Polavaram Project: పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఝలక్ ఇచ్చింది. ఇష్టరాజ్యంగా నిధులు ఖర్చు చేస్తే ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. ప్రధానంగా ఎడమ, కుడి కాలువల్లో కేంద్రం అనుమతించిన పరిమితులను దాటి నిర్మాణాలు చేపట్టినందున.. అదనంగా చేసిన ఖర్చును ఇవ్వబోమని పోలవరం అథారిటీ స్పష్టం చేసింది. ప్రతిపాదించిన మొత్తంలో 75% నిధులను మాత్రమే పరిగణలోకి తీసుకుని చెల్లిస్తామని.. మిగతాది ఇవ్వబోమని తేల్చేయడం విశేషం.
రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా నిధులను ఖర్చు చేస్తోంది. చివరకు సాగునీటి శాఖపనులు చూసే ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది జీతభత్యాలను సైతం పోలవరం ఖర్చులలో జమ చేస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్రం జీతాల విషయంలో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటివరకు ఖర్చు చేసిన మొత్తంలో రూ. 984. 44 కోట్లు ఇవ్వబోమని చెప్పేసింది. ఇటీవల ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన గేయ నివేదికను ఏపీ అధికారులు కేంద్ర జలశక్తి అధికారులను కోరారు. దీంతో కేంద్రాధికారులు స్పష్టతనిచ్చారు.
పోలవరం ప్రాజెక్టు అంశానికి సంబంధించి కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.1511 కోట్లు రావాల్సి ఉంది. ఇందులో రూ. 238. 78 కోట్ల బిల్లులు ఇచ్చేందుకు పోలవరం అథారిటీ కేంద్రానికి సిఫారసు చేసింది. భూసేకరణ, పునరావాసానికి సంబంధించి మరో 2008 కోట్లు బిల్లులు పోలవరం అథారిటీ పరిశీలనలో ఉన్నాయి. అంతకుమించి పైసా ఇచ్చేది లేదని కేంద్రం స్పష్టం చేయడం గమనార్హం.
ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ పనుల్లో రూ. 314.79 కోట్లు, ఎడమ కాలువ పనుల్లో రూ. 329.08 కోట్లు, కుడి కాలువ పనుల్లో రూ. 190. 28 కోట్లు, అధికారుల, ఉద్యోగుల జీతాల్లో రూ.100.41 కోట్లు ఇవ్వమని కేంద్రం తేల్చి చెప్పింది. కేంద్రం అనుమతించిన పరిమితులను దాటి నిర్మాణాలు చేపట్టినందుకు ఈ నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు తో పాటు ఇతర ప్రాజెక్టులలో సేవలందిస్తున్న అధికారులకు జీతాలు తాము ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించింది. కేంద్రం తాజా నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఆందోళనకు గురైంది. దీని ప్రభావం ప్రాజెక్టు నిర్మాణం పై పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.