Revanth Reddy: టీపీసీసీగా రేవంత్ రెడ్డి నియామకం అయ్యాక కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ నెలకొంది. టీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి దూకుడుగా వెళుతుండటంతో కాంగ్రెస్ మళ్లీ పూర్వవైభవం సంతరించుకుంటుందనే భావన ఆపార్టీ శ్రేణుల్లో వ్యక్తమైంది. గతంలోని పనిచేసిన అధ్యక్షుల కంటే రేవంత్ రెడ్డి మెరుగ్గా పని చేస్తున్నారు. అయితే ఆయనకు సీనియర్లు నుంచి పెద్దగా సహకారం లభించకపోవడతో కాంగ్రెస్ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది.
కాంగ్రెస్ లో వర్గపోరు ఎప్పటికీ ఉండేదే. సీనియర్లు, జూనియర్లు అంటూ వారిలోవారే కొట్టుకు చస్తుంటారు. వీటినే ప్రత్యర్థి పార్టీలు అస్త్రాలుగా మలుచుకుంటూ కాంగ్రెస్ ను దెబ్బతిస్తుంటాయి. పదవుల ఆశలను చూపుతూ మెల్లిగా నాయకులను తమ పార్టీల్లోకి ఎగురేసుకొని పోతుంటాయి. దీంతో ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలహీనంగా మారుతోంది. దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన నేతలు ఎవరికీ వారే యమునతీరే అన్నట్లుగా ప్రవర్తిస్తుండటంతో నానాటికీ కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోతుంది.
ఆఖరికి కాంగ్రెస్ సభ్యత్వ నమోదు విషయంలోనూ నాయకుల మధ్య ఐక్యత కన్పించడం లేదని తెలుస్తోంది. డిసెంబర్ 9న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆపార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కాంగ్రెస్ పూనుకుంది. నియోజకవర్గానికి 30వేలకు తక్కువ కాకుండా సభ్యత్వ నమోదు చేయాలని అధిష్టానం సూచనలు చేసింది.
నిజామాబాద్ జిల్లాలో మాత్రం సభ్యత్వ నమోదు కార్యక్రమం నత్తనడకన సాగుతోంది. ఈ జిల్లాలో నియోజకవర్గానికి 30వేల సభ్యత్వాల చొప్పున ఐదు సెగ్మెంట్లలో లక్షా 50వేల సభ్యత్వాలను చేపట్టాలని టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పటిదాకా జిల్లా వ్యాప్తంగా 15వేల సభ్యత్వాలే నమోదు అయ్యాయ్యాయని తెలుస్తోంది. ఈ జిల్లాలోని నేతల మధ్య విబేధాలు, నియోజకవర్గ ఇన్ ఛార్జి, నేతలను నియమించకపోవడంతోనే సభ్యత్వాల నమోదు వేగంగా జరుగడం లేదనే ప్రచారం జరుగుతోంది.
ఇందూరు జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండేది. 2004లో తొమ్మిది అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. 2009లో కొన్ని స్థానాలకే కాంగ్రెస్ పరిమితమైంది. ఆ తర్వాత జరిగిన 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ ఒక్క సీటు కూడా గెల్చుకోలేక చతికిలబడింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అయితే టీపీసీసీగా రేవంత్ నియామకం అయ్యాక ఈ జిల్లాలోనూ కొత్త జోష్ వచ్చింది
Also Read: రాజకీయ నేతలకూ ఫ్యాన్స్ ఉన్నారుగా?
నిజామాబాద్ జిల్లాకు చెందిన మధుయాష్కీ ప్రచార కమిటీ ఛైర్మన్ గా ఉండటంతో ఈ జిల్లాలో కాంగ్రెస్ తిరిగి పుంజుకుంటుందనే భావన నెలకొంది. అయితే ప్రస్తుతం నమోదవుతున్న సభ్యత్వాలను చూస్తుంటే అది సాధ్యంకాకపోవచ్చనే చర్చ కార్యకర్తల్లో నడుస్తోంది. రేవంత్ ఒక్కడే పార్టీ కోసం కష్టపడితే సరిపోదని మిగతా నేతలు కూడా పార్టీ కోసం కష్టపడితేనే పార్టీ బలపడుతుందని అంటున్నారు.
పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే రేవంత్ రెడ్డి ఈ జిల్లాపై ఫోకస్ పెట్టాలని కార్యకర్తలు కోరుతున్నారు. పార్టీ నేతల మధ్య విబేధాలను పరిష్కరించి నియోజకవర్గ ఇన్ ఛార్జిలను నియమిస్తే పార్టీ తిరిగి గాడిలో పడుతుందని చెబుతున్నారు. అన్ని జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉంటేనే వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కే ఛాన్స్ ఉంటుందని లేకుంటో మరోసారి ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యకమవుతోంది. మరీ ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఎలా ముందుకెళుతారో వేచిచూడాల్సిందే..!
Also Read: కాంగ్రెస్ జవసత్వాలు నింపేందుకే రేవంత్ రెడీ?