Revanth Reddy : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి కాంగ్రెస్ అధికారి చేపట్టబోతుంది. ఆదివారం జరిగిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మేజిక్ ఫిగర్ దాటటడంతో సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. తెలంగాణ ఏర్పడిన తరువాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదేళ్లు అధికారంలో ఉన్నారు. ఈ క్రమంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీల పథకాలు వెంటనే చేపడుతామని ఆ పార్టీ నాయకులతో పాటు అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తూ వచ్చారు. అలాగే పార్టీలో ఎంతో మంది అసంతృప్తులు ఉన్నరు. ఇప్పటికే కొందరు సీఎం పదవిపై ఆసక్తి కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో సీఎం గా బాధ్యతలు చేపట్టబోయే రేవంత్ రెడ్డికి ఎలాంటి సవాళ్లు ఎదురుకానున్నాయి? వాటిని ఎలా పరిష్కరించబోతున్నారు?
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కాంగ్రెస్ ఎక్కువ సీట్లలో గెలవకపోయినా.. రెండోస్థానంలో నిలిచింది. అయితే కొందరు పార్టీపై గెలిచిన వారు టీఆర్ఎస్ లోకి చేరారు. ఆ తరువాత 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ పై ఉన్న అభిమానంతో మరోసారి ఆ పార్టీకే పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మరికొందరు గెలిచారు. దీంతో 9 మంది టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో పార్టీలో వలసలను నివారించే నాయకుడు లేకుండా పోయారు. ఇదే సమయంలో బీజేపీ బలపడడం మొదలవడంతో కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోయింది.
ఈ పరిస్థితిని బాగా గమనించిన అధిష్టానం 2021లో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పగ్గాలు అప్పజెప్పింది. అయితే అప్పటికే రేవంత్ రెడ్డికి కాస్తా ఫాలోయింగ్ ఉండడంతో పార్టీ మరోసారి గాడిలో పడుతుందని భావించింది. కానీ రేవంత్ రెడ్డికి సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ముఖ్యంగా ఆయనకు టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడంపై సీనియర్లు తీవ్రంగా అసంతృప్తి చెందారు. వీహెచ్ హనుమంత రావు వంటివాళ్లు బహిరంగంగానే కామెంట్ చేశారు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏకంగా తనకు టీపీసీసీ పదవి ఇవ్వాలని అధిష్టానం బాట పట్టారు.
అయితే పార్టీలో సీనియర్ల పరిస్థితిని గమనించిన రేవంత్ రెడ్డి ఒక్కొక్కరిని కలుస్తూ వచ్చారు. అసంతృప్తిని చల్లర్చడానికి ఎంతో ప్రయత్నించారు. అయితే హుజూరాబాద్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆలస్యంగా టికెట్ ఇవ్వడంతో పాటు స్థానికులకు కాకుండా బయటి వ్యక్తికి అవకాశం ఇవ్వడంపై పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ స్థాయికి పడిపోవడంతో రేవంత్ రెడ్డితోనూ పార్టీ మారదని కొందరు ఆయనను పట్టించుకలేదు.
కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా రేవంత్ రెడ్డి ముందకు సాగారు. అయినా కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు రేవంత్ రెడ్డి తప్పులు ఎక్కడ దొరుకుతాయా? అని ఎదురుచూస్తుంటారని కొందరు అంటుంటారు. ఈ క్రమంలో అధికారం చేపట్టబోయే కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి ముందుగా సీనియర్లనుఅదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీలో ఎలాంటి అసంతృప్తులు లేకుండా ఉండడంతోనే ప్రభుత్వ మనుగడకు ఎలాంటి అడ్డంకులు ఏర్పడవని అంటున్నారు.
మరోవైపు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి, పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ను కాదని రేవంత్ రెడ్డికి ప్రజలు అవకాశం ఇచ్చారు. దీంతో పార్టీ ప్రకటించి ఆరు గ్యారెంటీల పథకాలతో పాటు అభివృద్ధిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాల్లో ఎక్కడ తేడా కొట్టినా ప్రజలు తిరగబడే ప్రమాదం ఉంది. ఎందుకంటే రైతు బంధు, పింఛన్ లాంటి రెగ్యులర్ పథకాలు పొందిన వారు సైతం కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే ఎలా చేస్తుందోనని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి రెండు వైపులా పదునైన కత్తి లాగే ప్రభుత్వం నడపడం అని చర్చించుకుంటున్నారు.