Homeజాతీయ వార్తలుPonguleti Srinivasa Reddy: పంతం నెగ్గించుకున్న పొంగులేటి

Ponguleti Srinivasa Reddy: పంతం నెగ్గించుకున్న పొంగులేటి

Ponguleti Srinivasa Reddy: కాలం కలిసి రాకపోతే తాడే పామే కరుస్తుంది అంటారు. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రూపంలో భారత రాష్ట్ర సమితికి అలాంటి అనుభవం ఎదురయింది.. ఎందుకంటే ఈ జిల్లాలో భారత రాష్ట్ర సమితి మొదటి నుంచి కూడా బలహీనంగానే ఉంది. 2014 ఎన్నికల్లో ఇక్కడ భారత రాష్ట్ర సమితి ఒక్క స్థానం మాత్రమే గెలుచుకుంది. అప్పట్లో పొంగులేటి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి ఇక్కడ పోటీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి గాలివీస్తే ఖమ్మంలో మాత్రం పొంగులేటి తాను ఎంపీగా గెలవడమే కాకుండా ఏకంగా మూడు అసెంబ్లీ స్థానాలలో తన పార్టీ అభ్యర్థులు గెలుచుకునేలా చేశాడు. మిగతా స్థానాల్లోనూ తక్కువ ఓట్ల తేడాతోనే ఆయన వర్గంలోని అభ్యర్థులు ఓడిపోయారు. అయితే పొంగులేటి స్టామినా గుర్తించిన అధికార భారత రాష్ట్ర సమితి కొంతకాలానికి ఆయనను, ఆయన తరపు ఎమ్మెల్యేలను చేర్చుకుంది. ఇక అప్పటినుంచి పొంగులేటి ఖమ్మం జిల్లాలో మరింత బలమైన శక్తిగా ఎదిగారు. అయితే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ టికెట్ కేటాయించలేదు. ఆయనకు బదులుగా టికెట్ ఇచ్చారు. అయినప్పటికీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మారుమాట మాట్లాడకుండా నామ నాగేశ్వరరావు గెలుపు కోసం కృషి చేశారు.

తర్వాతి రాజకీయ పరిణామాలతో బయటికి

ఎంపీకి బదులుగా ఎమ్మెల్సీ స్థానం కూడా ఇస్తానని కెసిఆర్ అప్పట్లో ప్రకటించారు. దానిని కూడా నిలబెట్టుకోకపోవడంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బయటికి వచ్చారు.. ఆ తర్వాత ఆయన అనుచరులు కూడా భారత రాష్ట్ర సమితికి రాజీనామా చేశారు. అప్పటినుంచి కాంగ్రెస్ పార్టీలో చేరేవరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు.. అంతేకాదు ఆయా నియోజకవర్గాలలో తన తరఫు వారిని ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించారు. అంతేకాదు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ ఒక్క భారత రాష్ట్ర సమితి నాయకుడిని కూడా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వబోనని సవాల్ విసిరారు. ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు.. పార్టీ అభివృద్ధికి కృషి చేశారు.. తనవారికి కాకుండా వేరే వారికి టికెట్లు వచ్చినప్పటికీ కూడా.. వారి విజయం కోసం కృషి చేశారు. ఫలితంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 8 సీట్లలో భారత రాష్ట్ర సమితి గెలిచింది. కొత్తగూడెంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది.. ఫలితంగా ఆస్థానం లో సిపిఐ విజయ పతాకం ఎగరవేసింది. భద్రాచలంలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి తెల్లం వెంకట్రావు గెలిచినప్పటికీ.. అతడు కూడా పొంగులేటి శిష్యుడే. రేపో మాపో ఆయన కూడా పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఆ ఎంపీ సీటు వెనక ఇచ్చి ఉంటే

పొంగులేటికి కెసిఆర్ కు మధ్య గ్యాప్ ఏర్పడడానికి ప్రధాన కారణం ఎంపీ టికెట్ ఇవ్వకపోవడమే. నాడు ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి తీరా టికెట్ కేటాయింపులో కేసీఆర్ మాట మార్చారని పొంగులేటి వర్గం వారు ఇప్పటికీ చెబుతుంటారు. నాడు నామకు కాకుండా పొంగులేటికి టికెట్ ఇచ్చి ఉంటే పరిస్థితి ఇప్పటిదాకా వచ్చి ఉండేది కాదని వారు చెబుతుంటారు. పైగా కేటీఆర్ అండ చూసుకొని అప్పటి స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, చివరికి పొంగులేటి బర్త్డే రోజున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా తొలగించాలని.. అందువల్లే పొంగులేటి భారత రాష్ట్ర సమితి మీద వైరం పెంచుకున్నారని వివరిస్తుంటారు.. ఏది ఏమైనప్పటికీ ఒకప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక వెలుగు వెలిగిన భారత రాష్ట్ర సమితి నేడు దయనీయమైన పరిస్థితిలోకి వెళ్లిపోవడం నిజంగా స్వయంకృతాపరాధం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular