https://oktelugu.com/

మమత యాక్షన్.. కేంద్రం రియాక్షన్

యాస్ తుఫాన్ పలు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపించింది. ఏపీ, ఒడిషా రాష్ట్రాలతోపాటు పశ్చిమ బెంగాల్లో విధ్వంసం సృష్టించింది. ఈ నేపథ్యంలో బెంగాల్లో జరిగిన నష్టంపై పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని కలైకుండలో ప్రధాని సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి గవర్నర్ జగదీప్ ధనఖర్, బెంగాల్ విపక్ష నేత సువేందు అధికారి హాజరయ్యారు. కానీ.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం దాదాపు అరగంట ఆలస్యంగా వచ్చారు. యాస్ తుఫాను వల్ల బెంగాల్ కు జరిగిన నష్టంపై […]

Written By:
  • Rocky
  • , Updated On : May 29, 2021 / 09:33 AM IST
    Follow us on

    యాస్ తుఫాన్ పలు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపించింది. ఏపీ, ఒడిషా రాష్ట్రాలతోపాటు పశ్చిమ బెంగాల్లో విధ్వంసం సృష్టించింది. ఈ నేపథ్యంలో బెంగాల్లో జరిగిన నష్టంపై పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని కలైకుండలో ప్రధాని సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి గవర్నర్ జగదీప్ ధనఖర్, బెంగాల్ విపక్ష నేత సువేందు అధికారి హాజరయ్యారు. కానీ.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం దాదాపు అరగంట ఆలస్యంగా వచ్చారు.

    యాస్ తుఫాను వల్ల బెంగాల్ కు జరిగిన నష్టంపై ప్రధానికి వినతిపత్రం అందించి వెళ్లిపోయారు. ఇక, బెంగాల్ కు చెందిన చీఫ్ సెక్రెటరీతోపాటు ఇతర అధికారులు ఎవరూ సమావేశానికి హాజరు కాలేదు. మమత తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. రాజకీయాలు ఎలా ఉన్నా.. ఇలాంటి విపత్కర సమయంలో రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల విషయంలో ఇలా వ్యవహరించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమైంది.

    అయితే.. మమత చర్యపై కేంద్రం వెంటనే స్పందించింది. ప్రధాని సమావేశానికి హాజరుకానందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలపన్ బందోపాధ్యాయ్ ను రీకాల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. నాలుగు రోజుల క్రితమే ఆయన పదవీ కాలాన్నిమూడు నెలలపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

    ప్రధాని సమీక్షలో మమత వ్యవహరించిన తీరుపట్ల రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధనకర్ కూడా అసంతృప్తి వ్య‌క్తం చేశారు. బెంగాల్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ప్రధాని సమక్షంలో జరిగిన సమావేవానికి సీఎం, అధికారులు హాజరు కావాల్సి ఉందన్న ఆయన.. వారి గైర్హాజరీ సరైంది కాదని సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

    దీంతో.. బెంగాల్లో ఎన్నికలు ముగిసినప్పటికీ.. కేంద్రం లోని బీజేపీ, రాష్ట్రంలోని టీఎంసీ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉందన్న విషయం మరోసారి తేటతెల్లం అయ్యిందని అంటున్నారు.