసీపీ, టీడీపీలకు పూర్తిభిన్నమైన పరిస్థితి జనసేనది. తెలుగుదేశం పార్టీ అనేది ఎన్టీఆర్ స్థాపించినది. నాలుగో దశాబ్దం వైపు పయనిస్తున్న ఆ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా కేడర్ ఉంది. ఇవాళ రాజకీయం చేసేవాళ్లు దాన్ని సరిగ్గా వినియోగించుకుంటే సరిపోతుంది.
వైసీపీ కూడా ఇలాంటిదే. వైఎస్ ఎవరి మనిషి అని చెప్పుకున్నా.. దశాబ్దాల నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆయన. వైఎస్ మరణంతో కాంగ్రెస్ సంప్రదాయ శ్రేణులన్నీ జగన్ కు బాసటగా నిలిచాయి. కాబట్టి.. జగన్ నేరుగా సొంత పార్టీ పెట్టి, కేడర్‌ను తయారు చేసుకున్నాడని చెప్పడానికి లేదు. జగన్ ఆకర్షణతో ఆయన వెంట వచ్చిన వారు ఉండొచ్చుగాక.. కానీ, తండ్రి వేసిన మూలాలే ఆయనకు పెట్టుబడి.
కానీ.. పవన్ కల్యాణ్ పరిస్థితి అది కాదు. అప్పటి వరకూ ఎలాంటి రాజకీయ బలం, బలగం ఆయనకు లేదు. పైపెచ్చు నష్టం ఉంది. ఆయన అన్న పార్టీ పెట్టి, దాన్ని మరో పార్టీలో విలీనం చేసిపోయాడనే అపవాదు కూడా ఉంది. టెక్నికల్ గా చూసుకున్నప్పుడు ఇది కూడా పవన్ కు ఇబ్బంది పెట్టే అంశమే. ఈ విధంగా.. ఏ మాత్రం సానుకూల అవకాశాలు లేని చోట.. రాజకీయ సేద్యం చేయడానికి, బంగారు పంట పండించడానికి సిద్ధమయ్యాడు పవన్ కల్యాణ్.
అయితే.. ముందుగా చెప్పుకున్నట్టు అనుకోగానే అన్నీ కుదరవు కదా! పైపెచ్చు.. అధికార పార్టీ ఒకవైపు.. అనుభవం పేరుతో ఉన్న ప్రధాన ప్రతిపక్షం మరోవైపు వేళ్లూనుకుని ఉన్నాయి. అలాంటి పార్టీల వేళ్లను పెకిలించి, జనసేన నూతన రాజకీయ విధానాన్ని సాగుచేయాలంటే.. బలమైన చెట్టుగా నిలబడాలంటే తేలికైన విషయం కాదు. అయితే.. ఇన్నాళ్లూ పవన్ కు ఈ ఛాన్స్ పెద్దగా రాలేదనే చెప్పాలి. ఆర్థిక సమస్యలతో అనివార్యంగా సినిమాల్లోకి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో.. అటు సినిమాలకు, ఇటు రాజకీయాలకు టైమ్ అడ్జెస్ట్ చేసుకోవడం పవన్ కు సవాల్ గా మారింది.
కానీ.. జనాలకు అవన్నీ అవసరం లేదు. తమ తరపున పోరాడే వారు ఎవరు అన్నది మాత్రమే గుర్తిస్తారు. కాబట్టి.. అనివార్యంగా పవన్ రణరంగంలోకి దిగాల్సి ఉంది. దానికి ఇప్పుడే సరైన అవకాశంగా చెబుతున్నారు విశ్లేషకులు. తెలుగు దేశం పార్టీ పూర్తిగా డీలా పడిపోయింది. ఇటు అధికార పక్షం లోపాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. జాబ్ క్యాలెండర్ వంటి అంశాలు పోరాటానికి అవకాశం ఇస్తున్నాయి. వీటన్నింటినీ ఉపయోగించుకొని, రాష్ట్రంలో ఎదిగేందుకు అనువైన వాతావరణం ఉందని అంటున్నారు. ఇక, ఉద్యమించాల్సింది పవన్ మాత్రమే అని చెబుతున్నారు. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఇక ఆలస్యం పవన్ దే!