సాధారణంగా కేంద్రం జెడ్ కేటగిరీ, వై కేటగిరీ భద్రత రాజకీయ నాయకులకు కల్పిస్తుందనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా కేంద్ర హోం శాఖ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కు వై కేటగిరీ భద్రత కల్పించేందుకు సిద్ధమైంది. కంగనా ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్ తో పోలుస్తూ చేసిన వ్యాఖ్యల వల్లే కేంద్ర హోం శాఖ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కాస్త భోళాతనం ఉన్న కంగనా రనౌత్ ఏ విషయంలోనైనా కుండ బద్దలుగొట్టినట్లుగా మాట్లాడుతుంది.
Also Read : మాజీ హాట్ బ్యూటీకి కరోనా.. ఆ హీరో వల్లే !
ముంబైను పీవోకేతో పోల్చటంతో గత కొన్ని రోజులుగా కంగనా రనౌత్ కు పెద్ద ఎత్తున బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కొందరు ఫోన్ కాల్స్ లో ఆమెను చంపేస్తున్నామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. మరోవైపు కంగనా ఈ నెల 9వ తేదీన ముంబై పర్యటన పెట్టుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కంగనా ముంబై పర్యటన ఏ మాత్రం సేఫ్ కాదని తెలిసినా ఆమె మాత్రం వెనక్కు తగ్గడం లేదు.
ప్రస్తుత పరిస్థితుల్లో కంగనా ముంబై పర్యటన అధికారులను సైతం టెన్షన్ పెడుతుండటం గమనార్హం. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం థాకూర్ కంగనా సోదరి, తండ్రి తనను వ్యక్తిగతంగా కలిసి కోరడంతో కేంద్రంతో మాట్లాడి వై కేటగిరీ భద్రత ఏర్పాటు చేయించామని అన్నారు. కేంద్రహోం మంత్రిత్వ శాఖ వర్గాలు కంగానాకు ఒక పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్, 11 మంది పోలీసులు భద్రతగా ఉంటారని తెలిపారు.
జూన్ నెల 14వ తేదీన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ముంబై పోలీసుల విచారణ తీరును ఈ కేసు విషయంలో తప్పు బడుతూ కంగనా చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. అయితే కేంద్రం భద్రత కల్పించినా ఆమె ముంబై పర్యటన విషయంలో ఉత్కంఠ నెలకొంది.
Also Read : ‘బిగ్ బాస్ 4’ కంటెస్టెంట్ల కన్నీటి గాథలు !